‘అమ్మ’కు ఆర్థిక సాయం | Financial Assistance to Pregnant women | Sakshi
Sakshi News home page

‘అమ్మ’కు ఆర్థిక సాయం

Published Thu, May 18 2017 3:34 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

‘అమ్మ’కు ఆర్థిక సాయం - Sakshi

‘అమ్మ’కు ఆర్థిక సాయం

ప్రసూతి ప్రయోజన పథకానికి కేబినెట్‌ ఆమోదం
- తొలికాన్పుకు ఆరువేలు
- విద్యుత్‌ రంగానికి ఇంధన సరఫరాపై కొత్త విధానం
- 10 దేశీయ అణువిద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా  


న్యూఢిల్లీ: గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేల ఆర్థిక సాయాన్నందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అయితే ఇది మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. భేటీ నిర్ణయాలను విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాకు వివరించారు. ‘పాలిచ్చే తల్లికి (మొదటి కాన్పు) రూ. 6వేలు అందిస్తాం. ఇందులో రూ.5వేలను మూడు విడతల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ నేరుగా తల్లి అకౌంట్లోకి వేస్తుంది’అని మంత్రి వెల్లడించారు.

గర్భవతిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నప్పుడు రూ.1000, ఆర్నెల్ల తర్వాత రూ.2000, ఆస్పత్రిలో బిడ్డ పుట్టిన తర్వాత మరో రెండు వేల రూపాయలను (మొదటి విడత బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్‌–బి టీకాలు వేయించుకున్నారన్న ధ్రువీకరణ తర్వాతే) అందజేస్తారు. మిగిలిన ప్రసూతి లాభాలు ప్రస్తుతమున్నట్లుగానే వర్తిస్తాయి. మొత్తంగా కలుపుకుని తల్లుల ఖాతాలో రూ.6వేలు చేరతాయి. అయితే, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. అయితే రెండో కాన్పుకు ఈ ప్రసూతి ప్రయోజన ప్రథకాన్ని వర్తింపజేయకపోవటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

7వేల మెగావాట్ల అణువిద్యుత్‌ ప్లాంట్లు
దేశీయ అణువిద్యుదుత్పత్తికి తోడ్పాటునందించేందుకు స్వదేశీ తయారీ 10 అణురియాక్టర్ల నిర్మాణానికి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఒకేసారి ఇన్ని రియాక్టర్లకు అనుమతివ్వటం ఇదే మొదటిసారి. ‘ఒకసారి వీటి నిర్మాణం పూర్తయితే.. ఒక్కోటి 700 మెగావాట్ల చొప్పున మొత్తం 7వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది’ అని పీయుష్‌ గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న 22 ప్లాంట్ల ద్వారా 6780 మెగావాట్ల అణువిద్యుత్‌ను భారత్‌ ఉత్పత్తి చేస్తోంది. రాజస్తాన్, గుజరాత్, తమిళనాడుల్లో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల ద్వారా 2021–22 కల్లా మరో 6700 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది. కాగా, ఈ ప్రాజెక్టుల వల్ల 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని గోయల్‌ తెలిపారు.

విద్యుత్‌ రంగానికి ఇంధన సరఫరాపై..
విద్యుదుత్పత్తి రంగానికి ఇంధన సరఫరా చేసే కొత్త విధానానికి ఆమోదం తెలిపిన కేబినెట్‌.. వేలం ద్వారా లేదా పోటీ బిడ్డింగ్‌ టారిఫ్‌ల ఒప్పందాల ద్వారానైనా బొగ్గు సరఫరా జరగాలని నిర్ణయించింది. ‘దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో ఉండే పరిస్థితి నుంచి.. అవసరానికి పరిపోయేంతగా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త విధానం బొగ్గు కేటాయింపుపై పాత విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టి.. పారదర్శకంగా సరికొత్తగా కేటాయింపులు జరిపేందుకు ఉపయోగపడుతుంది. సహజవనరుల సరైన వినియోగానికి కూడా మార్గం సుగమం అవుతుంది’ అని బొగ్గు శాఖ తెలిపింది. లెటర్‌ ఆఫ్‌ అస్యూరెన్స్‌తోపాటుగా నూతన ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్‌ఎస్‌ఏ)కు కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది.

చారిత్రక కట్టడాలపై...
చారిత్రక కట్టడాల సమీపంలో నిర్మాణాలకు సంబంధించిన విధివిధానాలకూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చారిత్రక ప్రాముఖ్యమున్న కట్టడాలకు వందమీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు జరపరాదంది. అయితే కేవలం గతంలో ఉన్న నిర్మాణాలకు మరమ్మతులు చేయించుకోవచ్చని సూచిం చింది. ఈ కట్టడాల రక్షణకు అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని తెలిపింది.

మూడురోజుల్లో ఖాళీ చేయాల్సిందే!
చట్టాల్లోని లోపాలను అడ్డుపెట్టుకని కేంద్ర ప్రభుత్వ నివాస గృహాల్లో ఎంపీలు, అధికారులు ఎక్కువకాలం నివసించలేరని కేంద్ర కేబినెట్‌ స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాల (అనధికారంగా ఉన్నవారిని ఖాళీ చేయటం) చట్టం, 1971కి చేసిన సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పదవీకాలం ముగిసిన మూడు రోజుల్లో వారి నివాసాలను ఖాళీ చేయించేలా ఎస్టేట్‌ అధికారులకు మరిన్ని అధికారాలిచ్చింది. ఖాళీ చేయని పక్షంలో పోలీసుల సాయంతో బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారాలు కల్పించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement