
ఈ సంస్కారాన్ని కూడా గర్భిణీస్త్రీకే జరుపుతారు. సీమంతోన్నయనం అనగా కేశాలని ఎత్తికట్టడం. పాపటను ఏర్పరచడం. దీనికే ఫలస్నపనమని ఇంకొకపేరు కూడా వుంది. గర్భిణీస్త్రీని ఆవహించుకుని వుండే దుష్టశక్తుల బారినుంచి గర్భిణీ స్త్రీని రక్షించుకొనేందుకే ఈ సంస్కారం చేయాలని శాస్త్రం. పుంసవనమూ, సీమంతోన్నయనమూ ఈరెండు సంస్కారాలూ గర్భరక్షణ కోసం చేస్తారు. ఈ సంస్కారం ఏ మాసంలో జరిపించాలనే దానిమీద భిన్న వాదనలున్నా, తొలిచూలులో నాలుగు/ ఆరు/ ఎనిమిదవ మాసంలో ఈ సంస్కారం జరిపించాలని శాస్త్ర వచనం. ఒకవేళ తొలిచూలులో వీలుకాకపోతే రెండవ గర్భధారణ సమయంలో చేయాలని నియమం. ఈ సంస్కారాన్ని ఆ మాసంలోని శుక్లపక్షంలో, పురుష నక్షత్రాలలో అనగా అశ్వని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఖ, హస్త, అనురాధ, శ్రవణం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర అను నక్షత్రాలలో జరిపించాలి.
సంస్కార విధానం: శుభదినాన, ఉదయాన్నే, గణపతి పూజ, పుణ్యహవాచనాలను జరిపించి, సంకల్పం చెప్పుకుని రక్షాబంధనము చేసి, సంతాన ప్రదాతలగు విష్ణువుకీ, త్వష్ట ప్రజాపతికీ, ఇతర దేవతలకూ హవిస్సులర్పించి, హోమగుండానికి పడమరవైపు తూర్పుముఖంగా గర్భిణీస్త్రీని కూర్చుండబెట్టి, అత్తిపండ్లగుత్తులు, ఇతర సమిధలు కలిపి ఆమె పాపటిని రేపాలి. తరువాత సంబంధిత వేదమంత్రాలను పఠిస్తూ మొలకెత్తిన యవధాన్యాల దండను ఆమె కొప్పునకు చుట్టాలి. ఆ తరువాత పాపిటను కుంకుమతో అలంకరించి, తూర్పు లేక ఉత్తరదిశగా దంపతులిద్దరూ నడచి అక్కడవున్న కోడెదూడను తాకి నమస్కరించాలి. తరువాత, ఒక రాగిపాత్రలో వడ్లనుగానీ, యవధాన్యాన్నిగానీ వుంచి, విష్ణుర్యోనింకల్పయతు త్వష్టా రూపాణిపింశతు మొదలైన ఏడు ఋగ్వేదమంత్రాలను పఠిస్తూ, భర్త, గర్భిణీస్త్రీకి ఏడు దోసిళ్ళతో ఆ నీరు తాగించాలి. తర్వాత కుటుంబాచారాలను ఆచరించి, అందరి ఆశీర్వచనాలను తీసుకుని అందరికీ యథాశక్తి భోజనాదులనో లేక ఫలతాంబూలాదులనో సమర్పించాలి.
(సశేషం)
Comments
Please login to add a commentAdd a comment