మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘102’ అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణులకు ఉచిత సేవలందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన అమ్మ ఒడి వాహనాలను, మార్చురీ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘102’ వాహనాల ద్వారా గర్భిణులను ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి ఉచితంగా తరలిస్తామన్నారు. ప్రస్తుతం‘102’ వాహనాలు 41 వరకు అందుబాటులో ఉన్నాయన్నారు.
అలాగే మార్చురీకి మరో 50 కొత్త అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటిని గాంధీ, ఉస్మానియా, జిల్లా ఆసుపత్రుల దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైద్య రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, పేదల ఆరోగ్య రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి తదితరులు పాల్గొన్నారు.