
కడుపులోని బిడ్డ ఎలా ఉందో చెప్పేస్తుంది!
కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉందోనన్న ఆతృత, ఆందోళన గర్భిణులకు ఉంటుంది. అయితే ఆ విషయాలు తెలుసుకోవాలంటే డాక్టర్ వద్దకు వెళ్లాలి, స్కానింగ్ తీయించుకోవాలి. ఇప్పుడు అదంతా అవసరం లేకుండా గర్భిణులు తమంతట తామే శిశువు ఆరోగ్యం గురించి తెలుసుకోడానికి వీలుగా ఉండే ఒక పోర్టబుల్ పరికరాన్ని పోలండ్ శాస్త్రవేత్తలు రూపొందించారు. లోపలున్న శిశువు గుండె ఎలా కొట్టుకుంటోంది, ఉమ్మనీరు తగినంత ఉందా లేదా అనే వివరాలతో పాటు బిడ్డ మెడకు పేగు చుట్టుకుందా అనే విషయం కూడా ఈ పరికరంతో తెలిసిపోతుంది. ప్రెగ్నాబిట్ అనే ఈ పరికరం సాయంతో గర్భిణులకు వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి, నివారించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
గర్భస్థ శిశువులకు వచ్చే సమస్యలను ముందే గుర్తించి వాటికి తగిన చికిత్సలు చేయొచ్చని, దానివల్ల శిశువు ప్రాణాలను కూడా కాపాడొచ్చని ఈ పరికరం రూపకల్పనలో పాల్గొన్న పాట్రీషియా విజిన్స్కా సోచా అనే పరిశోధకురాలు చెప్పారు. ఒక ప్రత్యేకమైన బెల్టు సాయంతో ఈ పరికరాన్ని కడుపు వద్ద కడతారు. అరగంట పాటు అలా ఉంచి పరీక్ష పూర్తిచేస్తారు. అనంతరం మెడికల్ టెలిమానిటరింగ్ కేంద్రంలో ఉండే నిపుణులు ఈ డేటాను విశ్లేషిస్తారు. ఈ ఏడాదే ఈ పరికరం మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు.