మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి
సాక్షి, చిత్తూరు అర్బన్ : చిత్తూరులో పోలీసులు చేజింగ్ ఓ ప్రాణాన్ని బలిగొంది. అయితే చనిపోయిన వ్యక్తి దొంగని చెబుతున్న పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు నగరంలో సోమవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు అశోకపురం వద్ద ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో వెళుతుండటాన్ని గుర్తించారు. వీరిని ఆపడానికి ప్రయత్నించగా యువకులు వేగంగా వెళ్లిపోయారు. ఇద్దరినీ చేజ్ చేయడానికి ఓ రక్షక్, రెండు బ్లూకోల్ట్స్ ద్విచక్రవాహనాల్లో పోలీసులు వెంటపడ్డారు.
యువకులు ఎంఎస్‌ఆర్ కూడలి మీదుగా పలమనేరు రోడ్డుపైకి వెళ్లారు. పోలీసుల చేజింగ్‌తో కంగారుపడ్డ ఓ యువకుడు హీరోహోండా షోరూమ్ ఎదుట అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో యువకుడి తల పగిలి తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో యువకుడు ద్విచక్రవాహనాన్ని వదిలి పారిపోయాడని పోలీసులు చెబుతుండగా.. అదుపులోకి తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. కాగా యువకుడు మృతిచెందడంతో ఉన్నతాధికారులకు కారణాలు ఏంచెప్పాలో తెలియక పోలీసులు మృతదేహాన్ని తొలుత చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. అప్పటికే యువకుడు మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో కంగారుపడ్డ పోలీసులు ఓ ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్‌ను పిలిచి గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని, మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లాలని చెప్పారు.
దీంతో డ్రైవర్ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వ్యక్తిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రి నుంచి తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అప్పటికే ఇతను మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో.. తమకు కూడా విషయం తెలియదని, గుర్తుతెలియని వ్యక్తని అంబులెన్సు డ్రైవర్ చెప్పడంతో మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాను రాత్రి గస్తీలో ఉండగా ఓ యువకుడు తన కళ్లెదుటే డివైడర్‌కు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పడిపోయాడంటూ ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో గుర్తుతెలియ ని వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదే సమయంలో అశోకపురంలో రెండు ద్విచక్రవాహనాలు చోరీకి గురైనట్లు, గుర్తుతెలియని ఇద్దరు యువకులు వీటిని తీసుకెళ్లినట్లు వన్‌టౌన్ స్టేషన్‌లో మరో కేసు నమోదవడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు ఎవరని తెలిస్తే తప్ప.. ఆ యువకులు దొంగలా..? కాదా అనే విషయం బయటపడుతుంది. పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుంటే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment