వెలగని విద్యుద్దీపాలు
తూర్పుగోదావరి, రాజానగరం: జాతీయ రహదారిపై చేపట్టిన మరమ్మతు పనులు పూర్తి కాకపోవడంతోపాటు డివైడర్‌పై ఉన్న విద్యుద్దీపాలు కూడా వెలగకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో ఆదివారం సాయంత్రం కురిసిన గాలివాన కూడా తోడవడంతో బైకులపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సూర్యారావుపేట జంక్షన్ వద్ద ఆరు నెలల కిందట చేపట్టిన రహదారి మరమ్మతు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. జంక్షన్ లోనే కాకుండా చాగల్నాడు కాలువపై నిర్మించిన వంతెనపై కూడా పనులు అసంపూర్తిగా జరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారిని ఆధునిక యంత్రాలతో మరమ్మతులు చేసేందుకు వీలుగా గోకి వదిలేయడం ఇప్పుడు సమస్యలకు తావిస్తోంది.
వర్షానికి బైకులు స్కిడ్డయి పల్టీలు కొడుతుండడంతో పలువురికి గాయాలవుతున్నాయి. ఈ విధంగా ఆదివారం సాయంత్రం ఈ రెండు ప్రాంతాల్లో పది మంది వరకు బైకులపై నుంచి జారిపడి స్వల్పగాయాలపాలయ్యారు. అదే సమయంలో అక్కడ ఉన్న వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రగడ చిక్రీ, మరికొందరు మిత్రుల సాయంతో వారికి సహాయక చర్యలు అందించారు. వీధి దీపాలు వెలగడంతోపాటు బారికేడ్లు ఉండిఉంటే ఈ ప్రమాదాలు జరగవని బైకు నుంచి జారి పడి గాయపడిన రాజమహేంద్రవరానికి చెందిన జి.అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైవే బోర్డులో ఉన్న నంబరు చూసి రాజానగరం పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదంటూ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment