సాక్షి ప్రతినిధి, అనంతపురం : జాతీయ రహదారులపై వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి ఎక్కువ భాగం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉంది. ఈ రహదారి గుండా రోజూ వేలాది వాహనాలు గమ్యస్థానానికి చేరుకుంటున్నాయి. ఏటా సగటున 15 శాతం వాహనాల రాకపోకలు పెరుగుతున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
నిమిషానికి 55 వాహనాలు
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని జాతీయ రహదారులపై మొత్తం 10 టోల్‌గేట్లు ఉన్నాయి. వీటిగుండా రోజుకు 80 వేల వాహనాల వరకు ప్రయాణిస్తున్నట్టు అంచనా. దీన్నిబట్టి చూస్తే అన్నిచోట్లా కలిపి నిమిషానికి సగటున 55 వాహనాలు టోల్‌గేట్లు దాటుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 13 శాతం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం కార్లు ఉన్నట్టు తేలింది. ప్యాసింజర్ వాహనాలే ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి.
టోల్‌గేట్ల ద్వారా రోజూ రూ.కోటి వసూలు
ఉమ్మడి జిల్లాలో టోల్‌గేట్ల ద్వారా రోజుకు రూ.90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలవుతోంది. ప్రత్యేక సెలవు రోజులు, పర్వదినాల సందర్భంలో మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 60 శాతం వసూళ్లు రాప్తాడు మండలం మరూర్, పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్‌గేట్ల ద్వారానే వస్తున్నాయి. ఇక్కడ ఒక్కో టోల్‌గేట్‌లో రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వసూలవుతోంది. మిగతా టోల్‌గేట్ల నుంచి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వస్తున్నట్టు అంచనా. రానున్న ఏడాదిలో మరో రెండు టోల్‌గేట్లు అదనంగా వస్తున్నట్టు తెలుస్తోంది.
వాహనాలు పెరిగాయి
కరోనా తర్వాత నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు భారీగా పెరిగాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కంటే ప్రైవేటు టాన్స్‌పోర్టేషన్‌కు ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతుండడం ద్వారా కొనుగోలు సామర్థ్యం కూడా పెరిగింది. గతంలో ఒక అంబాసిడర్ కారు, సెల్‌ఫోన్ ఉంటే గొప్పగా చూసేవాళ్లం. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోను, చాలామంది వద్ద కార్లు కనిపిస్తున్నాయి. సొసైటీలో గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సొంతంగా ద్విచక్రవాహనం, కార్లు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది.
– వీర్రాజు, ఉప రవాణా కమిషనర్, అనంతపురం
కార్ల విక్రయాల్లో దూకుడు
ఉమ్మడి జిల్లాలో కార్ల విక్రయాలు గతంతో పోల్చితే భారీగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా నుంచి అనంతపురంలోని మెజార్టీ ప్రజలు కార్ల ప్రయాణాన్నే ఇష్టపడుతున్నారు. ఐదారేళ్ల కిందట నెలకు 150 కొత్త కార్లు కొనుగోలు అయితే మహా గొప్ప. కానీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్ల షోరూముల్లో కొనుగోలు చేసినవి 400కుపైగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సంవత్సరానికి 5వేల కార్ల విక్రయాలు జరుగుతున్నాయంటే వాటి దూకుడును అంచనా వేయొచ్చు. వీటి వల్ల కూడా ఉమ్మడి జిల్లాలో రోడ్లు బిజీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment