టోల్ రుసుం వసూళ్లు ప్రారంభం
Published Sun, Dec 4 2016 3:04 AM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM
కొర్లపహాడ్(కేతేపల్లి) : జాతీయ రహదారి 65పై కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులో గల జీఎమ్మార్ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచి టోల్‌రుసుం వసూళ్లు పునఃప్రారంభమయ్యాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు విడతలుగా ప్రకటించినా టోల్‌రుసుం మినహాయింపు గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. మరోమారు టోల్‌రుసుం మినహాయింపును కేంద్రం పొడిగించకపోవడంతో 23 రోజుల అనంతరం టోల్ వసూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. టోల్‌ప్లాజా వద్ద చిల్లర కొరతను అధిగమించేందుకు ప్లాజా కౌంటర్లలో స్వైప్ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. వసూళ్లు ప్రారంభం కాగానే ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంతాల నుంచి వస్తున్న లారీలు, కార్లు, ఇతర భారీ వాహనదారుల వద్ద చిల్లర లేకపోవడంతో టోల్‌ప్లాజాలోని కౌంటర్ల వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. దీంలో టోల్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి చిల్లరలేని వాహనాలను పక్కకు తప్పించారు. క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్న వాహనదారులను టోల్‌ప్లాజాల్లోకి పంపించారు.
టోల్‌ప్లాజాను సందర్శించిన డీఎస్పీ
65 నంబర్ జాతీయ రహదారిపై కొర్లపహాడ్ వద్ద గల టోల్‌ప్లాజాను నల్లగొండ ఇన్‌చార్జి డీఎస్పీ దుర్గయ్య సందర్శించారు. ఈసందర్భంగా స్వైప్ మిషన్‌ల పనితీరు, లోట్‌రుసుం వసూళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం టోల్‌ప్లాజా వద్ద పరిస్థితిని స్థానిక ఎస్‌ఐ మద్దెల క్రిష్ణయ్యతో సమీక్షించారు. మండలంలో ఇనుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
యథావిధిగా టోల్ వసూలు
మాడ్గులపల్లి (తిప్పర్తి ) : కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసి టోల్‌వసూళ్లను కొన్ని రోజుల పాటు నిలిపివేసింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుండి టోల్‌వసూళ్లను తిరిగి పునరుద్ధరించారు. అయితే టోల్‌గేట్ వద్ద టాక్సీ రూ.200 పైబడి ఉంటే మాత్రమే పాత రూ.500 నోట్లు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కొత్త రూ.2 వేల నోటుకు చిల్లర లేదనడంతో భారీ వాహనదారులు టోల్‌సిబ్బంది కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు. పాత నోట్లు చెల్లవంటూ కొత్తనోట్లకు చిల్లర లేవనడం సరికాదని వాదించారు. ఈ క్రమంలో చిన్న వాహనదారులు రూ.100 నోట్లను, పెద్ద వాహనదారులు అవే పాత రూ.500 నోట్లను టోల్ ఫీజు చెల్లించి వెళ్తున్నారు.
స్వైప్ మిషన్లలో సాంకేతిక సమస్యలు..
స్వైప్ మిషన్లలో పలుమార్లు తలెత్తిన సాంకేతిక లోపంతో వాహనాదారులు తికమకపడ్డారు. కార్డును స్వైప్ చేసినా ఒక్కోసారి మిషన్‌లో కార్డు రీడ్ కాకపోవడంతో కార్డులో డబ్బులు కట్ అయ్యాయో లేదోనని టోల్‌సిబ్బంది, వాహనదారులు సందేహపడ్డారు. ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పేటీఎం యాప్ ద్వారా డబ్బులు చెల్లించారు. రూ.200 కంటే ఎక్కువ టోల్ రుసుం చెల్లించాల్సిన వాహనదారుల నుంచి పాత రూ.500 నోటును సిబ్బంది తీసుకున్నారు. రూ.2000 కొత్త నోటును తీసుకునేందుకు ససేమిరా అనడంతో లారీలు, ఇతర భారీ వాహనాల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Advertisement