నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు | Sakshi
Sakshi News home page

నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు

Published Sat, Dec 9 2023 4:36 AM

Fake Toll Plaza Set Up On Gujarat Highway - Sakshi

గాం«దీనగర్‌: పూర్వం రహదారిపై దారి దోపిడీలు జరిగేవి. ఇప్పుడు దొంగలు ఏకంగా జాతీయరహదారిపై టోల్‌ప్లాజా ఒకటి తెరిచేసి దర్జాగా టోల్‌ వసూళ్లు మొదలెట్టేశారు. ఈ దోపిడీ ఘటనకు గుజరాత్‌ రాష్ట్రంలోని జాతీయరహదారి వేదికైంది.

నకిలీ టోల్‌ప్లాజా ద్వారా మోసగాళ్ల ముఠా ఏకంగా రూ.75 కోట్లకుపైగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏడాదికాలంగా ఇది జరుగుతున్నా పోలీసులకు ఇంతకాలం సమాచారం లేకపోవడం విడ్డూరం. నకిలీ టోల్‌ప్లాజా గుట్టుమట్లు తాజాగా స్థానికంగా వెలుగులోకి వచ్చాక చిట్టచివరన పోలీసులకు తెలిశాయి. ప్రస్తుతం కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టి ఐదుగురిని అరెస్ట్‌చేశారు. సంబంధిత వివరాలను పోలీసులు వెల్లడించారు.  

తక్కువ రేటు కావడంతో అంతా గప్‌చుప్‌
మోర్బీ జిల్లా, కఛ్‌ జిల్లాలను కలిపే 8ఏ నంబర్‌ జాతీయరహదారిపై వాఘసియా టోల్‌ప్లాజా ఉంది. దీని గుండా వెళ్లకుండా సమీప ప్రాంతం గుండా వెళ్లొచ్చని వాహనదారులు కనిపెట్టారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతం గుండా వెళ్లడం మొదలెట్టారు. ఈ విషయం తెల్సుకున్న ఒక ముఠా ఒక కొత్త పథకంతో రంగంలోకి దిగింది. ఈ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ‘వైట్‌హౌజ్‌’ అనే సిరామిక్‌ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. దానికి ఇరువైపులా హైవే వరకు కొత్త రోడ్లు వేశారు.

ఫ్యాక్టరీలో టోల్‌ ప్లాజా కౌంటర్‌ నిర్మించి వసూళ్ల పర్వానికి తెరలేపారు. సాధారణంగా జాతీయరహదారిపై ఒక్కో వాహనాన్ని బట్టి రూ. 110 నుంచి రూ.595 వసూలుచేస్తారు. కానీ ఈ ‘దొంగ’ మార్గంలో వెళ్లే వాహనదారుల నుంచి ఈ ముఠా కేవలం రూ.20 నుంచి రూ.200 వసూలుచేసేవారు.

ఇంత తక్కువకే టోల్‌గేట్‌ను దాటేస్తుండటంతో తెల్సినవారంతా ఈ మార్గంలోనే రాకపోకలు సాగించేవారు. కొత్త వాహనదారులకు, స్థానికులకు ఇది బోగస్‌ టోల్‌ప్లాజా అని తెల్సికూడా.. తక్కువ ధరలో పని అయిపోతుందని మిన్నకుండిపోయారు. దాంతో ముఠా వ్యాపారం ఒక ఏడాదిపాటు యథేచ్చగా సాగింది. గత 18 నెలల్లో ఈ ముఠా దాదాపు రూ.75 కోట్లు కొట్టేసిందని మాజీ ఐపీఎస్‌ రమేశ్‌ ఆరోపించారు.

నిందితుల్లో పటేల్‌ నేత కుమారుడు
స్థానిక మీడియాలో కథనాలు, విమర్శలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఐదుగురిని అరెస్ట్‌చేశారు. సిరమిక్‌ ఫ్యా క్టరీ యజమాని అమర్షీ పటేల్‌తోపాటు అతని నలుగురు అనుచరులు, మరో వ్య  క్తినీ అరెస్ట్‌చేశారు. అమర్షీ సౌరాష్ట్ర ప్రాంతంలో కీలకమైన పటిదార్‌ సామాజిక వర్గానికి చెందిన నేత కుమారుడు కావడం గమనార్హం.

Advertisement
Advertisement