మృత్యుదారి | Road Accidents in Kurnool NH 44 Highway | Sakshi
Sakshi News home page

మృత్యుదారి

Published Mon, May 13 2019 2:06 PM | Last Updated on Mon, May 13 2019 2:06 PM

Road Accidents in Kurnool NH 44 Highway - Sakshi

శనివారం వెల్దుర్తి వద్ద ప్రమాదం జరిగిన ప్రాంతం

కర్నూలు, వెల్దుర్తి:  హైదరాబాద్‌– బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–44) ప్రమాదాలకు నిలయంగా మారింది. పలుచోట్ల డిజైనింగ్‌ లోపాలు, నిర్వహణ సరిగా లేకపోవడం తదితర కారణాలతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అనేకమంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. శనివారం సాయంత్రం వెల్దుర్తి చెక్‌పోస్టు క్రాస్‌రోడ్డు వద్ద ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ వోల్వో బస్సు.. బైక్‌ను, తుపాన్‌ వాహనాన్ని ఢీకొనడంతో 16 మంది మరణించిన విషయం విదితమే. ఇందుకు బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే కారణమని చెబుతున్నప్పటికీ, వాటితో పాటు ‘హైవే’ లోపాలు కూడా ప్రమాదాలకు ఊతమిస్తున్నాయి. ముఖ్యంగా వెల్దుర్తి ప్రాంతంలో కొన్ని రోజులుగా వరుస ప్రమాదాలు సంభవిస్తుండడంతో వాహనదారులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

డేంజర్‌ ‘టర్న్‌లు’
జాతీయ రహదారి నుంచి గ్రామాల్లోకి వెళ్లేందుకు, వాహనాలు రోడ్డు మారేందుకు ఏర్పాటు చేసిన  యూటర్న్‌ల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వెల్దుర్తి మండల పరిధిలోని అల్లుగుండు క్రాస్, బొమ్మిరెడ్డిపల్లె క్రాస్, అమేజాన్‌ హోటల్‌ సమీప క్రాస్, వెల్దుర్తి చెక్‌పోస్ట్‌ క్రాస్, చెరుకులపాడు క్రాస్, డోన్‌ వైపు వెల్దుర్తి ఎంట్రెన్స్‌ క్రాస్, సూదేపల్లె క్రాస్‌ ఇలా.. ప్రతి యూటర్న్‌లో ఇప్పటికే పదుల సంఖ్యలో  ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 25న లద్దగిరి క్రాస్‌ సమీపంలో మినీవ్యాన్‌ బోల్తా పడి ఇద్దరు దర్మరణం చెందారు. ఏప్రిల్‌ 28న వెల్దుర్తి అమేజాన్‌ హోటల్‌ క్రాస్‌లో బైక్‌ అదుపుతప్పి ఒకరు చనిపోయారు. అదేరోజు వెల్దుర్తి చెక్‌పోస్ట్‌ క్రాస్‌లో బైక్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పైనున్నఒకరు మృతి చెందారు. ఇదే ప్రాంతంలో శనివారం జరిగిన ప్రమాదంలో ఏకంగా 16 మంది మృత్యువాత పడడంతో  ప్రజలు ఉలిక్కిపడ్డారు.

నిర్వహణ లోపాలు.. రాంగ్‌రూట్‌ ప్రయాణాలు  
శనివారం ఘోర ప్రమాదం జరిగిన  వెల్దుర్తి క్రాస్‌లో జాతీయ రహదారి డిజైన్‌లో లోపం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది.  గ్రామంలోకి ప్రవేశించే ఈ క్రాస్‌లో ఏళ్లుగా డిమాండ్‌ ఉన్న అండర్‌వే, సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయలేదు. నిర్మించిన క్రాస్‌లోనూ సరైన సిగ్నల్స్, జీబ్రా లైన్స్, లైటింగ్‌ లేవు. తక్కువ దూరంలోనే డివైడర్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రమాదాలు అధికమవుతున్నాయి. వాహనదారులు సైతం దూరం తక్కువ అవుతుందన్న కారణంతో ప్రతి క్రాస్‌ వద్ద రాంగ్‌రూట్‌ ప్రయాణాలు చేస్తుండడం ప్రమాదాలకు ఊతమిస్తోంది. అల్లుగుండు క్రాస్‌లో పెట్రోల్‌ బంక్‌కు వెళ్లడానికి, బొమ్మిరెడ్డిపల్లెలోకి, హోటళ్లకు, పొలాలకు వెళ్లడానికి,  వెల్దుర్తి చెక్‌పోస్ట్‌ క్రాస్‌లో లద్దగిరి, కోడుమూరు వైపు వెళ్లడానికి, నార్లాపురం గ్రామం నుంచి రావడానికి, చెరుకులపాడు, డోన్‌ వైపు క్రాస్‌లలో పెట్రోల్‌ బంక్, చెరుకులపాడు, తొగర్చెడు, హోటళ్లు, దాబాలకు వెళ్లేందుకు రాంగ్‌రూట్‌ ప్రయాణాలు చేస్తున్నారు. ఇక అతివేగం సర్వసాధారణమైంది. జాతీయ రహదారిలో నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన కాంట్రాక్టర్లు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. రోడ్డు ఎగుడుదిగుడుగా ఉన్నా, నిబంధనలకనుగుణంగా లేకున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదు.

ప్రజలు, వాహనదారుల్లో మార్పు రావాలి–డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ బసిరెడ్డి
ప్రజలు, వాహనదారులు నిబంధనలను పాటించకపోతుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వారిలో మార్పు రావాలని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ (డీటీసీ) బసిరెడ్డి అన్నారు. శనివారం వెల్దుర్తి చెక్‌పోస్ట్‌ క్రాస్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన ఆర్‌టీఓ జగదీశ్వరరావుతో కలిసి పరిశీలించారు. క్రాస్‌లో రోడ్డు పొడవు, వెడల్పును కొలతలు వేయించారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ రహదారుల శాఖకు తమ శాఖ ద్వారా పలు సూచనలు చేయనున్నట్లు తెలిపారు. క్రాస్‌ల వద్ద లాంగ్‌ రంబుల్‌ స్ట్రిప్స్‌ (మొదలు చిన్న చిన్నగా ఉంటూ వచ్చి ఆఖరుకు ఒకింత పెద్దగా ఉండే ఎక్కువ స్పీడ్‌ బ్రేకర్లు), లైటింగ్‌ సిస్టం, సీసీ కెమెరాలు, రోడ్డు వెడల్పు, రోడ్డు పరిస్థితులు, క్రాస్‌లలో గల సమస్యలపై నివేదికలను తమ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. వారి వెంట ఎంవీఐలు శంకర్‌రావ్, శ్రీనివాసరావ్, రమణ, అతికా నవాజ్‌లు ఉన్నారు.  అలాగే ప్రమాద సమయంలో బస్సు వేగం,  బస్సులో సౌకర్యాలు, కండీషన్‌ తదితరాలను పోలీసు శాఖలోని టెక్నికల్‌ ఇన్‌చార్జ్‌ రాఘవరెడ్డి పరిశీలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement