ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి | Declare southern part of RRR as national highway | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి

Published Thu, Jun 27 2024 3:46 AM | Last Updated on Thu, Jun 27 2024 3:56 AM

Declare southern part of RRR as national highway

హైదరాబాద్‌–విజయవాడ ఎన్‌హెచ్‌ను ఆరు వరుసలుగా విస్తరించండి

జాతీయ రహదారుల పనులు వెంటనే ప్రారంభించండి

కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి

భేటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, దుద్దిళ్ల

ఒకట్రెండు నెలల్లో ఆరు లేన్ల రోడ్డు పనులు ప్రారంభిస్తాం: కోమటిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌)ని ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వార్షిక ప్రణాళికలో ట్రిపుల్‌ ఆర్‌కు నిధులు మంజూరు చేయాలని కోరారు. 

బుధవారం ఢిల్లీలో గడ్కరీతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, పలు ఎన్‌హెచ్‌ల పనుల ప్రారంభం తదితర అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌ – తూప్రాన్‌ – గజ్వేల్‌ – జగదేవ్‌పూర్‌ – భువనగిరి – చౌటుప్పల్‌ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దాని భూ సేకరణకయ్యే వ్యయంలో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని రేవంత్‌ చెప్పారు. ఈ భాగంలో తమ వంతు పనులు వేగవంతం చేశామన్నారు. 

చౌటుప్పల్‌ నుంచి అమన్‌గల్‌ – షాద్‌నగర్‌ – సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని రేవంత్‌ కోరారు. హైదరాబాద్‌ (ఓఆర్‌ఆర్‌ గౌరెల్లి జంక్షన్‌) నుంచి వలిగొండ – తొర్రూర్‌ – నెల్లికుదురు – మహబూబాబాద్‌ – ఇల్లెందు – కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్‌హెచ్‌–930పీ) జాతీయ రహదారిగా ప్రకటించారని, ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ.కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని గడ్కరీకి వివరించారు.

హైదరాబాద్‌ వాసులు భద్రాచలం వెళ్లేందుకు 40 కి.మీ. దూరం తగ్గించే ఈ రహదారిని జైశ్రీరామ్‌ రోడ్‌గా వరంగల్‌ సభలో గడ్కరీ చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ మార్గంలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. గంటన్నరకుపైగా జరిగిన ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ ఉన్నారు.

రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య..
హైదరాబాద్‌–విజయవాడ (ఎన్‌హెచ్‌ 65) జాతీయ రహదారిని గత ఏప్రిల్‌లోగా ఆరు లేన్లుగా విస్తరించాల్సి ఉందని గడ్కరీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన ఈ రహదారిలో వాహనాల రద్దీతో ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనతో వాహన రద్దీ తగ్గిందని, తమకు సరైన ఆదాయం రావడం లేదంటూ కాంట్రాక్ట్‌ సంస్థ ఆరు వరుసల పనులు చేపట్టడం లేదన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ, కాంట్రాక్ట్‌ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించి త్వరగా ఆరు లేన్లుగా విస్తరించాలని కోరారు.

ఐకానిక్‌ బ్రిడ్జి.. ఎలివేటెడ్‌ కారిడార్‌ 
కల్వకుర్తి నుంచి కొల్లాపూర్‌ – సోమశిల – కరివెన – నంద్యాల (ఎన్‌హెచ్‌–167కే) మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి 142 కి.మీ. పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని గడ్కరీకి రేవంత్‌రెడ్డి తెలిపారు. మిగిలిన 32 కి.మీ.పనులకు, ఐకానిక్‌ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. 

ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్‌ నుంచి తిరుపతికి 70 కి.మీ. దూరం తగ్గుతుందని వివరించారు. కల్వకుర్తి–నంద్యాల రహదారి (ఎన్‌హెచ్‌–167కే) హైదరాబాద్‌–శ్రీశైలం మార్గంలో ఉన్న రహదారిలో (ఎన్‌హెచ్‌ 765కే) 67 కిలోమీటర్‌ వద్ద (కల్వకుర్తి) ప్రారంభమవుతుందని, ఎన్‌హెచ్‌ 167కే జాతీయ రహదారి పనులు చేపట్టినందున, హైదరాబాద్‌ – కల్వకుర్తి వరకు ఉన్న (ఎన్‌హెచ్‌ 765కే) రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. 

కల్వకుర్తి–కరివెన వరకు జాతీయ రహదారి పూర్తయ్యేలోపు హైదరాబాద్‌ – కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ – శ్రీశైలం (ఎన్‌హెచ్‌ 765) మార్గంలో 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని, అటవీ అనుమతులు లేక అక్కడ పనులు చేపట్టలేదని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మార్గంలో నిత్యం ఏడువేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని, ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్‌ ప్రాంతంలో 4 లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని రేవంత్‌ కోరారు. 

మంథనికి చోటివ్వండి
మంథని నుంచి సీనియర్‌ మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, మాజీ సభాపతి శ్రీపాదరావు గతంలో ప్రాతినిధ్యం వహించారని గడ్కరీకి రేవంత్‌ రెడ్డి తెలియజేశారు. ఇప్పటివరకు జాతీయ రహదారుల చిత్రంలో మంథనికి చోటు దక్కలేదన్నారు. జగిత్యాల–పెద్దపల్లి–మంథని–కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. 

ఈ రహదారి పూర్తయితే ఎన్‌హెచ్‌–565, ఎన్‌హెచ్‌–353సీ అనుసంధానమ  వుతాయని, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు అనువుగా ఉంటుందని, దక్షిణ కాశీగా గుర్తింపుపొందిన కాళేశ్వరం క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుందని సీఎం వివరించారు.

గడ్కరీ దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలు
తెలంగాణను కర్ణాటక, మహారాష్ట్రను అనుసంధానించే హైదరాబాద్‌–మన్నెగూడ నాలుగు వరుసల జాతీయ రహదారిగా (ఎన్‌హెచ్‌–163) ప్రకటించడంతో భూ సేకరణ పూర్తి చేశాం. టెండర్లు పిలవడం పూర్తయిన ఎన్జీటీలో కేసు వలన పనులు ప్రారంభం కాలేదు. సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ మార్గం పనులు వెంటనే ప్రారంభించాలి. 

సేతు బంధన్‌ స్కీం కింద 2023–24లో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన 12 ఆర్వోబీలు/ఆర్‌యూబీలను వెంటనే మంజూరు చేయాలి. జగిత్యాల–కాటారం (130 కి.మీ.), దిండి – నల్లగొండ (100 కి.మీ.), భువనగిరి – చిట్యాల (44 కి.మీ), చౌటుప్పల్‌ – సంగారెడ్డి (182 కి.మీ), మరికల్‌–రామసముద్రం (63 కి.మీ.), వనపర్తి – మంత్రాలయం (110 కి.మీ.), మన్నెగూడ – బీదర్‌ (134 కి.మీ.), కరీంనగర్‌–పిట్లం (165 కి.మీ.), ఎర్రవెల్లి క్రాస్‌ రోడ్‌ – రాయచూర్‌ (67 కి.మీ.), కొత్తపల్లి–దుద్దెడ (75 కి.మీ.), సారపాక – ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ – రాయగిరి క్రాస్‌ రోడ్‌ (63 కి.మీ.), జగ్గయ్యపేట – కొత్తగూడెం (100 కి.మీ.), సిరిసిల్ల – కోరట్ల (65 కి.మీ.), భూత్పూర్‌ – సిరిగిరిపాడు (166 కి.మీ.), కరీంనగర్‌ – రాయపట్నం (60 కి.మీ.) మొత్తం 1617 కి.మీ. జాతీయ రహదారులను అప్‌గ్రేడ్‌ చేయాలి. 

రూ. 4 వేల కోట్లతో ఆరు లేన్ల పనులు: కోమటిరెడ్డి
తెలుగు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్‌–అమరావతి మధ్య ఆరు లేన్ల పనులను ఒకట్రెండు నెలల్లో ప్రారంభిస్తామని, అలాగే ఎక్స్‌ప్రెస్‌ వే కూడా నిర్మిస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు లేన్ల మార్గాన్ని రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ కూడా నిర్మిస్తామని వెల్లడించారు. 

తాము చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. 2016లో ప్రకటించిన రీజనల్‌ రింగ్‌ రోడ్డును నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరిచిపోయిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయంలో కదలిక వచ్చిందని తెలిపారు. యుటిలిటీ చార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రమంత్రికి వివరించగా.. అందుకు కేంద్ర మంత్రి స్పందిస్తూ.. తామే భరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించడమే తమ లక్ష్యమని, జవాబుదారీతనంగా పనిచేయడం తెలుసు కాబట్టే ఇంతమంది మంత్రులం ఢిల్లీకి వచ్చామని కోమటిరెడ్డి చెప్పారు.

వారంలోపు అన్ని శాఖలతో సమావేశం: భట్టి
రాష్ట్ర రహదారులకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని, అన్ని శాఖల నుంచి ఒకే సారి క్లియరెన్స్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గడ్కరీతో రాష్ట్రానికి సబంధించిన రోడ్ల విస్తరణ గురించి మాట్లా డామన్నారు. ట్రిపుల్‌ఆర్, హైదరాబాద్‌ – అమరావతి ఆరు లేన్లుగా మార్చడం, హైదరాబాద్‌–కల్వకుర్తి రోడ్డు తదితర అంశాలపై గడ్కరీతో సుదీర్ఘంగా చర్చించామని భట్టి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement