
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిశారు. తెలంగాణలోని పలు రాష్ట్ర రహదారులను జాతీయ హైవేలుగా గుర్తించాలని గడ్కరీని కోరారు. సమావేశానంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణపై గడ్కరీతో చర్చించామన్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ నాశనం అయ్యాయని, జాతీయ రహదారులుగా గుర్తిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం గుంతలు కూడా పూడ్చడం లేదని దుయ్యబట్టారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ 8 లైన్ల రహదారిలో భాగంగా ఎల్బీనగర్ నుంచి కుత్బుల్లాపూర్ వరకు వదిలేశారని ఆరోపించారు. 3,150 కిలోమీటర్ల రహదారులను కేంద్రం జాతీయ రహదారులుగా గుర్తించిందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 1300 కిలోమీటర్ల మేర రహదారులనే జాతీయ రహదారులుగా గుర్తించిందన్నారు. అటవీ అధికారిణి అనితపై దాడి ఘటన చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతుందన్నారు. పోలీసులకు ఇచ్చినట్లే అటవీ అధికారులకు సైతం లైసెన్స్డ్ ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి రాని సీఎంకు నూతన సచివాలయ భవనం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగంపై కోర్టును ఆశ్రయిస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment