సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ జాతీయ రహదారిలో భాగంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో కొంతభాగం గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌గా రూపొందనుంది. అంటే.. ఉన్న రహదారిని విస్తరించడం కాకుండా పూర్తిగా కొత్త రోడ్డును నిర్మిస్తారన్న మాట. ఇది దాదాపు 12 కి.మీ.మేర ఉండనుంది. బైపాస్‌లలో భాగంగా ఈ కొత్త రోడ్డు నిర్మాణం జరగనుంది.
సాధారణంగా బైపాస్‌లు తక్కువ నిడివి తో ఉంటాయి, కానీ ఇక్కడ రెండు భారీ బైపాస్‌ల ను కిలోమీటర్ల మేర నిర్మిస్తుండటంతో, అంత మేర గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌గా మారనుంది. ఈ ఆలోచన మొయినాబాద్, చేవెళ్లలను నగర శివారు టౌన్‌షిప్‌లుగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నిర్మాణాలు తొలగించాల్సిన పని లేకుండా..
నగరం నుంచి మొయినాబాద్, చేవెళ్ల మీదుగా సాగే బీజాపూర్ రోడ్డును భారత్‌మాల పరియోజన పథకంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందు లో 46 కి.మీ. మేర అంటే.. అప్పా కూడలి నుంచి వికారాబాద్ రోడ్డులోని మన్నెగూడ వరకు ఎన్‌హెచ్‌ఏఐ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో నాలుగు వరసలుగా విస్తరించనుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. నవంబరు 30న వాటిని తెరవాల్సి ఉంది. కానీ మరిన్ని బిడ్లు దాఖలుకు వీలుగా టెండర్ల గడువును మరో నెల పెంచారు.
అయితే నగరం నుంచి అప్పా కూడలి వరకు విశాలంగానే ఉన్న రోడ్డు ఆ తర్వాత 25 మీటర్లు, కొన్నిచోట్ల 30 మీటర్లు వెడల్పుతో ఉంది. దాన్ని 60 మీటర్లకు విస్తరించనున్నారు. ప్రధాన రోడ్డు 45 మీటర్లు కాగా, రెండు వైపులా విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ఇతర అవసరా ల కోసం 15 మీటర్ల (రెండువైపులా కలిపి) స్థలం ఉంటుంది. దీన్ని రూ.897 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్నారు. ఇక్కడే రెండు భారీ బైపాస్‌లకు ప్లాన్ చేశారు.
ఇప్పటికే మొయినాబాద్ ప్రాంతం బాగా విస్తరించింది. దీంతో ఉన్న రోడ్డును వెడల్పు చేయాలంటే భారీగా నిర్మాణాలను తొలగించాల్సి వస్తుంది. పక్కనుంచే బైపాస్ నిర్మిద్దామంటే కావాల్సినంత స్థలం లేదు. దీంతో నాలుగు కి.మీ. దూరంగా దాదాపు నాలుగున్నర కి.మీ. మేర నాలుగు లైన్ల ప్రధాన క్యారేజ్‌వేను కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుగా నిర్మించాలని నిర్ణయించారు. చేవెళ్ల పట్ట ణం వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పట్టణానికి దూరంగా దాదాపు ఆరున్నర కి.మీ. మేర మరో భారీ బైపాస్‌ను గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్ తరహాలో నిర్మించబోతున్నారు. అలాగే మరోచోట చిన్న బైపాస్ రానుంది. ఇలా 46 కి.మీ ఎక్స్‌ప్రెస్ వేలో 12 కి.మీ. మేర పూర్తిగా కొత్త రోడ్డు రాబోతోంది.
రెండు పట్టణాలకు మహర్దశ!
నగర శివారు ప్రాంతాల్లో కొంతకాలంగా ఆధునిక కాలనీలు వెలుస్తున్నాయి. నగరానికి చేరువగా ఉన్న మొయినాబాద్, చేవెళ్లల్లో ఇప్పటికే ఫామ్‌హౌస్‌ల ఏర్పాటుతో నగరవాసుల మకాం మారుతోంది. ఈ కొత్త రోడ్డుతో ఈ దిశగా పురోగతి మరింత వేగంగా సాగుతుందని భావిస్తున్నారు. పాత రోడ్డు, కొత్త రోడ్డు మధ్య కాలనీల అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment