పోలీసులు అరెస్టు చేసిన హైవే దోపిడీ గ్యాంగ్
నేరేడ్‌మెట్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ముసుగులో గుట్కా వ్యాపారులే లక్ష్యంగా జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌కు పోలీసులు చెక్ పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా రాచకొండ ఎస్‌ఓటీ, ఘట్‌కేసర్ పోలీసులు సంయుక్తంగా దోపిడీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.51 లక్షల నగదు, 42.62 తులాల బంగారు ఆభరణాలు, 1800 యూఎస్ డాలర్లు, రెండు కార్లు, 9 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్.. అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ శ్రీధర్‌రెడ్డి, ఐటీ సెల్ ఎస్‌ఐ సురేష్, ఘట్‌కేసర్ డీఐ కిరణ్‌కుమార్, సిబ్బందితో కలిసి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం చెంగిచెర్ల గ్రామానికి చెందిన డ్రైవర్ అనంతుల వీరన్న(38) నాచారంలోని రాఘవేంద్రనగర్(విజయశ్రీ టవర్స్)లో నివాసముంటున్నాడు. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన మొగుళ్ల నరేష్ అలియాస్ నారి((31) మల్లాపూర్‌లోని భవానీనగర్‌లో ఉంటున్నాడు. వీరిద్దరు 2018లో నిషేధిత గుట్కా ప్యాకెట్ల వ్యాపారం చేశారు. బీదర్ నుంచి కార్లలో గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి వరంగల్, కరీంగనగర్, జనగాం జిల్లాలో అధిక లాభాలకు దుకాణదారులకు విక్రయించేవారు. ఈ క్రమంలో పాలకుర్తి, జనగాం, జమ్మికుంట పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. దాంతో ఆర్థికంగా నష్టపోయారు.
ముఠాగా ఏర్పడి దోపిడీలు
తర్వాత బీదర్ నుంచి గుట్కాను తీసుకువచ్చే వ్యాపారులను దోపిడీ చేయాలని పథకం వేశారు. గుట్కా విక్రయంపై నిషేధం ఉండడంతో దోపిడీ చేసినా ఫిర్యాదు చేయరనే నమ్మకంతో ఇందుకు తెగబడ్డారు. ఇందులో భాగంగా మల్లాపూర్ భవానీ నగర్‌లో ఉంటున్న యాదాద్రి జిల్లా బొమ్మలారామారం మండలం ఫకీర్‌గూడేనికి చెందిన ఆటో డ్రైవర్ గంగాదేవి ప్రభాకర్(28), భవానీనగర్‌కు చెందిన సేల్స్‌మేన్‌గా పనిచేసే సయ్యద్ అమీర్(22) మహ్మద్ ఫరీద్(25), నాచారంలోని మల్లాపూర్‌కు చెందిన రజనీకాంత్‌తో కలిసి ప్రధాన నిందితులు వీరన్న, నరేష్ ముఠా ఏర్పాటు చేశారు. బీదర్ నుంచి ఎవరూ, ఎప్పుడు,ఎలా గుట్కా ప్యాకెట్లు తీసుకొస్తున్నారో పరిశీలించేవారు. వరంగల్‌కు చెందిన ఇద్దరు వ్యాపారులు కారులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్టు గుర్తించిన ఈ ముఠా ఈనెల 19న రాత్రి రెండు కార్లలో ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్‌గేట్ సమీపంలో వ్యాపారుల కారును ఆపారు. తాము హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులమని, విచారణ కోసం కూకట్‌పల్లికి రావాలని వ్యాపారులను బలవంతంగా చెంగిచెర్ల ప్రధాన రోడ్ వద్దకు తీసుకువెళ్లారు. వ్యాపారుల జేబుల్లోంచి రూ.1.50 లక్షల నగదును లాక్కు కున్నారు. మల్లాపూర్‌కు తీసుకువెళ్లి వ్యాపారుల ఏటీఎం కార్డుల నుంచి రూ.20 వేలు డ్రా చేసుకుని, రెండు బంగారు ఉంగరాలు, 1800 యూఏస్ డాలర్లు, మూడు సెల్‌ఫోన్లు తీసుకున్నారు. తర్వాత రూ.1.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను తీసుకెళ్లిపోయారు. బాధితులు ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
సీసీకెమెరా ఫుటేజీ ఆధారంగా
ఈమేరకు ఎస్‌ఓటీ, క్రైం, ఐటీ సెల్ పోలీసులు విచారణలో భాగంగా సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారు నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం ఎస్‌ఓటీ, ఘట్‌కేసర్ పోలీసులు యమ్నంపేట్ క్రాస్ రోడ్ వద్ద వీరన్న, నరేష్, గంగాదేవి ప్రభాకర్, సయ్యద్ అమీర్, మహ్మద్ ఫరీద్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఘట్‌కేసర్ వద్ద దోపిడీతో పాటు ఈ నెల 11న ఓఆర్‌ఆర్ హైవేలో పోలీసులమని కారును ఆపి, రూ.60 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు గుట్కా వ్యాపారిని దోపిడీ చేసినట్టు ఒప్పుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితులు రజనీకాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కేసులైతే పీడీ యాక్టు
గుట్కా తినడం వల్ల నోటి కేన్సర్ వస్తుంది. ఎంతోమంది ఇది తినడం వల్ల మృతి చెందుతున్నారు. నా మిత్రుల్లో కొందరు కూడా అలాగే చనిపోయారు. గుట్కా తినడం మానేయాలి. ఈ వ్యాపారం చేసే వారు వెంటనే మానేయాలి. గుట్కా విక్రయిస్తూ రెండు సార్లు కేసులైతే వారిపైపీడీ యాక్టు పెడతాం.
Comments
Please login to add a commentAdd a comment