వివరాలు వెల్లడిస్తున్న కొత్వాల్ అంజనీకుమార్
సాక్షి, సిటీబ్యూరో: తిరుమలగిరి ఠాణా పరిధిలోని జీహెచ్‌ఎంసీ అధికారి షానవాజ్ ఇంట్లో సోమవారం జరిగిన బందిపోటు దొంగతనానికి మృతురాలి అల్లుడే సూత్రధారని తేలింది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు కొత్వాల్ అంజనీ కుమార్ శుక్రవారం ప్రకటించారు. డీసీపీలు కల్మేశ్వర్ సింగవనర్, పి.రాధాకిషన్‌రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. షానవాజ్ తల్లి ఇక్బాల్ బీకి ఓ కుమార్తె కూడా ఉంది. ఈమెను కొన్నేళ్ల క్రితం నగరానికి చెందిన సయ్యద్ జమీల్‌కిచ్చి వివాహం చేశారు. ఆటోడ్రైవర్ అయిన జమీల్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. గతంలో అత్తింటి వారు కొన్నాళ్లు సాయం చేసి ఆపై చేయలేదు. నగదు ఇవ్వమంటూ ఎన్నిసార్లు అడిగినా జమీల్‌కు భంగపాటు ఎదురైంది. ఇదిలా ఉండగా.. షానవాజ్ రెండు నెలల క్రితం వారాసిగూడలో రూ.35 లక్షలతో ఇల్లు కొన్నారు. దీన్ని వేరే వారికి అద్దెకు ఇవ్వడానికి బదులుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జమీల్ కుటుంబాన్నే ఉచితంగా ఉండమని చెప్పారు. కుటుంబంతో సహా అక్కడే ఉంటున్న ఇతగాడి కన్ను షానవాజ్ సంపాదనపై పడింది. ఇల్లు కొన్నాడంతో అతడి వద్ద భారీ మొత్తం ఉంటుందని, దాన్ని చేజిక్కించుకుంటే ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడవచ్చని పథకం వేశాడు.
సోదరుడి సహకారంతో కుట్ర అమలు
జమీల్ సోదరుడైన బోరబండ సయ్యద్ ముజీబ్ గతేడాది సనత్‌నగర్ పరిధిలో ఓ హత్య కేసులో నిందితుడు. జైలుకెళ్లిన అతగాడు రెండు నెలల క్రితం బయటకు వచ్చి బాచుపల్లిలో ఉంటున్నాడు. విషయం అతడికి చెప్పిన జమీల్ దొంగతనానికి కుట్ర చేశాడు. తోటి డ్రైవర్, బంజారాహిల్స్ వాసి షేక్ అబ్దుల్ సలీం, సంగారెడ్డికి చెందిన బావమరిది మహ్మద్ జమీర్, సలీం స్నేహితుడైన మెహదీపట్నం వాసి మహ్మద్ అద్నాన్, ముజీబ్ స్నేహితుడైన సంగారెడ్డి వాసి మహ్మద్ ఇమ్రాన్, వీరికి పరిచయస్తురాలైన సంగారెడ్డికే చెందిన బీబీ బేగంతో ముఠా కట్టాడు. షానవాజ్ విధులకు వెళ్లిన తర్వాత ఇంట్లో అత్తాకోడళ్లే ఉంటారని దీంతో పగటిపూటే ఈ నేరం చేయాలని నిర్ణయించుకున్నారు.
కారులో వచ్చి కాపుకాసి..
షానవాజ్ ఇంట్లో దోపిడీ చేయడానికి సోమవారం ఈ ఎనిమిది మందీ కలిసి సలీంకు చెందిన కారులో తిరుమలగిరికి వచ్చి జమీల్, ముజీబ్, సలీంలు ఇంటి సమీపంలో కారుతో ఆగిపోయారు. బుర్ఖా ధరించిన బీబీ బేగంతో పాటు ముసుగులు వేసుకున్న మిగిలిన నలుగురూ షానవాజ్ ఇంటికి వెళ్లారు. తలుపు కొడుతూ ఆ ఇంట్లో ఉండే వారి పేర్లు పెట్టి పిలిచారు. దీంతో ఇక్బాల్ బీతో పాటు ఆమె కోడలు తలుపు తీయగా.. లోపలకు ప్రవేశించిన ఐదుగురూ కత్తులు చూపి బెదిరిస్తూ వారిపై దాడి చేశారు. నోటికి ప్లాస్టిక్ టేప్ వేసి కాళ్లూ,చేతులు కట్టేశారు. వారి ఒంటిపై ఉన్న మూడు గ్రాముల బంగారం, 45 గ్రాములు వెండితో ఉడాయించారు.
వృద్ధురాలి మృతితో మారిన తీవ్రత
బందిపోట్ల దాడిలో గాయపడి అస్వస్థతకు గురైన ఇక్బాల్ బీ మంగళవారం ఆస్పత్రిలో కన్నుమూశారు. నేరం జరిగిన రోజు షానవాజ్ ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయిన కారు నెంబర్ కేసులో కీలక ఆధారంగా లభించింది. దొంగలు పేర్లు పెట్టి పిలవడంతో పరియస్తుల ప్రమేయం అనుమానించి దర్యాప్తు చేశారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్ వలపన్ని ఎనిమిది మంది నిందితులనూ పట్టుకున్నారు. వీరి నుంచి కారు, కత్తులు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీబీ బేగం భర్త కొన్నాళ్లక్రితం చనిపోయాడు. ఈమె అరెస్టుతో ఐదేళ్ల బిడ్డ అనాథగా మారి బంధువుల సంరక్షణకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment