
రోడ్డుపై బోల్తాపడిన వాహనం
విశాఖపట్నం, పాయకరావుపేట: జాతీయరహదారిపై సీతారామపురం జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. పరవాడ మండలం మడకపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది అయ్యప్ప స్వాములు తూర్పుగోదావరిజిల్లా శంఖవరం సమీపంలో ఉన్న ఆంధ్ర శబరిమలలో ఇరుముడి సమర్పించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనానికి సీతారామపురం వద్ద మోటారు సైక్లిస్ట్‌ను అడ్డంగా వచ్చాడు. అతనిని తప్పించబోయి అదుపు తప్పిన స్కార్పియో రోడ్డు పక్కకు వెళ్లి పోయి, పల్టీలు కొట్టింది.ఈప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న నాగుబల్లి రాము, సానాపతి రమణ, అప్పారావు, శ్రీనులకు స్పల్పగాయాలయ్యాయి.
అదేవిధంగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన మోటారు సైక్లిస్ట్ ఉరుము రాజు, ఇతని కుమార్తె రాజకుమారిలకు కూడా స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అచ్యుతాపురం మండలం యర్రవరం గ్రామానికి చెందిన రాజు, అతని కుమార్తె రాజకుమారి ఇటుకబట్టీలో పనిచేసేందుకు సీతారామపురం వచ్చారు. పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామం వెళ్లి సాయంత్రం తిరిగి సీతారామపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియోను వీరి బైక్ పక్కగా ఢీకొట్టడం వల్ల వీరు కూడా రోడ్డుపై పడి గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ బాబూరావు తెలిపారు.
అయ్యప్ప దయ వల్లే ప్రాణాలు దక్కాయి...
ప్రమాదం జరిగిన తీరు చూస్తే భారీ ప్రాణనష్టం జరిగి ఉంటుందని భావిస్తారు. జాతీయరహదారిపై స్కార్పియో వాహనం రెండు పల్టీలు కొట్టింది. డివైడర్‌పైకి ఎక్కిపోయింది.ఆ సమయంలో వాహనంలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయ్యప్ప దయవల్ల ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం గాని పెద్ద గాయాలు గానీ తగల్లేదని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు, వాహనం బోల్తాపడిన దృశ్యాన్ని చూసి రాకపోకలు సాగించే వారు స్థానికులు సంఘటనా స్థలం వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. చివరకి ఎవరికి ఏమీజరగలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment