హైవేపై ఆగని ‘జీరో’ దందా | Gold and silver jewelery smuggling National Highway 44 | Sakshi
Sakshi News home page

హైవేపై ఆగని ‘జీరో’ దందా

Published Wed, Feb 23 2022 6:02 AM | Last Updated on Wed, Feb 23 2022 6:02 AM

Gold and silver jewelery smuggling National Highway 44 - Sakshi

కర్నూలు: కర్నూలు జిల్లా మీదుగా వెళ్తున్న 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ‘జీరో’ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పన్ను చెల్లించకుండా సంచులకొద్దీ డబ్బు, బంగారు, వెండి నగలు ఈ రహదారి గుండా బస్సుల్లో గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. గుమాస్తాల ముసుగులో బడా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు యువకులను కొరియర్లుగా వినియోగిస్తున్నారు. చెక్‌పోస్టుల్లో కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడుతున్నా వ్యాపారుల తీరులో మార్పు కనిపించడంలేదు. కర్నూలు శివారులోని పంచలింగాల అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పట్టుబడుతున్న డబ్బు, నగలమూటలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.  

ఐదు రాష్ట్రాలకు అక్రమ రవాణా 
నిబంధనల ప్రకారం ప్రతి ఆభరణానికి జీఎస్టీ ట్యాగ్‌ ఉండాలి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఆభరణాలను తరలించేటప్పుడు జీఎస్టీ ట్యాగ్‌తో పాటు అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఆదాయ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటివేమీ లేకుండా వ్యాపారులు బంగారు, వెండిపై ‘జీరో’ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు, చెన్నై, ఛత్తీస్‌ఘడ్‌లోని పలు ప్రాంతాలకు ఆదాయపన్ను చెల్లించకుండానే గుట్టు చప్పుడు కాకుండా ప్రయాణీకుల మాటున బస్సుల్లో బంగారు వెండి ఆభరణాలతో పాటు డబ్బును తరలిస్తున్నారు. గతేడాది జూన్‌ నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో ఇలాంటి తరహా కేసులు దాదాపు 175కుపైగా నమోదు చేశారు. సుమారు రూ. 3.50 కోట్లు నగదు, 26 కిలోల బంగారు, 295 కిలోల వెండి, 83 సెల్‌ఫోన్లను తనిఖీ అధికారులు సీజ్‌ చేశారు. ఐదు రాష్ట్రాలకు జిల్లా మీదుగా అక్రమ రవాణా జరుగుతుందని స్పష్టమవుతోంది.

జీఎస్టీ లేకుండా.. 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురు వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అక్కడి నుంచి తమిళనాడులోని సేలంకు నెలలో కనీసం రెండుసార్లు భారీ మొత్తంలో బంగారు, వెండి నగలు జీఎస్టీ లేకుండానే తరలిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. తమిళనాడుకు చెందిన విజయశర్మ, సురేష్‌ మునిస్వామి రూ. 2.30 కోట్ల విలువ చేసే 3.79 కిలోల బంగారు నగలు, 435 క్యారెట్ల వజ్రాలను కారులో తరలిస్తూ గత ఏడాది ఇదే చెక్‌పోస్టులోనే పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది. అలాగే బెంగళూరుకు చెందిన చేతన్‌కుమార్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌లో రెండు ట్రాలీ బ్యాగుల్లో రూ.3.05 కోట్లు నగదు తీసుకెళ్తూ గతేడాది ఏప్రిల్‌ నెలలో చెక్‌పోస్టు సిబ్బందికి చిక్కారు. భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయపన్ను చెల్లించుకోవాల్సి వచ్చింది.  

గుమస్తాల ముసుగులో.. 
గుమస్తాల ముసుగులో కొందరు యువకులు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి కమీషన్‌ రూపంలో పనికి తగ్గట్టు వ్యాపారులు డబ్బు చెల్లిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగుళూరు, తిరుపతి, రాయఘడ్‌ వంటి ముఖ్య నగరాలకు బస్సుల్లో గుట్టుచప్పుడు కాకుండా రవాణా జరుగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎక్కువగా ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం ఉండో లేక విధి నిర్వహణలో భాగంగా చెక్‌పోస్టు విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీలు చేస్తే పట్టుబడేది కొంతే. నిత్యం చెక్‌పోస్ట్‌ దాటిపోయేది ఎక్కువ. వరుసగా గత మూడు రోజుల్లో ఈ చెక్‌పోస్టులో రూ. 1.20 కోట్ల విలువ చేసే 167.425 కిలోల వెండి నగలు పట్టుబడటంతో తనిఖీ అధికారులే అవాక్కయ్యారు. పన్నులు చెల్లించకుండా నగలు, నగదును తరలిస్తున్న వ్యాపారుల ధైర్యం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆలోచనలోకి నెట్టింది.

పన్ను చెల్లించాల్సిందే
ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తరువాతనే పట్టుబడిన నగలు, నగదు తిరిగి వారి యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చెక్‌పోస్టులో మూడు షిఫ్టుల్లో నిరంతరం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆభరణానికి జీఎస్టీ ట్యాగ్‌ ఉండాలి. లేకపోతే వాటిని సీజ్‌ చేసి రవాణాదారులపైæ కేసు నమోదు చేస్తున్నాం. 
– తుహీన్‌ సిన్హా, సెబ్‌ జేడీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement