real estate merchants
-
హైవేపై ఆగని ‘జీరో’ దందా
కర్నూలు: కర్నూలు జిల్లా మీదుగా వెళ్తున్న 44వ నంబర్ జాతీయ రహదారిపై ‘జీరో’ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పన్ను చెల్లించకుండా సంచులకొద్దీ డబ్బు, బంగారు, వెండి నగలు ఈ రహదారి గుండా బస్సుల్లో గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. గుమాస్తాల ముసుగులో బడా రియల్ఎస్టేట్ వ్యాపారులు యువకులను కొరియర్లుగా వినియోగిస్తున్నారు. చెక్‌పోస్టుల్లో కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడుతున్నా వ్యాపారుల తీరులో మార్పు కనిపించడంలేదు. కర్నూలు శివారులోని పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పట్టుబడుతున్న డబ్బు, నగలమూటలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఐదు రాష్ట్రాలకు అక్రమ రవాణా నిబంధనల ప్రకారం ప్రతి ఆభరణానికి జీఎస్టీ ట్యాగ్ ఉండాలి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఆభరణాలను తరలించేటప్పుడు జీఎస్టీ ట్యాగ్‌తో పాటు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఆదాయ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటివేమీ లేకుండా వ్యాపారులు బంగారు, వెండిపై ‘జీరో’ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు, చెన్నై, ఛత్తీస్‌ఘడ్‌లోని పలు ప్రాంతాలకు ఆదాయపన్ను చెల్లించకుండానే గుట్టు చప్పుడు కాకుండా ప్రయాణీకుల మాటున బస్సుల్లో బంగారు వెండి ఆభరణాలతో పాటు డబ్బును తరలిస్తున్నారు. గతేడాది జూన్ నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో ఇలాంటి తరహా కేసులు దాదాపు 175కుపైగా నమోదు చేశారు. సుమారు రూ. 3.50 కోట్లు నగదు, 26 కిలోల బంగారు, 295 కిలోల వెండి, 83 సెల్ఫోన్లను తనిఖీ అధికారులు సీజ్ చేశారు. ఐదు రాష్ట్రాలకు జిల్లా మీదుగా అక్రమ రవాణా జరుగుతుందని స్పష్టమవుతోంది. జీఎస్టీ లేకుండా.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురు వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అక్కడి నుంచి తమిళనాడులోని సేలంకు నెలలో కనీసం రెండుసార్లు భారీ మొత్తంలో బంగారు, వెండి నగలు జీఎస్టీ లేకుండానే తరలిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. తమిళనాడుకు చెందిన విజయశర్మ, సురేష్ మునిస్వామి రూ. 2.30 కోట్ల విలువ చేసే 3.79 కిలోల బంగారు నగలు, 435 క్యారెట్ల వజ్రాలను కారులో తరలిస్తూ గత ఏడాది ఇదే చెక్‌పోస్టులోనే పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది. అలాగే బెంగళూరుకు చెందిన చేతన్‌కుమార్ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్‌లో రెండు ట్రాలీ బ్యాగుల్లో రూ.3.05 కోట్లు నగదు తీసుకెళ్తూ గతేడాది ఏప్రిల్ నెలలో చెక్‌పోస్టు సిబ్బందికి చిక్కారు. భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయపన్ను చెల్లించుకోవాల్సి వచ్చింది. గుమస్తాల ముసుగులో.. గుమస్తాల ముసుగులో కొందరు యువకులు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి కమీషన్ రూపంలో పనికి తగ్గట్టు వ్యాపారులు డబ్బు చెల్లిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగుళూరు, తిరుపతి, రాయఘడ్ వంటి ముఖ్య నగరాలకు బస్సుల్లో గుట్టుచప్పుడు కాకుండా రవాణా జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం ఉండో లేక విధి నిర్వహణలో భాగంగా చెక్‌పోస్టు విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీలు చేస్తే పట్టుబడేది కొంతే. నిత్యం చెక్‌పోస్ట్ దాటిపోయేది ఎక్కువ. వరుసగా గత మూడు రోజుల్లో ఈ చెక్‌పోస్టులో రూ. 1.20 కోట్ల విలువ చేసే 167.425 కిలోల వెండి నగలు పట్టుబడటంతో తనిఖీ అధికారులే అవాక్కయ్యారు. పన్నులు చెల్లించకుండా నగలు, నగదును తరలిస్తున్న వ్యాపారుల ధైర్యం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆలోచనలోకి నెట్టింది. పన్ను చెల్లించాల్సిందే ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తరువాతనే పట్టుబడిన నగలు, నగదు తిరిగి వారి యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చెక్‌పోస్టులో మూడు షిఫ్టుల్లో నిరంతరం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆభరణానికి జీఎస్టీ ట్యాగ్ ఉండాలి. లేకపోతే వాటిని సీజ్ చేసి రవాణాదారులపైæ కేసు నమోదు చేస్తున్నాం. – తుహీన్ సిన్హా, సెబ్ జేడీ -
ఎర్రగట్టులో కబ్జాగుట్టు!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎర్రగట్టు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వంలో కీల క పదవిలో ఉన్న సీనియర్ ప్రజాప్రతినిధి అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆలయ భూము లు స్వాహా చేశారు. భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు చేసినా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. మొదట్లో భూముల గుర్తింపు కోసం సర్వే చేసినట్లు వ్యవహరించినా తర్వాత ఆగిపోయారు. రాజకీయ నేతల ఒత్తిడితోనే అధికారులు ఈ విషయంలో కబ్జాదారులకు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేతల ఒత్తిడి, ప్రభుత్వ అధికారుల అలసత్వంతో ఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 28 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. జిల్లా కేంద్రం పరిసరాల్లోని భూము లు కావడంతో ధరలు ఎక్కుగానే ఉన్నాయి. కబ్జాదారులపాలైన ఎర్రగట్టు ఆలయ భూముల విలువ రూ.28 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా కబ్జాలతో ఎర్రగట్టు ఆలయానికి ప్రస్తుతం 6 ఎకరాలు మాత్రమే ఉంది. విలువైన భూములు అన్యాక్రాంతమైన జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రికార్డులు మాయం! హసన్‌పర్తిలోని ఎర్రగట్టు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వరంగల్-కరీంనగర్ జిల్లాల్లో సుమారు 34 ఎకరాల భూమి ఉండేది. హన్మకొండ శివారులోని భీమారంలో సర్వే నంబర్137/సీలో ఎర్రగట్టు దేవస్థానికి 10 గుంటల భూమి ఉంది. ఈ భూమిలో కోనేరు ఉంది. జాతర సమయంలో భక్తులు కోనేరు వద్ద విడిది చేసేవారు. కాలక్రమేణ కోనేరు వద్ద భక్తుల రద్దీ తగ్గింది. ఇదే అదనుగా ఓ రియల్టర్ కోనేరు భూమిపై కన్నేశాడు. రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమించాడు. ప్లాట్లుగా విభజించి విక్రయించాడు. ఇలా ఆలయ భూమి అన్యాక్రాంతమైంది. 1954కు ముందు ఉన్న రెవెన్యూ రికార్డులు ప్రకారం హసన్‌పర్తిలోని 369 సర్వే నెంబరులో 1.34 ఎకరాలు, 481 సర్వే నెంబరులో 1.10 ఎకరాలు, 482 సర్వే నంబరులో 2.10 ఎకరాలు, 738 సర్వే నంబరులో 2.15 ఎకరాలు, 846 సర్వే నంబరులో 3.06 ఎకరాలు, 293 సర్వే నంబరులో 22 గుంటలు, పెంబర్తిలోని 355 సర్వే నంబరులో 1.11 ఎకరాల భూమి ఎర్రగట్టు శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం పేరిట ఉన్నాయి. 1954 తర్వాత చింతగట్టుకు చెందిన బిల్లా వంశస్తులు భీమారంలోని సర్వే నంబర్ 137/సీలో కోనేరును దేవస్థానానికి ఇచ్చారు. భీమారం శివారులోని భూములు విక్రయించినప్పడు బిల్లా వంశస్తులు కోనేరును వదిలి పెట్టి.. మిగిలిన భూములు కొలతలు వేశారని అప్పటి రెవెన్యూ అధికారి రామకృష్ణ తెలిపారు. గోపాలపురం శివారులోని 30 సర్వే నంబరులో 0.37 ఎకరాల భూమి ఉంది. రూ.2 కోట్ల విలువైన ఈ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేసుకుని ప్లాట్లుగా విభజించాడు. ఈ వ్యవహారంలో కోర్టుకు వెళ్లింది. చివరికి గోపాలపురంలోని ఈ భూమి దేవస్థానానికి చెందినట్లుగా కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ కేవలం 20 గంటల భూమి మాత్రమే ఉంది. మిగిలిన 17 గంటల భూమి కబ్జాకు గురైందని తెలుస్తోంది. ఈ భూమితోపాటు, గోపాలపురంలోని దుప్ప తీర్థం జరిగే మరో 20 గుంటల భూమి రికార్డులను అధికారులు మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోనేరుకు, దీని పరిసర ప్రాంతంలో చింతగట్టుకు చెందిన బిల్లా వంశస్తులు మూడేకరాల భూములు దానం ఇచ్చారని, రెవెన్యూ, దేవస్థాన అధికారులు ఏకంగా రికార్డులు మాయం చేసి.. ఆ భూములను రియల్టర్లకు కట్టబెట్టారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా వచ్చారు.. ఇలా వెళ్లారు.. ఎర్రగట్టు ఆలయానికి చెందిన భీమారంలోని సర్వే నంబర్ 137/సీలోని కోనేరుకు ఉన్న భూమి ఆక్రమణ వ్యవహారం ఏడాది క్రితం వెలుగులోకి వచ్చింది. ఆలయ చైర్మన్ బూర సురేందర్‌గౌడ్ భూముల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకోచ్చారు. కోనేరుతోపాటు ఎర్రగట్టు భూముల ఆక్రమణలపై 2014, జనవరి 4న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. దీంతో దేవాదాయ శాఖ ఉప కమిషనరు రమేశ్‌బాబు ఆలయానికి వచ్చారు. కోనేరును, దేవాదాయశాఖకు చెందిన రికార్డులను పరిశీలించారు. రికార్డుల ప్రకారం దేవాలయ భూములకు హద్దులు నిర్ధారించి, దేవుని పేరిట పాస్‌పుస్తకాలు జారీ చేస్తామని చెప్పారు. కబ్జాకు గురైన ఆలయ భూములను రెండు నెలల్లో స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా.. దేవాదాయ శాఖ అధికారులుగానీ, రెవె న్యూ అధికారులుగానీ పట్టించుకోలేదు. ఇప్పుడైనా అధికారులు స్పందించాలని వెంకన్న భక్తులు కోరుకుంటున్నారు.