ఎర్రగట్టులో కబ్జాగుట్టు! | erragattu sri vekateswara swamy lands are in kabja | Sakshi
Sakshi News home page

ఎర్రగట్టులో కబ్జాగుట్టు!

Published Fri, Nov 28 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

ఎర్రగట్టులో కబ్జాగుట్టు!

ఎర్రగట్టులో కబ్జాగుట్టు!

సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎర్రగట్టు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వంలో కీల క పదవిలో ఉన్న సీనియర్ ప్రజాప్రతినిధి అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆలయ భూము లు స్వాహా చేశారు. భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు చేసినా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. మొదట్లో భూముల గుర్తింపు కోసం సర్వే చేసినట్లు వ్యవహరించినా తర్వాత ఆగిపోయారు. రాజకీయ నేతల ఒత్తిడితోనే అధికారులు ఈ విషయంలో కబ్జాదారులకు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాజకీయ నేతల ఒత్తిడి, ప్రభుత్వ అధికారుల అలసత్వంతో ఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 28 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. జిల్లా కేంద్రం పరిసరాల్లోని భూము లు కావడంతో ధరలు ఎక్కుగానే ఉన్నాయి. కబ్జాదారులపాలైన ఎర్రగట్టు ఆలయ భూముల విలువ రూ.28 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా కబ్జాలతో ఎర్రగట్టు ఆలయానికి ప్రస్తుతం 6 ఎకరాలు మాత్రమే ఉంది. విలువైన భూములు అన్యాక్రాంతమైన జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
రికార్డులు మాయం!
హసన్‌పర్తిలోని ఎర్రగట్టు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వరంగల్-కరీంనగర్ జిల్లాల్లో సుమారు 34 ఎకరాల భూమి ఉండేది. హన్మకొండ శివారులోని భీమారంలో సర్వే నంబర్137/సీలో ఎర్రగట్టు దేవస్థానికి 10 గుంటల భూమి ఉంది. ఈ భూమిలో కోనేరు ఉంది. జాతర సమయంలో భక్తులు కోనేరు వద్ద విడిది చేసేవారు. కాలక్రమేణ కోనేరు వద్ద భక్తుల రద్దీ తగ్గింది. ఇదే అదనుగా ఓ రియల్టర్ కోనేరు భూమిపై కన్నేశాడు. రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమించాడు. ప్లాట్లుగా విభజించి విక్రయించాడు. ఇలా ఆలయ భూమి అన్యాక్రాంతమైంది.

1954కు ముందు ఉన్న రెవెన్యూ రికార్డులు ప్రకారం హసన్‌పర్తిలోని 369 సర్వే నెంబరులో 1.34 ఎకరాలు, 481 సర్వే నెంబరులో 1.10 ఎకరాలు, 482 సర్వే నంబరులో 2.10 ఎకరాలు, 738 సర్వే నంబరులో 2.15 ఎకరాలు, 846 సర్వే నంబరులో 3.06 ఎకరాలు, 293 సర్వే నంబరులో 22 గుంటలు, పెంబర్తిలోని 355 సర్వే నంబరులో 1.11 ఎకరాల భూమి ఎర్రగట్టు శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం పేరిట ఉన్నాయి. 1954 తర్వాత చింతగట్టుకు చెందిన బిల్లా వంశస్తులు భీమారంలోని సర్వే నంబర్ 137/సీలో కోనేరును దేవస్థానానికి ఇచ్చారు. భీమారం శివారులోని భూములు విక్రయించినప్పడు బిల్లా వంశస్తులు కోనేరును వదిలి పెట్టి.. మిగిలిన భూములు కొలతలు వేశారని అప్పటి రెవెన్యూ అధికారి రామకృష్ణ తెలిపారు.

గోపాలపురం శివారులోని 30 సర్వే నంబరులో 0.37 ఎకరాల భూమి ఉంది. రూ.2 కోట్ల విలువైన ఈ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేసుకుని ప్లాట్లుగా విభజించాడు. ఈ వ్యవహారంలో కోర్టుకు వెళ్లింది. చివరికి గోపాలపురంలోని ఈ భూమి దేవస్థానానికి చెందినట్లుగా కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ కేవలం 20 గంటల  భూమి మాత్రమే ఉంది. మిగిలిన 17 గంటల భూమి కబ్జాకు గురైందని తెలుస్తోంది. ఈ భూమితోపాటు, గోపాలపురంలోని దుప్ప తీర్థం జరిగే మరో 20 గుంటల భూమి రికార్డులను అధికారులు మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోనేరుకు, దీని పరిసర ప్రాంతంలో చింతగట్టుకు చెందిన బిల్లా వంశస్తులు మూడేకరాల భూములు దానం ఇచ్చారని, రెవెన్యూ, దేవస్థాన అధికారులు ఏకంగా రికార్డులు మాయం చేసి.. ఆ భూములను రియల్టర్లకు కట్టబెట్టారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

అలా వచ్చారు.. ఇలా వెళ్లారు..
ఎర్రగట్టు ఆలయానికి చెందిన భీమారంలోని సర్వే నంబర్ 137/సీలోని కోనేరుకు ఉన్న భూమి ఆక్రమణ వ్యవహారం ఏడాది క్రితం వెలుగులోకి వచ్చింది. ఆలయ చైర్మన్ బూర సురేందర్‌గౌడ్ భూముల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకోచ్చారు. కోనేరుతోపాటు ఎర్రగట్టు భూముల ఆక్రమణలపై 2014, జనవరి 4న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. దీంతో దేవాదాయ శాఖ ఉప కమిషనరు రమేశ్‌బాబు ఆలయానికి వచ్చారు. కోనేరును, దేవాదాయశాఖకు చెందిన రికార్డులను పరిశీలించారు.

రికార్డుల ప్రకారం దేవాలయ భూములకు హద్దులు నిర్ధారించి, దేవుని పేరిట పాస్‌పుస్తకాలు జారీ చేస్తామని చెప్పారు. కబ్జాకు గురైన ఆలయ భూములను రెండు నెలల్లో స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా.. దేవాదాయ శాఖ అధికారులుగానీ, రెవె న్యూ అధికారులుగానీ పట్టించుకోలేదు. ఇప్పుడైనా అధికారులు స్పందించాలని వెంకన్న భక్తులు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement