అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జాతీయ రహదారి కూడలి
సాక్షి, హైదరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిలో తీవ్ర ట్రాఫిక్ రద్దీతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఎల్బీనగర్–దండుమల్కాపూర్ సెక్షన్‌ను ఆరు వరసలుగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. రూ.600 కోట్లతో సుమారు 25 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. రహదారి వెంట సర్వీస్ రోడ్లతోపాటు ఎనిమిది చోట్ల ఫైఓవర్లను నిర్మించనున్నారు.
నిజానికి ఎల్బీనగర్–దండుమల్కాపూర్ మధ్య రోడ్డు విస్తరణ ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. గత ఏడాదే కేంద్రం దీనికి ఆమోదం తెలిపి, డీపీఆర్ తయారీకి ఆదేశించినా.. పనులు కదల్లేదు. నిర్మాణ సంస్థ అలసత్వం వల్ల ఆలస్యమవుతోందని ఇటీవలి భేటీ సందర్భంగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు. వేరే సంస్థకు అప్పగించి అయినా త్వరగా పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.
ట్రాఫిక్ చిక్కుల్లేకుండా..
విపరీతంగా రద్దీ ఉండే ఈ రహదారిలో ట్రాఫిక్ ఇబ్బంది తప్పేలా ఎనిమిది చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. పనామా గోడౌన్, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, కోహెడ క్రాస్‌రోడ్డు, పెద్ద అంబర్‌పేట, అనాజ్‌పూర్‌రోడ్డు, ఇనాంగూడ, బాటసింగారం ప్రాంతాల్లో వీటిని చేపడతారు. వనస్థలిపురంతోపాటు మరోచోట రెండు ఫుట్‌ఓవర్ వంతెనలను కూడా నిర్మిస్తారు. ఈ దారి వెంట సర్వీసురోడ్లు కూడా నిర్మించనున్నారు.
ఫలించిన కోమటిరెడ్డి ఒత్తిడి..
హైదరాబాద్–విజయవాడ రహదారిని విస్తరించాలని చాలాకాలంగా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. ఓవైపు ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు నగరంలో రోడ్డు విస్తరణ, తర్వాత అక్కడి నుంచి విజయవాడ వరకు విస్తరణ జరగాల్సి ఉంది. దీనిపై కోమటిరెడ్డి ఒత్తిడి మేరకు నగరం పరిధిలో రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని గడ్కరీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మేలోనే పనులు మొదలై.. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సానుకూలంగా స్పందించారు: కోమటిరెడ్డి
‘‘విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించేవారి ప్రాణాలకు గ్యారెంటీ లేదు. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరణ లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేను కూడా రెండుమూడు సార్లు ప్రమాదాల నుంచి తప్పించుకున్నాను. ఈ క్రమంలోనే రహదారి విస్తరణ చేపట్టాలని గడ్కరీని పలుమార్లు కలిసి కోరగా.. సానుకూలంగా స్పందించారు’’అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దీనితోపాటు హైదరాబాద్ గౌరెల్లి ఔటర్ నుంచి పోచంపల్లి, వలిగొండ, భద్రాచలం మీదుగా ఒడిశా వరకు మరో జాతీయ రహదారిని నిర్మించాలని కోరగా.. గడ్కరీ సాసుకూలంగా స్పందించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment