చౌటుప్పల్: త్వరలో హైవే విస్తరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు. దీంతో హైదరాబాద్– విజయవాడ 65వ నంబరు జాతీయరహదారి ఆరు లేన్ల విస్తరణకు మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. మంత్రి ప్రకటనతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వాహనదారులు, ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
బీఓటీ పద్ధతిన నాలుగు లేన్లుగా విస్తరణ
హైదరాబాద్ – విజయవాడ మధ్య 275 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో హైదరాబాద్ నుంచి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వరకు, ఏపీలోని విజయవాడ నుంచి నందిగామ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విస్తరించారు. మిగిలిన 180 కిలోమీటర్లు మాత్రం బీఓటీ పద్ధతిన నాలుగులేన్లుగా నిర్మించారు. ఈ పనులను జీఎంఆర్ సంస్థ చేపట్టింది. ఈ పనులకు అప్పటి సీఎం రోశయ్య 2010 మార్చిలో నార్కట్‌పల్లి వద్ద శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేసి మూడు ప్రాంతాల్లో టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుము వసూలు చేస్తోంది.
కోర్టును ఆశ్రయించిన జీఎంఆర్ సంస్థ
ఈ హైవేను ఆరులేన్లుగా విస్తరించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే హైవే విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ ముందస్తుగా కోర్టును ఆశ్రయించింది. తాము బీఓటీ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పనులు చేశామని, టోల్ వసూలు చేసుకునేందుకు తమకు ఇంకా గడువు ఉందని, పెట్టుబడి కింద టోల్ వసూళ్లు అనుకున్న మేరకు రానందున మరికొంత కాలం అనుమతి ఇప్పించాలని కోర్టుకు వెళ్లింది. దీంతో విస్తరణ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.
అత్యంత రద్దీ రహదారిగా గుర్తింపు
హైదరాబాద్– విజయవాడ హైవే దేశంలోనే అత్యంత రద్దీ రహదారిగా గుర్తింపు పొందింది. టోల్‌ప్లాజాల లెక్కల ప్రకారం రోజూ సగటున 40వేల నుంచి 50వేల వాహనాలు ఈ మార్గంలో వెళుతున్నాయి. దీనిపై ఏ చిన్నపాటి ప్రమాదం జరిగినా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది.
అన్ని విధాలుగా ప్రయోజనం
హైవేను ఆరు వరుసలుగా విస్తరిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. వాహనదారులు, ప్రయాణికులకు సమయం కూడా కలిసివస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాం. – చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, చౌటుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు
సర్విస్ రోడ్లు ఏర్పాటు చేయాలి
ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న హైవేపై నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. దీనిని తగ్గించడానికి ఆరు వరుస లు అవసరం. విస్తరణతోపాటు హైవే వెంట ఉన్న అన్ని గ్రామాల వద్ద సర్వీసు రోడ్లు నిర్మించాలి. – బాతరాజు సత్యం, పంతంగి సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment