
సాక్షి, అమరావతి: రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఏజెన్సీ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి 516 –ఇ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధమయ్యాయి. 2017లోనే ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డీపీఆర్‌లు పూర్తి చేయాలని కేంద్రం గతంలో సూచించినా.. అప్పటి ప్రభుత్వం పెడచెవినే పెట్టింది. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్రం తాజాగా సంప్రదించగా, డీపీఆర్‌లు వెంటనే తయారు చేయాలని ఆదేశాలిచ్చారు. దాంతో డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. కేంద్రానికి పంపి త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతిపాదిత రహదారికి మొత్తం
ఆరు ప్యాకేజీలుగా డీపీఆర్‌లు తయారు చేశారు. రాజమండ్రి–రంపచోడవరం, రంపచోడవరం–కొయ్యూరు, కొయ్యూరు–లంబసింగి, లంబసింగి–పాడేరు, పాడేరు–అరకు, అరకు నుంచి గౌడార్ మీదుగా శృంగవరపుకోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా డీపీఆర్‌లు తయారు చేశారు. మొత్తం 406 కిలోమీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది.
అధిక శాతం ఘాట్ రోడ్...
ఈ మార్గంలో అధిక భాగం కొండ దారి నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వాన్నంగా ఉంది. రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా) వయా తుని, అన్నవరం, అనకాపల్లి మీదుగా 227 కిలోమీటర్ల వరకు పొడవు ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ నిర్మించే కొత్త జాతీయ రహదారి 516– ఇ పొడవు 406 కిలోమీటర్లకు పైనే. దూరం ఎక్కువైనా పర్యాటకంగా, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధితో పాటు మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు కేంద్రం ఈ జాతీయ రహదారి చేపట్టినట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా వచ్చే వారికీ ఇది వెసులుబాటుగా ఉంటుంది.
నిర్మాణానికి రూ.4 వేల కోట్లు...
516 జాతీయ రహదారి నిర్మాణానికి రూ.4 వేల కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. రెండు వరుసల రహదారి కావడంతో కిలోమీటరుకు రూ.10 కోట్లు వరకు ఖర్చు అవుతుంది. డీపీఆర్‌లు ఆమోదం పొందితే వచ్చే ఏడాదిలో ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు మొదలవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment