హరియాణ : లక్షలు ఖరీదుచేసి వాహనాలు కొనుగోలు చేసే కొందరు టోల్ చెల్లించేందుకు మాత్రం తెగ ఇదైపోతారు. టోల్‌ప్లాజాలో పనిచేసే ఉద్యోగులపై ఎక్కడా లేని కోపం ప్రదర్శిస్తారు. గురుగ్రామ్‌లో నెలక్రితం టోల్ ప్లాజాలో పనిచేసే మహిళా సిబ్బందిపై ఓ వాహనదారుడి దాడి ఘటన మరువకముందే అలాంటి ఘటనే శనివారం ఉదయం చోటుచేసుకుంది. కారు టోల్ ఫీజు చెల్లించేందుకు నిరాకరించిన ఓ ఇద్దరు అక్కడి సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. దుర్భాషలాడుతూ పక్కనే ఉన్న డ్రమ్‌తో టోల్ సిబ్బందిలో ఒకరి తలపై బలంగా కొట్టారు.
దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సహోద్యోగులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన హరియాణాలోని బహదూర్‌పూర్ వద్ద గల తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. ఇక ఈ వ్యవహారం కొనసాగుతుండగానే సదరు వాహన డ్రైవరు కారును టోల్ గేట్ దాటించేశాడు. అక్కడున్న సీసీటీవీల్లో దాడి దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. తమ విధులను అడ్డుకోవడంతోపాటు దాడులు చేస్తుండటంతో టోల్ బూత్‌లలో పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని టోల్ నిర్వాహకులు వాపోతున్నారు.