దీనికోసం హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలి
ఢిల్లీ ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల ముందు సీఎం రేవంత్ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: సముద్ర తీరం లేని తెలంగాణలో ఏర్పాటు చేసే డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేలా హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్‌హెచ్‌ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఉన్నతాధికారులను కోరారు. తెలంగాణలో నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అడ్డంకిగా ఉన్న చిక్కుముడులను తొలగించే అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల బృందం మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. బుధవారం ఆ బృందంతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, తనను మంగళవారం కలిసిన అధికారులతో కొన్ని ముఖ్యమైన అంశాలపై ఆయన చర్చించారు.
తెలంగాణలో నిర్మిస్తున్న రోడ్లకు సంబంధించిన సమస్యలను తమ స్థాయిలో పరిష్కరించదగ్గవాటిని పరిష్కరిస్తామని, భూసేకరణ అంశాలను కొలిక్కి తెస్తామని వారికి సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డ్రైపోర్టుకు బందరు పోర్టుతో కనెక్టివిటీ ప్రతిపాదనపై చర్చించారు. అలాగే హైదరాబాద్–విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టును భారత్‌మాల పరియోజనలో భాగంగా చేపట్టాలని ఇటీవల తాను ప్రధానికి సూచించిన విషయాన్ని వారి ముందు ప్రస్తావించారు. ఓఆర్‌ఆర్–ఆర్‌ఆర్‌ఆర్ మధ్య 12 రేడియల్ రోడ్లు వస్తాయని, వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్íÙప్స్ నిర్మిస్తామని వెల్లడించారు.
వెంటనే రీజినల్ రింగ్ రోడ్డు పనులను, మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్–కల్వకుర్తి పనులను పూర్తిచేస్తే తిరుపతికి 70 కి.మీ. దూరం తగ్గుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల–వరంగల్– ఖమ్మం–విజయవాడ రోడ్డుకు సంబంధించిన భూమి అప్పగింత, ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు, వరంగల్–కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ఫ్లైయాష్ సేకరణ, కాళ్లకల్–గుండ్లపోచంపల్లి రహదారి ఆరు వరసల విస్తరణకు భూ సేకరణ, జాతీయ రహదారుల నిర్మాణంలో విద్యుత్ సంస్థలతో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం, ఖమ్మం–దేవరపల్లి, ఖమ్మం–కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీసు భద్రత ఏర్పాటు..
తదితర అంశాలను ఎన్‌హెచ్‌ఐఏ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా అంశాలపై బుధవారం సమగ్రంగా సమీక్షించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. పలు సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరికే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment