సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కరివెను వరకు ఉన్న 122 కి.మీ. రోడ్డు మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, మన రాష్ట్రంలోని నంద్యాల, ఆత్మకూరులను కలిపే ఈ మార్గాన్ని ‘ఎన్‌హెచ్–167 కె’ గా ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా రూ.820 కోట్లతో చేపట్టే ఈరోడ్డు నిర్మాణంలో భాగంగా సోమశిల వద్ద కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల మేర వంతెన నిర్మిస్తారు. ఈ రహదారి 96 కి.మీ. తెలంగాణలో, 26 కి.మీ. ఏపీలో ఉంది. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–తిరుపతి మధ్య 80 కి.మీ. దూరం తగ్గుతుంది. రోడ్ కమ్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రం భారత్‌మాల ఫేజ్–1లో చేర్చింది. తద్వారా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు మార్గం సుగమమైంది. మారుమూల గ్రామాలకు నగరాలతో కనెక్టివిటీ పెరగనుంది.
బ్రిడ్జి కమ్ బ్యారేజీగా మార్చాలని వినతి
► రూ.820 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో కృష్ణానదిపై బ్రిడ్జి కమ్ రోడ్ కాకుండా బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని కర్నూలు జిల్లా వాసులు కోరుతున్నారు.
► బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణంతో రెండు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో తాగు, సాగునీటికి ఉపయోగకరంగా ఉంటుందని సాగునీటిసంఘాల అధ్యక్షులు పేర్కొంటున్నారు.
► ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక పేరుకోకుండా ఉంటుందని చెబుతున్నారు.
► 2007లో కృష్ణానదిలో బోటు ప్రమాదం జరిగి 61 మంది మరణించారు. ఆ సమయంలో ఇక్కడ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు.
► 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక్కడ రోడ్ కమ్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మరణం తర్వాత ఎవరూ ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు.
రూ. 820 కోట్లతో ఎన్‌హెచ్–167కె నిర్మాణం
Published Mon, Nov 9 2020 3:50 AM | Last Updated on Mon, Nov 9 2020 5:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment