ఎట్టకేలకు ‘రూట్‌’ క్లియర్‌ | Another type of expressway is a full access controlled highway | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ‘రూట్‌’ క్లియర్‌

Published Thu, Feb 22 2024 5:00 AM | Last Updated on Thu, Feb 22 2024 6:11 PM

Another type of expressway is a full access controlled highway - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాదాలు.. ఉద్యమాలు.. వ్యతిరేకతలతో ఒక్క అడుగు కూడా ముందుకు పడ కుండా పోయిన ఓ జాతీయ రహదారి కథ కొలిక్కి వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఇది రాష్ట్రంలో మరో ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో పూర్తి యాక్సెస్‌ కంట్రోల్డ్‌ హైవేగా రూపుదిద్దుకోబోతోంది. 131.8 కి.మీ. మేర నిర్మించే నాలుగు వరసల రహదారిలో 46 వంతెనలతో పాటు ఆర్‌ఓబీలు, అండర్‌పాస్‌లు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  

ప్రమాదాలు జరుగుతుండటంతో.. 
నిజామాబాద్‌– ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌ ఎన్‌హెచ్‌ 63పై ట్రక్కులు ఎక్కువగా తిరుగుతుంటాయి. రెండు లేన్లతో ఇరుగ్గా ఉన్న రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారటంతో 4 వరసలకు విస్తరించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ఇందులో నిజామాబాద్‌ నుంచి ఆర్మూరు శివారులోని హైవే 44 వరకు, తిరిగి మంచిర్యాల దాటిన తర్వాత ఉండే హైవే 363 నుంచి ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు చెన్నూరు వరకు.. రాష్ట్రప్రభుత్వ ఆదీనంలోని హైవేల విభాగం విస్తరిస్తుంది. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు కీలక నిర్మాణం అయినందున దాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు అప్పగించారు.

రాష్ట్ర విభాగం ఇప్పటికే ఆ రోడ్డును అవసరమైన ప్రాంతాల్లో 4 వరసలుగా మార్చడం, మిగతా చోట్ల మెరుగుపరచటం చేస్తోంది. అయితే ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించిన ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు పట్ణణాలు, గ్రామాల మీదుగా సాగుతున్నందున దాన్ని పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేగా మార్చాలని భావించారు. కానీ అందుకు భారీ మొత్తంలో సాగు భూములు సేకరించాల్సి రావటంతో రైతులు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో  ఉన్న రోడ్డునే విస్తరించాలని భావించారు. కానీ, పట్టణాలు, గ్రామాల్లో భారీగా నిర్మాణాలను తొలగించాల్సి రావటంతో ఈసారి పట్టణ, గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు.

దీంతో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. చివరకు పట్టణాలు, గ్రామాలున్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. గత నెల్లో టెండర్లు పిలవగా, ఇప్పుడు వాటిని ఓపెన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డు నిర్మాణంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. రోడ్డు డిజైన్, ఎలివేటెడ్‌ కారిడార్‌ నమూనాలు, రహదారులను క్రాస్‌ చేసేందుకు వీలుగు చేయాల్సిన ఏర్పాట్లు తదితరాలపై చర్చించారు. నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుని త్వరలో పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు.  

నో డైరెక్ట్‌ క్రాసింగ్‌: ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేటల మీదు గా సాగుతుంది. ఈ మార్గంలో 100 కి.మీ.ల మేర బైపాస్‌లే ఉండనున్నందున ఈ రోడ్డు దాదాపు కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే తరహాలోనే ఉండనుంది. ఆయా పట్టణాల వద్ద 6 కి.మీ. నుంచి 12 కి.మీ. మేర భారీ బైపాస్‌లు ఉంటాయి.

ఇవి కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లు నిర్మిస్తారు. ఇది పూర్తి యాక్సె స్‌ కంట్రోల్డ్‌ రహదారి (ఇతర రోడ్లు దీన్ని నేరుగా క్రాస్‌ చేయడానికి అవకాశం ఉండదు) కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మిస్తారు. బైపాస్‌ల కోసం 500 హెక్టార్ల భూమిని సేకరించారు. దీనికే రూ.900 కోట్లుఖర్చవుతోంది. ఇక వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement