
సాక్షి, న్యూఢిల్లీ : టోల్ రేట్లను జాతీయ హైవేల అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) ఏడు శాతం మేర సవరించడంతో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రాకపోకలు ఆదివారం నుంచి పెనుభారం కానున్నాయి. టోల్ రేట్ల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా పలు వస్తువుల ధరల్లో ఆదివారం నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్‌లో పలు పన్నులు, లెవీల్లో మార్పులకు అనుగుణంగా ఆయా వస్తువులు, ధరలు ప్రభావితమవుతాయి. మరోవైపు రూ లక్షకు మించిన షేర్ల అమ్మకాలపై దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును కేంద్రం తిరిగి ప్రవేశపెట్టింది.
భారమవనున్న వస్తువులను చూస్తే..దిగుమతి చేసుకునే మొబైల్ హ్యాండ్‌సెట్లు, పెర్‌ఫ్యూమ్‌లు, సౌందర్య సాధనాలు, వాచీలు, కళ్లజోళ్లు, జెమ్‌స్టోన్స్, డైమండ్స్, చెప్పులు, సిల్క్ వస్ర్తాలు, జ్యూస్‌లు, ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె, దిగుమతయ్యే బంగారు ఆభరణాల ధరలకు రెక్కలురానున్నాయి. . ఇక ముడి జీడిపప్పు, సోలార్ సెల్స్, ప్యానెల్స్, మాడ్యూల్స్, ఇతర ముడిపదార్థాల ధరలు కొంతమేర దిగిరానున్నాయి.