
సాక్షి, అమరావతి: మన జాతీయ రహదారులు త్వరలో స్మార్ట్ హైవేలుగా రూపాంతరం చెందనున్నాయి. దేశంలో జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్‌సీ) లైన్లు వేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. రూ.6వేల కోట్లతో 25వేల కి.మీ. మేర ఓఎఫ్‌సీ లైన్ల ఏర్పాటుకు భారీ ప్రణాళికను ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ‘గతి శక్తి ప్రాజెక్టు’ కింద ఈ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)తో కలసి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) స్మార్ట్ హైవేలు/డిజిటల్ హైవేల ప్రాజెక్ట్ కార్యాచరణకు ఉపక్రమించింది.
మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద ముంబై–ఢిల్లీ, హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారులలో 2వేల కి.మీ.మేర ఓఎఫ్‌సీ లైన్ల పనులు చేపట్టనుంది. ఇందుకోసం రూ.500కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల టెండర్లు పిలిచింది. అనంతరం చెన్నై–విజయవాడ, ముంబై–అహ్మదాబాద్ జాతీయ రహదారుల్లో 5వేల కి.మీ. మేర పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. బహుళ ప్రయోజనకరంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు ఇవీ...
► బహుళ ప్రయోజనకరంగా స్మార్ట్ హైవేల ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. 2050నాటికి విస్తృతం కానున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
► దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా జాతీయ రహదారుల వెంబడి నిరంతరాయంగా 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు దేశవ్యాప్తంగా లాజిస్టిక్ రంగాన్ని విస్తృతం చేసేందుకు ఇది దోహదపడుతుంది.
► 5జీ సేవల కోసం ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఓఎఫ్‌సీ లైన్లు వేసేందుకు వివిధ అనుమతులు పొందేందుకు సుదీర్ఘ సమయం పడుతుంది. అందుకే జాతీయ రహదారుల వెంబడి కేంద్ర ప్రభుత్వమే డార్క్ ఫైబర్ కనెక్టివిటీని ఏర్పరచడానికి ఓఎఫ్‌సీ లైన్లు వేయాలని నిర్ణయించింది.
► హైవేల వెంబడి అవసరమైన చోట్ల ఓఎఫ్‌సీ లైన్లను నిర్ణీత ఫీజు చెల్లించి ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు వాడుకునేందుకు ట్రాయ్ సమ్మతిస్తుంది. ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ఓఎఫ్‌సీ లైన్లను ఉపయోగించేందుకు వీలుగా ఏర్పాటుచేస్తారు.
► దేశవ్యాప్తంగా త్వరలో టోల్ గేట్లను ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. టోల్ గేట్లు లేకుండా 5జీ నెట్‌వర్క్ సహకారంతో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తారు. అంటే ఓ వాహనం జాతీయ రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే శాటిలైట్ ఆధారిత పరిజ్ఞానంతో ఆటోమేటిగ్గా టోల్ ఫీజు వసూలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జాతీయ రహదారుల వెంబడి 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికి కూడా ఓఎఫ్‌సీ లైన్లు ఉపయోగపడతాయి.
► జాతీయ రహదారులపై భద్రత, నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కూడా ఈ ఓఎఫ్‌సీ లైన్లు ఉపకరిస్తాయి.
► రహదారి భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ రాడార్లు ఏర్పాటు చేయనున్నారు. ఓఎ‹సీ లైన్లు ద్వారానే స్పీడ్ రాడార్లు పనిచేస్తాయి.
► జాతీయ రహదారుల వెంబడి దశలవారీగా స్మార్ట్ హైవే లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఓఎఫ్‌సీ లైన్లు దోహదపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment