సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై ప్రమాదాలకు అధునాతన టెక్నాలజీతో చెక్ పెట్టేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) సిద్ధమవుతోంది. అందుకోసం ఆర్టిఫిషయల్ఇంటెలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానంతో ‘అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సిస్టం(ఏటీఎస్)’ విధానాన్ని రూపొందించింది. ఇప్పుడున్న సీసీ కెమెరాలతో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా పూర్తిస్థాయిలో డిజిటల్ పరిజ్ఞాన పర్యవేక్షణ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి దశలవారీగా కొత్త టెక్నాలజీని అమలు చేయనుంది.
సరికొత్తగా పర్యవేక్షణ..
ప్రస్తుతం జాతీయ రహదారులపై ఉన్న కెమెరాల స్థానంలో సరికొత్త ‘వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్–ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టం(వైడ్స్)’ టెక్నాలజీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వైడ్స్‌తో రూపొందించిన ఈ కెమెరాలతో 14 రకాలుగా వాహనాలను పర్యవేక్షించడానికి సాధ్యపడుతుంది. వాహనాల వేగం అంచనాతో పాటు ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, నిర్దేశిత లైన్‌ను ఉల్లంఘించి ప్రయాణించడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణం, జాతీయ రహదారులపై పశువుల సంచారం, పాదచారులు రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన క్రాసింగ్ లైన్స్, అంబులెన్స్‌ల రాక సహా 14 రకాల సంఘటనలను రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో వెంటనే జాతీయ రహదారులపై విధులు నిర్వహించే పాట్రోలింగ్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చు.
ప్రతి 10 కి.మీ.కు కెమెరాలు..
జాతీయ రహదారులపై ప్రతి 10 కి.మీ.కు ఓ చోట ఈ వైడ్స్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఇక ప్రతి 100 కి.మీ.కు ఓ మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నెలకొల్పుతారు. జాతీయ రహదారుల వెంబడి వేయనున్న ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను సద్వినియోగం చేసుకుని ఈ సెంటర్లు పని చేస్తాయి. ఈ సెంటర్ల పరిధిలోని ప్రాంతంలోని కెమెరాల డాటాను అక్కడ విశ్లేíÙస్తారు. వైడ్స్ కెమెరాల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ఆటోమేటిగ్గా గుర్తించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు.
ఇక ప్రమాదాలను గుర్తించడం, రహదారులపై నిలిచిపోయిన వాహనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఆ ప్రాంతంలోని పోలీసు స్టేషన్లతోపాటు ఆయా రాష్ట్రాల విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాలతో అనుసంధానిస్తారు. సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి కనీసం ఒకరు ఆ కమాండ్‌కంట్రోల్ సెంటర్లలో అందుబాటులో ఉంటారు.
‘రాజ్‌మార్గ్ యాత్ర’ యాప్‌తో అనుసంధానం
జాతీయ రహదారులపై ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్దేశించిన ‘రాజ్‌మార్గ్ మొబైల్ యాప్’తో ఈ వైడ్స్ కెమెరాల డేటాను అనుసంధానిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు ఆటోమేటిగ్గా ఈ–చలానాలు జారీ చేస్తుంది. ఆ సమాచారాన్ని రాజ్‌మార్గ్ మొబైల్ యాప్ ద్వారా వెంటనే వాహన చోదకులకు చేరవేస్తుంది. దాంతోపాటు జాతీయ రహదారులపై ఎదురుగా ఉన్న సైన్‌బోర్డులు, ట్రాఫిక్ జామ్, ఇతర ప్రమాదకర పరిస్థితుల గురించి అప్రమత్తం చేస్తూ సందేశాలను పంపుతుంది. వాహన చోదకులు ఏదైనా అత్యవసర సహాయాన్ని అర్థించేందుకు ఆ యాప్ ద్వారా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment