నారాయణ్‌పేట్: కేంద్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్– చించోలి రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించింది. బెంగుళూరు– ముంబాయి మధ్య జాతీయ రహదారులను అనుసంధానం చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ నుంచి కర్ణాటకలోని మన్నెకలి వరకు ఉన్న 192 కి.మీ., మేర రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించడానికి గతేడాది రూ.703 కోట్లు మంజూరయ్యాయి.
తెలంగాణలో మూడు జిల్లాలను కలుపుతూ వెళ్తున్న ఈ రోడ్డును 167 జాతీయ రహదారిగా గుర్తించారు. మొదటి ప్యాకేజీలో భాగంగా భూత్పూర్ నుంచి దుద్యాల వరకు ఈ ఏడాది మార్చిలో పనులు ప్రారంభించగా.. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల బీటీ వేయగా.. అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణం దాదాపుగా పూర్తిచేశారు.
అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు తొలగిస్తుండటంతో గూడు కోల్పోవడమే కాక.. పలువురి ఉపాధికి ఎసరు వచ్చింది. దీంతో జాతీయ రహదారి వచ్చిందని సంతోషపడాలో.. లేక తమ గూడు చెదిరిందని బాధపడాలో అర్థం కాక గొడోమంటున్నారు.
400 ఇళ్ల వరకు..
5 మండలాల్లోని 17 గ్రామాల్లో 50 ఫీట్లలోపు ఉన్న 400 ఇళ్ల వరకు తొలగిస్తుండడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్లు కళ్ల ముందే కూల్చివేస్తుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం సైతం లేకపోవడం.. అటు ప్రభుత్వం వేరే దారి చూపకపోవడంతో రోడ్డుపాలవుతున్నారు.
50 ఫీట్లలోపు ఉన్న ఇళ్లకు, వ్యవసాయ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వమని అధికారులు తేల్చిచెప్పారు. భూత్పూర్ నుంచి దుద్యాల వరకు కేవలం 100 మాత్రమే 50 ఫీట్ల బయట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి మాత్రమే పరిహారం ఇస్తామనడంతో బాధితులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.
81.5 ఎకరాల భూమి..
భూత్పూర్ నుంచి దుద్యాల వరకు 60 కి.మీ., రోడ్డు విస్తరణకు గాను 81.5 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. 5 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 547 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ పొలాలతోపాటు ప్లాట్లు కూడా ఉన్నాయి. ఆయా గ్రామాల్లో బాధితుల వారిగా ఎవరి భూమి, ఇల్లు ఎంతెంత పోతుంది అని గతేడాది అక్టోబర్‌లోనే అధికారులు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చారు.
ఇళ్లు, భూ నిర్వాసితులకు కలిపి పరిహారం ఇవ్వడానికి రూ.135 కోట్లు కేటాయించారు. అయితే పనులు ప్రారంభమై 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేకపోయారు. ఇటీవల రంగారెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి పరిహారం చెల్లించాలని విస్తరణ పనులు అడ్డుకున్నారు.
హోటల్ పోయింది..
గండేడ్‌లో మంచి అడ్డా దొరకడంతో తాత్కాలికంగా షెడ్డు వేసుకొని హోటల్ నిర్వహిస్తున్నా. నిత్యం రూ.2–3 వేల వరకు గిరాకీ అయ్యేది. ఇప్పుడు దాన్ని తీసేయమంటున్నారు. హోటల్‌నే నమ్ముకున్న మేము ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఇంటిల్లిపాది దానిపైనే ఆధారపడ్డాం. కనీసం ఇంకోచోట బతికే పరిస్థితి లేకపోవడంతో ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. – ఆంజనేయులు, చెన్నాయిపల్లి
ఒక్క గదే మిగిలింది..
నాకు మూడు షెట్టర్లు, రెండు గదులు ఉండగా.. ఒక్క దాంట్లో మొబైల్ షాపు పెట్టుకొని మిగతావి అద్దెకు ఇచ్చాం. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. అధికారులు వచ్చి రెండు రోజుల్లో మార్కింగ్ చేసిన వరకు తీసేయాలని.. లేదంటే జేసీబీతో కూల్చేస్తామన్నారు. అలా చేస్తే మొత్తం పోతుందని సొంతంగా కూల్చేయడం వల్ల ఒక్క గది మిగిలింది. – ఇజాజ్ హుస్సేన్, మహమ్మదాబాద్
పనులు జరుగుతున్నాయి..
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 50 ఫీట్ల లోపు ఉన్నవాటికి ఎలాంటి పరిహారం ఇవ్వం. ఇక భూమి పోతున్న నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికే అధికారులు వివరాలు సేకరించి బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకున్నారు. ఎవరికి ఎంతెంత రావాలో నిర్ణయించారు. నిర్వాసితులకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చాకే పనులు చేపడతాం. ప్రభుత్వ భూములు ఉన్నచోట పనులు జరుగుతున్నాయి. – రమేష్, డీఈ, నేషనల్ హైవే
సల్కర్‌పేట్‌కు చెందిన గిరమోని రవికుమార్‌కు 37 గుంటల తరిపొలం ఉండగా జాతీయ రహదారి నిర్మాణంతో మొత్తం పోతుంది. అయితే భాగాలు పంచుకోవడం మూలంగా ఇతని ఆధీనంలో ఉన్న సర్వే నంబర్ వేరే వారి పేరిట ఉండడంతో పరిహారం అందడం కష్టంగా ఉంది. అటు భూమి పోవడమే కాక.. ఇటు పరిహారం అందే పరిస్థితి లేకపోవడంతో అయోమయంలో పడ్డాడు. దాదాపు 25 ఏళ్లుగా అదే భూమిని నమ్ముకున్నాడు. రోడ్డు విస్తరణ కారణంగా సర్వం కోల్పోతున్నాడు.
జానంపల్లికి చెందిన చెన్నారం వెంకటయ్య ఆర్‌సీసీ ఇల్లు నిర్మించుకొని అందులోనే హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. 15 రోజుల క్రితం అధికారులు వచ్చి మార్కింగ్ ఇచ్చి కూల్చివేస్తామని చెప్పారు. ఆ తర్వాత జేసీబీతో మార్కింగ్ ఇచ్చిన వరకు ఇల్లు కూల్చివేయడంతో ప్రస్తుతం ఒక్క గోడ మాత్రమే మిగిలింది. ప్రస్తుతం అతనికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో బంధువుల ఇంట్లో తల దాచుకుంటున్నాడు. ఉపాధి కూ డా పోవడంతో బతుకు భారంగా మారింది.
ఉపాధికి ఎసరు..
చాలా గ్రామాల్లో రోడ్డుకిరువైపులా పలు రకాల దుకాణాలు నిర్వహిస్తున్నారు. కిరాణం, మెకానిక్, జిరాక్స్, ఫర్టిలైజర్, మెడికల్ షాపు, హాస్పిటల్, హోటళ్లతో జీవనం సాగిస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణ పేరిట ఇవన్నీ తొలగిస్తుండడంతో వారంతా ఉపాధి కోల్పోతున్నారు. మహమ్మదాబాద్‌లో రోడ్డుకిరువైపులా కనుచూపు మేర కనీసం ఒక్క టీ షాపు కూడా లేదు. రోజూవేలు సంపాదించే వారు కనీసం రూ.100 కూడా వచ్చే పరిస్థితి లేక.. కుటుంబాలు ఎలా పోషించాలో అని దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment