మాట్లాడుతున్న కేంద్ర మంత్రి భగవత్‌కూబ
నారాయణ్‌పేట్: రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని, బంగారు తెలంగాణ కాలేదు కానీ.. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారుమయం అయిందని కేంద్ర సహాయ మంత్రి భగవత్‌కూబ అన్నారు. గురువారం జడ్చర్లలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల డబ్బులు దారిమళ్లిస్తూ.. మైనార్టీ ఓట్ల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరికి కూడా దళితబంధు చేరలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల రాజనీతి ఒకటేనని.. రాష్ట్ర అభివృద్ధి వారికి ఏమాత్రం పట్టదన్నారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని, ఇప్పుడు మరోసారి ఉచితాల పేరుతో ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ వంటి హామీలు గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. అధికారమే లక్ష్యంగా ఐదు గ్యారంటీ పథకాల పేరుతో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందని, ఐదు నెలలు గడుస్తున్నా.. ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ మంత్రుల్లో అత్యంత అవినీతిపరుడు ఎవరైనా ఉన్నారా అంటే పాలమూరు మంత్రి పేరు వినిపిస్తుందన్నారు.
వారి సమాధులపై బీఆర్‌ఎస్ పాలన
ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి సమాధులపై కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు పరిపాలన చేస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. మూడున్నరకోట్ల ప్రజల కోసం రూ.7లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని, దీంతో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.
తమ పార్టీ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించినప్పటికీ కమలం పువ్వు వలే వికసిస్తారన్నారు. 60 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలతో హంగ్ వస్తుందని సామాజిక మాద్యమాల్లో ప్రచారాలను విశ్వసించరాదన్నారు.
ఆయా కార్యక్రమంలో కార్యక్రమాల్లో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, పద్మజారెడ్డి, ఎగ్గని నర్సింహులు, పవన్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్‌యాదవ్, కృష్ణయ్య, సీతారాం జవహర్, కుమ్మరి రాజు, సామల నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment