అర్వపల్లిలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి
నల్లగొండ: రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలోకి దిగుతున్నాయి. పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తెల్లవారి నుంచే బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు. ఆదివారం బీఫారం తీసుకుని సోమవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా భువనగిరిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రచారానికి తెర తీశారు.
మరోవైపు టికెట్ల జాబితాలో చోటు దక్కిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో అడుగు పెట్టారు. మునుగోడులో బీజేపీ నంచి పోటీ చేయబోమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోయే అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగారు.
వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం ఇలా..
► భువనగిరి సీఎం కేసీఆర్ సభతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రచారం ప్రారంభమైంది. ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత సోమవారం బీఫారం అందుకుని ఆ తర్వాత సీఎం బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల అయిలయ్య యాదగిరిగుట్టలో పూజలు చేసిన అనంతరం ఆయన సొంత గ్రామమైన సైదాపురం వీరభద్రస్వామి గుడిలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు.
► మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అవంతీపురంలోని శ్రీవెంకటేశ్వరస్వామి, సరస్వతీ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేములపల్లి మండలం ఆమనగల్‌లోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు.
► నాగార్జునసాగర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ ఇప్పటికే ప్రజల్లో తిరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి పార్టీ చేరికల కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
► మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే ప్రజల్లో ఉండి ప్రచారం చేస్తుండగా, బీజేపీ నుంచి పోటీ చేయబోయే కోమటిరెడి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌నుంచి టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి చౌటుప్పల్‌లో తమ పార్టీ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
► నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం నకిరేకల్‌లోని కనకదుర్గా దేవాలయంలో పూజలు చేసి రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం మంగళవారం కనకదుర్గ దేవాలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించనున్నారు.
► కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బీఫారం తీసుకున్నాక ర్యాలీ వెళ్లి బొడ్రాయికి పూజలు చేశారు.
► హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇదివరకే చింతలపాలెం మండలం బుగ్గమాదారంలోని పంచపట్టాభిరామస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారం రథనాన్ని ప్రారంభించి ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇదివరకే బుగ్గమాదారంలోని పంచపట్టాభిరామస్వామి ఆలయంలో పూజలు చేసి, కృష్ణానదికి హారతి ఇచ్చి ప్రచారం ప్రారంభించారు.
నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మార్నింగ్ వాక్‌తో ఇదివరకే తన ప్రచారాన్ని ప్రారంభించగా. సోమవారం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో తన ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రచారంలోకి దిగారు. ఇప్పటికే ప్రజలతో మమేకం అవుతున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోమవారం పానగల్‌లోని వెంకటేశ్వర దేవాలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉండబోతున్న పిల్లి రామరాజు యాదవ్ కూడా అక్కడే పూజలు చేసి ప్రారంభించారు.
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సోమవారం అర్వపల్లిలోని యోగానాంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పూజలు చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అక్కడే పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. పూజల అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి కిశోర్‌కు బీఫారం అందజేశారు. అక్కడి చౌరస్తాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment