నల్లగొండలో విలేకరుల సమావేశంలో తన రాజీనామా లేఖను చూపూతున్న చెరకు సుధాకర్
నల్లగొండ: నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ చెరుకు సుధాకర్ శనివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా వేసుకోనున్నారు. వృత్తి పరంగా వైద్యుడైన చెరుకు సుధాకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలకంగా పనిచేశారు.
పీడి యాక్టు కింద కేసు పెట్టి జైలుకు పంపినా ఉద్యమాన్ని వదల లేదు. కేసీఆర్ 2001 తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించగా.. చెరుకు సుధాకర్ 2003లో చేరారు. అయితే, రాజకీయ పరిణామాలతో ఆయన 2014లో టీఆర్‌ఎస్‌ను వీడారు. కొంతకాలం తెలంగాణ ఉద్యమ వేదికలో పనిచేశారు. ఆ తరువాత 2017లో సొంతంగా శ్రీతెలంగాణ ఇంటి పార్టీశ్రీని స్థాపించారు.
ఆ పార్టీ నుంచి సుధాకర్ ఎమ్మెల్సీగా కూడా పోటీచేశారు. కొంతకాలం ఆ పార్టీ నుంచి కార్యక్రమాలు కొనసాగించిన చెరుకు సుధాకర్.. 2022 ఆగస్టు 5న తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, కాంగ్రెస్ పార్టీ బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించడం లేదని, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను విస్మరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
నల్లగొండలో తెలంగాణ ఉద్యకారుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అందరితో మాట్లాడారు. ఆ తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాకు కారణాలను వెల్లడించారు. చెరుకు సుధాకర్ శనివారం బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తొమ్మిదేళ్ళ తరువాత ఆయన తన సొంతగూటికి చేరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment