నల్గొండ: హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని కొన్ని భాగాలు కలిసి ఉండేవి. 1952 శాసనసభ ఎన్నికల్లో కొన్ని ఏక సభ్య నియోజకవర్గాలు, కొన్ని ద్వి సభ్య నియోజకవర్గాలు ఉండేవి. ఏక సభ్య నియోజకవర్గాల్లో ఒకస్థానంలో ఒక పార్టీ నుంచి ఒక్కరే పోటీ చేసే వీలుండేది. ద్విసభ్య నియోజకవర్గాల్లో ఒక స్థానంలో ఒక పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేసేవారు. (అప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ స్థానాలు లేవు) దీనిలో ఒకరు జనరల్ సభ్యుడిగా.. రెండవ వారు రిజర్వు కేటగిరీకి చెందిన సభ్యుడు (ఎస్సీ లేదా ఎస్టీ) ఉండే వారు.
ద్విసభ్య నియోజకవర్గం నుంచి ఇద్దరు గెలిచే వారు. వీరికి సమాన అధికారాలు ఉండేవి. కాకపోతే.. రిజర్వు సభ్యుడు తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, హక్కుల గురించి చట్టసభల్లో ప్రస్తావించేవారు. ఈ ఎన్నికల సమయానికి హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 142 శాసన సభ నియోజకవర్గాలు ఉండేవి. వీటిలో 33 ద్విసభ్య నియోజకవర్గాలు ఉండడంతో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 175 ఉండేది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, హుజూర్‌నగర్, సూర్యాపేట నియోజకవర్గాలు ద్విసభ్య నియోజకవర్గాలుగా ఉండేవి. అయితే, ద్విసభ్య నియోజకవర్గాలకు ఎన్నిక ప్రక్రియ క్లిష్టంగా ఉండడంతో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1961 సంవత్సరంలో ద్విసభ్య నియోజకవర్గ విధానాన్ని రద్దు చేసి ఎస్టీ, ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది.
మాల్ చెక్‌పోస్టు పరిశీలన
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చింతపల్లి మండలంలోని మాల్ వెంకటేశ్వరనగర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును మంగళవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో చెక్‌పోస్టు తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న వాహనాల తనిఖీలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అక్రమంగా మద్యం తరలించకుండా పకడ్బందీగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు. సరైన ఆధారాలు చూపని నగదును సీజ్ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు, తహసీల్దార్ శంషొద్దీన్, ఎంపీడీఓ రాజు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment