నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు
నల్లగొండ: ప్రధాన రాజకీయ పార్టీల్లో అసంతృప్త నేతలు బయటకు వస్తున్నారు. టికెట్ ఆశించిన వారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అంసతృప్తితో ఉన్న వారు ఆయా పార్టీలను వీడుతున్నారు. కొందరు ఇతర పార్టీల్లో చేరి పోటీలో దిగేందుకు సిద్ధం కాగా, మరికొందరు ఉన్న పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల ప్రచారం మొదలు కావడంతో వలసలు జోరందుకున్నాయి.
నల్లగొండ, కోదాడలలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వలసలు మొదలు కాగా, సూర్యాపేట, నల్లగొండలో అసమ్మతి నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. మిర్యాలగూడ, మునుగోడులో పొత్తుల రచ్చ సాగుతూనే ఉంది. మిర్యాలగూడలో ‘సేవ్ కాంగ్రెస్’ పేరుతో ఆందోళనకు దిగగా, మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేద్దామంటూ సీపీఐ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది.
నల్లగొండ బీఆర్‌ఎస్‌కు షాక్
నల్లగొండ నియోజకవర్గంలో రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ ఎంపీపీ మనిమద్దె సుమన్‌ను అధికార పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వగా.. కాంగ్రెస్ పార్టీ మంగళవారం హైదరాబాద్‌లో ఎంపీ కోమటిరెడి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌తోపాటు మరో ఐదుగురు కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్, సందీప్, భాస్కర్, ఖయ్యూమ్ బేగ్, అసిమా సుల్తానా భర్త బషీర్, తిప్పర్తి మండలం జంగారెడ్డి గూడెం ఎంపిటిసి ముత్తినేని అనుషా భర్త నాగేశ్వర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగురవేసిన గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన బీఆర్‌ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ి పిల్లి రామరాజు ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.
నాగార్జునసాగర్‌లోనూ వలసలు
నాగార్జునసాగర్ బీఆర్‌ఎస్‌లోనూ అసమ్మతి కొనసాగుతోంది. ఎమ్మెల్యే నోముల భగత్‌పై అసంతృప్తితో హాలియా మున్సిపాలిటీకి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేత, ఎడమకాలువ మాజీ వైస్ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి సోమవారం మాజీ మంత్రి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తిరుమలగిరి సాగర్ గ్రామ సర్పంచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, నిడమనూరు మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అంకతి వెంకటరమణతోపాటు పలు గ్రామాల కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.
పెద్దవూర మండలంలో టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు కొట్టి రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం గుర్రంపొడు మండలంలోని జెడ్పీటీసీ సభ్యురాలు గాలి సరిత భర్త గాలి రవికుమార్‌తో పాటు పది గ్రామాల సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్రధాన అనుచరుడు మన్నెం రంజిత్ యాదవ్ బీజేపీలో చేరారు.
నకిరేకల్‌లోనూ మొదలైన అసంతృప్తి
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరికతో అసంతృప్తికి గురైన కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్యాల మున్సిపల్ కౌన్సిలర్లు ఇద్దరు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా, మండలంలోని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మూడు గ్రామాలకు చెందిన సర్పంచులు, ఒక ఎంపీటీసీ, ఇద్దరు సింగిల్ విండో డైరెక్టర్లు తోపాటు పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు వేముల వీరేశం ఆధ్వర్యంలో ఇటీవల కాంగ్రె్‌స్ పార్టీలో చేరారు.
నివురుగప్పిన నిప్పులా..
మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి భర్త నారబోయిన రవిముదిరాజ్ ఇటీవల నల్లగొండ, చండూరు ప్రాంతాల్లో తమ సామాజిక వర్గం ఓటర్లతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ ముదిరాజ్‌లకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా ఇక్కడ తమకు టికెట్ ఇవ్వాలని సీపీఐ పట్టుపడుతోంది. అందుకు కాంగ్రెస్ ససేమిరా ఆంటోంది. అక్కడి నుంచి సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ఈ స్థానాన్ని తమకు కేటాయించకపోతే ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తామని సీపీఐ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.
మిర్యాలగూడలో పొత్తు రేపిన చిచ్చు..
మిర్యాలగూడ టికెట్‌ను పొత్తులో భాగంగా సీపీఎంకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీంతో అక్కడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళలో పడ్డాయి. ముఖ్యంగా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి సేవ్ కాంగ్రెస్ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దామరచర్ల మండలం రాళ్లవాగుతండా నుంచి మంగళవారం పాదయాత్ర నిర్వహించారు.
అసమ్మతి సద్దు మణిగిందా?
దేవరకొండలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే స్థానిక నేతలు వ్యతిరేకించారు. బీఆర్‌ఎస్ అధిష్టానం వరకు వెళ్లారు. ప్రస్తుతం అంతా మిన్నకుండిపోయారు. ఇక కాంగ్రెస్‌లో బాలునాయక్, వడ్త్యా రమేష్‌నాయర్, కిషన్ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ ఎవరికి ఇస్తారనేది ఇంకా తేలకపోవడంతో.. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.
సూర్యాపేట బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో వర్గ పోరు
సూర్యాపేట నియోజకవర్గంలో బీఅర్‌ఎస్‌లో అసమ్మతి తప్పలేదు. కొంత కాలంగా మంత్రి జగదీశ్‌రెడ్డికి వ్యతరేకంగా వ్యవహరిస్తున్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జానయ్య యాదవ్ బీఎస్పీలో చేరారు. సోమవారం సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన భార్య, కౌన్సెలర్ రేణుక, మరో కౌన్సిలర్ నీలబాయి కూడా బీఎస్పీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది.
కాంగ్రెస్ గూటికి అసంతృప్త నేతలు
కోదాడ నియోజకవర్గంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్‌ఎస్ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ కన్మంత్‌రెడ్డి శశిధర్‌రెడ్డి ఇంటికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీపీలు ఆశా శ్రీకాంత్ రెడ్డి, చుండూరు వెంకటేశ్వరరావు, బండ్ల ప్రశాంతి కోటయ్య, జెడ్పీటీసీ సభ్యులు పుల్లారావు, ఉమా శ్రీనివాస్, బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు, నలుగురు కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు.
మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు ఇంటికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లారు. ఆయన నివాసంలో సమావేశమయ్యారు. చందర్‌రావును కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఉన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌పై వ్యతిరేకతతోనే వారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో వలసలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ గెల్లి అర్చనరవి, కౌన్సిలర్లు భవాని, సతీష్, గాయత్రి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment