prachara yatra
-
ప్రచారం.. ఉధృతం
యాదాద్రి: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం జోరు పెంచాయి. భువనగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి దిగారు. ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కావడంతో వారు కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు. ఇక భువనగిరి, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనప్పటికీ కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, చల్లమల కృష్ణారెడ్డి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ సంస్థాగతంగా సమావేశాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్లో జోష్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 16వ తేదీన భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సభ విజయవంతం కావడంతో కేడర్‌లో జోష్ నెలకొంది. ఉత్సాహంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరులో గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, తుంగుతుర్తిలో గాదరి కిశోర్‌కుమార్, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లను నేరుగా కలుస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలకలు.. బుజ్జగింపులు అధికార బీఆర్ఎస్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచా రాన్ని ముమ్మరం చేసింది. అయితే కొంతమంది నాయకులు, ద్వితీయ శ్రేణి కేడర్ వివిధ కారణాలతో అలకబూని ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. వారిని బుజ్జగించేందుకు అభ్యర్థులు రంగంలోకి దిగారు. వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి చర్చలు జరిపి ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంనుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నా తమకు ఒరిగిందేమీ లేదని నేరుగానే ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని, తమను నిర్లక్ష్యం చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ క్షేత్రస్థాయి సమావేశాలు బీజేపీ నేడో, రేపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల్లో విజయం కోసం ఆ పార్టీ ఇప్పటికే విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించిది. మరోమారు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను సమాయత్తం చేస్తోంది. రెండు రోజుల క్రితం భువనగిరి, ఆలేరు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించింది. పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన తీరుపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ సమావేశాల్లో పాల్గొన్నారు. భువనగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి టికెట్‌పై ఆశలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మరో నాయకుడు పాశం భాస్కర్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఆలేరులో పడాల శ్రీనివాస్, సూదగాని హరిశంకర్‌గౌడ్, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతే ప్రచారం చేయనున్నారు. ఆలేరు, నకిరేకల్‌లో కాంగ్రెస్ జోరు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆలేరు నుంచి బీర్ల అయిలయ్య, నకిరేకల్ నుంచి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో వారు ప్రచారంలో స్పీడ్ పెంచారు. బీర్ల అయిలయ్య ప్రచారం కొనసాగిస్తూనే చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టికెట్ ఖరారు కావడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు. సోమవరం రామన్నపేటలో కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇక భువనగిరి, మునుగోడు టికెట్లను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ తమకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో భువనగిరి నుంచి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మనుగోడులో చల్లమల కృష్ణారెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్యారంటీ స్కీంలను గడపగడపకు తీసుకెళ్తున్నారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాలను సైతం ఎండగడుతున్నారు. -
మొదలైన ఎన్నికల ప్రచార పర్వం
నల్లగొండ: రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలోకి దిగుతున్నాయి. పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తెల్లవారి నుంచే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు. ఆదివారం బీఫారం తీసుకుని సోమవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా భువనగిరిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రచారానికి తెర తీశారు. మరోవైపు టికెట్ల జాబితాలో చోటు దక్కిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో అడుగు పెట్టారు. మునుగోడులో బీజేపీ నంచి పోటీ చేయబోమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోయే అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం ఇలా.. ► భువనగిరి సీఎం కేసీఆర్ సభతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రచారం ప్రారంభమైంది. ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత సోమవారం బీఫారం అందుకుని ఆ తర్వాత సీఎం బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల అయిలయ్య యాదగిరిగుట్టలో పూజలు చేసిన అనంతరం ఆయన సొంత గ్రామమైన సైదాపురం వీరభద్రస్వామి గుడిలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ► మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అవంతీపురంలోని శ్రీవెంకటేశ్వరస్వామి, సరస్వతీ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేములపల్లి మండలం ఆమనగల్‌లోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ► నాగార్జునసాగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ ఇప్పటికే ప్రజల్లో తిరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి పార్టీ చేరికల కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ► మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే ప్రజల్లో ఉండి ప్రచారం చేస్తుండగా, బీజేపీ నుంచి పోటీ చేయబోయే కోమటిరెడి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌నుంచి టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి చౌటుప్పల్‌లో తమ పార్టీ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ► నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం నకిరేకల్‌లోని కనకదుర్గా దేవాలయంలో పూజలు చేసి రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం మంగళవారం కనకదుర్గ దేవాలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించనున్నారు. ► కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బీఫారం తీసుకున్నాక ర్యాలీ వెళ్లి బొడ్రాయికి పూజలు చేశారు. ► హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇదివరకే చింతలపాలెం మండలం బుగ్గమాదారంలోని పంచపట్టాభిరామస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారం రథనాన్ని ప్రారంభించి ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇదివరకే బుగ్గమాదారంలోని పంచపట్టాభిరామస్వామి ఆలయంలో పూజలు చేసి, కృష్ణానదికి హారతి ఇచ్చి ప్రచారం ప్రారంభించారు. నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మార్నింగ్ వాక్‌తో ఇదివరకే తన ప్రచారాన్ని ప్రారంభించగా. సోమవారం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో తన ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రచారంలోకి దిగారు. ఇప్పటికే ప్రజలతో మమేకం అవుతున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోమవారం పానగల్‌లోని వెంకటేశ్వర దేవాలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉండబోతున్న పిల్లి రామరాజు యాదవ్ కూడా అక్కడే పూజలు చేసి ప్రారంభించారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సోమవారం అర్వపల్లిలోని యోగానాంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పూజలు చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అక్కడే పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. పూజల అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి కిశోర్‌కు బీఫారం అందజేశారు. అక్కడి చౌరస్తాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. -
నిజానిజాలు వివరిస్తూ.. జాప్యాన్ని నిరసిస్తూ...
శిరోముండనంపై సాగుతున్న ప్రచార యాత్ర తక్షణం నిందితులను శిక్షించాలని డిమాండ్ అమలాపురం టౌన్ : శిరోముండనం కేసులో బాధితులకు జరగుతున్న అన్యాయం.. విచారణలో జరగుతున్న జాప్యం.. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం.. బాధితులు 20 ఏళ్లుగా చేస్తున్న పోరాటం వంటి పరిణామాలు ప్రజలకు వివరించేందుకు... ఈ ఘటనపై నిరసన తెలిపేందుకు కోనసీమలో ప్రచార యాత్ర శనివారం మొదలైంది. శని, ఆదివారాల్లో సాగే ఈ యాత్రకు అయినివిల్లి గ్రామం నుంచి మానవ హక్కుల వేదిక జిల్లా శాఖ, వెంకటాయపాలెం దళిత ఐక్య పోరాట వేదికలు శిరోముండనం బాధితులతో కలిసి సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. అయినవిల్లి నుంచి బయలుదేరిన యాత్ర ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని పలు గ్రామాల్లో దాదాపు వంద కిలోమీటర్ల మేర తొలిరోజు సాగింది. గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ... గ్రామం నుంచి మరో గ్రామం వెళుతున్నప్పుడు ఆటోలు, మోటారు సైకిళ్లపై యాత్రగా సాగారు. 1996 డిసెంబర్ 29న రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులకు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి, జిల్లా అధ్యక్షుడు నామాడి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్, కార్యదర్శులు ముత్యాల శ్రీనివాస్, బీబీ జోగేష్, శిరోముండనం బాధితుడు చల్లపూడి పట్టాభిరామయ్య, ఘటన ప్రత్యక్ష సాక్షి రేవు అప్పారావు, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ భీమశంకరం యాత్రలో పాల్గొని శిరోముండనం కేసులో ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను, నిందితుల రాజకీయ పైరవీలు, ప్రలోభాలు, బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. విచారణలో జరగుతున్న జాప్యాన్ని నిరసించారు. ప్ల కార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ మాట్లాడుతూ శిరోముండనం కేసులో నిందితులను రక్షించే దురుద్దేశంతో ప్రభుత్వం సహకరించడం అప్రజాస్వావిుకమన్నారు. ఈ నిజానిజాలను ప్రజలకు వివరించి ప్రజా మద్దతును కూడగట్టే లక్ష్యంతో బాధితులతో కలిసి ఈ ప్రచార యాత్రను చేపట్టామని చెప్పారు. వేదిక జిల్లా అధ్యక్షుడు నామాడి శ్రీధర్ మాట్లాడుతూ ఈ నాటికీ బాధితులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, నిందితుల బెదిరింపులను ఖాతరు చేయకుండా న్యాయ పోరాటం చేస్తున్నారన్నారు. 20 ఏళ్లుగా బాధితులకు ఏ ప్రభుత్వ పథకంలోనూ లబ్ధిదారులుగా ఎంపిక చేయకపోవడం నిందితులు ఈ నాటికీ కొనసాగిస్తున్న వివక్షకు దర్పణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను తక్షణమే పూర్తి చేయాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని దళిత ఐక్యవేదిక కన్వీనర్ భీమశంకరం డిమాండు చేశారు. రెండో రోజు యాత్ర అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని గ్రామాల్లో మరో 150 కిలో మీటర్ల మేర సాగనుంది. ఆయా గ్రామాల్లో దళితులు యాత్రకు స్వాగతం పలికి మద్దుతు తెలుపుతున్నారు. నిందితులు రాజకీయ పదవులు, అండదండలతో ఆర్థికంగా బలపడితే...బాధితులు వివక్షతో దుర్భర జీవనాన్ని ఎదుర్కొంటున్నారని యాత్ర నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. దళిత స్త్రీ శక్తి రాష్ట్ర కో ఆర్డినేటర్ కొంకి రాజామణి, ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పెనుమాల సుధీర్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి కొండా దుర్గారావు, దళిత నాయకులు యాత్రలో పాల్గొన్నారు.