- శిరోముండనంపై సాగుతున్న ప్రచార యాత్ర
- తక్షణం నిందితులను శిక్షించాలని డిమాండ్
నిజానిజాలు వివరిస్తూ.. జాప్యాన్ని నిరసిస్తూ...
Published Sat, Mar 18 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
అమలాపురం టౌన్ :
శిరోముండనం కేసులో బాధితులకు జరగుతున్న అన్యాయం.. విచారణలో జరగుతున్న జాప్యం.. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం.. బాధితులు 20 ఏళ్లుగా చేస్తున్న పోరాటం వంటి పరిణామాలు ప్రజలకు వివరించేందుకు... ఈ ఘటనపై నిరసన తెలిపేందుకు కోనసీమలో ప్రచార యాత్ర శనివారం మొదలైంది. శని, ఆదివారాల్లో సాగే ఈ యాత్రకు అయినివిల్లి గ్రామం నుంచి మానవ హక్కుల వేదిక జిల్లా శాఖ, వెంకటాయపాలెం దళిత ఐక్య పోరాట వేదికలు శిరోముండనం బాధితులతో కలిసి సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. అయినవిల్లి నుంచి బయలుదేరిన యాత్ర ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని పలు గ్రామాల్లో దాదాపు వంద కిలోమీటర్ల మేర తొలిరోజు సాగింది. గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ... గ్రామం నుంచి మరో గ్రామం వెళుతున్నప్పుడు ఆటోలు, మోటారు సైకిళ్లపై యాత్రగా సాగారు. 1996 డిసెంబర్ 29న రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులకు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి, జిల్లా అధ్యక్షుడు నామాడి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్, కార్యదర్శులు ముత్యాల శ్రీనివాస్, బీబీ జోగేష్, శిరోముండనం బాధితుడు చల్లపూడి పట్టాభిరామయ్య, ఘటన ప్రత్యక్ష సాక్షి రేవు అప్పారావు, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ భీమశంకరం యాత్రలో పాల్గొని శిరోముండనం కేసులో ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను, నిందితుల రాజకీయ పైరవీలు, ప్రలోభాలు, బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. విచారణలో జరగుతున్న జాప్యాన్ని నిరసించారు. ప్ల కార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ మాట్లాడుతూ శిరోముండనం కేసులో నిందితులను రక్షించే దురుద్దేశంతో ప్రభుత్వం సహకరించడం అప్రజాస్వావిుకమన్నారు. ఈ నిజానిజాలను ప్రజలకు వివరించి ప్రజా మద్దతును కూడగట్టే లక్ష్యంతో బాధితులతో కలిసి ఈ ప్రచార యాత్రను చేపట్టామని చెప్పారు. వేదిక జిల్లా అధ్యక్షుడు నామాడి శ్రీధర్ మాట్లాడుతూ ఈ నాటికీ బాధితులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, నిందితుల బెదిరింపులను ఖాతరు చేయకుండా న్యాయ పోరాటం చేస్తున్నారన్నారు. 20 ఏళ్లుగా బాధితులకు ఏ ప్రభుత్వ పథకంలోనూ లబ్ధిదారులుగా ఎంపిక చేయకపోవడం నిందితులు ఈ నాటికీ కొనసాగిస్తున్న వివక్షకు దర్పణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను తక్షణమే పూర్తి చేయాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని దళిత ఐక్యవేదిక కన్వీనర్ భీమశంకరం డిమాండు చేశారు. రెండో రోజు యాత్ర అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని గ్రామాల్లో మరో 150 కిలో మీటర్ల మేర సాగనుంది. ఆయా గ్రామాల్లో దళితులు యాత్రకు స్వాగతం పలికి మద్దుతు తెలుపుతున్నారు. నిందితులు రాజకీయ పదవులు, అండదండలతో ఆర్థికంగా బలపడితే...బాధితులు వివక్షతో దుర్భర జీవనాన్ని ఎదుర్కొంటున్నారని యాత్ర నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. దళిత స్త్రీ శక్తి రాష్ట్ర కో ఆర్డినేటర్ కొంకి రాజామణి, ఆర్‌పీఐ రాష్ట్ర కార్యదర్శి పెనుమాల సుధీర్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి కొండా దుర్గారావు, దళిత నాయకులు యాత్రలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement