పెందుర్తి: యువకుడి శిరోముండనం ఘటనపై దళితులు భగ్గుమన్నారు. న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. తక్షణం స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిందితుల్ని కొద్ది గంటల్లో అరెస్ట్ చేసింది. భర్త అనుమతి తీసుకోకుండా నూతన్ భార్య మధుప్రియ ఈ దాష్టీకానికి ఒడిగడుతుందా..? అని దళిత సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. లెక్కలేనంత డబ్బుందని.. సమాజం అంటే ఆయనకు లెక్కలేదని గతంలో ఆయన వ్యవహార శైలిని ఈ ఘటనతో గుర్తు చేసుకున్నారు స్థానికులు. సెలబ్రిటీ హోదాను ఇచ్చిన ప్రజల్ని మరిచి విచక్షణా రహితంగా ప్రవర్తించడం ఆయనకు కొత్తేమీ కాదని చెబుతున్నారు గోపాల్‌కృష్ణనగర్ వాసులు. (చదవండి: కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు)
‘తమ ప్రాంతానికి నూతన్‌నాయుడు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాం.. అతడిది అంతా హైఫ్రొఫైల్. ఎవరినీ లెక్క చేయడు. ఇతరులంటే చాలా చులకన. కనీసం మానవత్వం ఉండదు.’ తన ఇంటి గార్డెన్ కోసం ఇంటి ముందు ఉన్న 40 అడుగుల రోడ్డులో చాలా భాగం ఆక్రమించేశాడు. ఈ విషయంపై అడుగుదాం అని ఇంటికి వెళితే కనీసం లోపలకు కూడా వెళ్లనివ్వలేదు. సమాజంపై పూర్తిగా నిర్లక్ష్యం భావంతో ఉంటాడు’ ఇవీ సుజాతనగర్‌లోని గోపాలకృష్ణనగర్ వాసులు ఆరోపణలు.
తన ఇంట్లో పని మానేశాడన్న నెపంతో ఏకంగా దళిత యువకుడు శ్రీకాంత్‌పై తన మనుషులు దాడి చేసి శిరోముండనం చేయించిన ఘటనతో నూతన్‌నాయుడు వ్యవహారశైలి స్థానికంగా చర్చకు వచ్చింది. సినీ నిర్మాతగా.. దర్శకుడిగా చెలామణి అవుతున్న నూతన్ నాయుడు నగరంలోని మాజీ మేయర్, టీడీపీ నేతకు వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు. 2014 వరకు సమాజానికి పెద్దగా పరిచయం లేని నూతన్‌నాయుడు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా వెలుగులోకి వచ్చాడు. నాటి ఎన్నికల సమయంలో నూతన్‌నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పుడు నూతన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో కొన్ని తప్పుడు పత్రాలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అతడి ప్రభావం అంతగా లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అతడ్ని ‘లైట్’ తీసుకున్నారు. తరువాత కొన్నాళ్ల అజ్ఞాతంలో ఉన్న నూతన్ బిగ్‌బాస్–2తో మళ్లీ బాహ్యప్రపంచంలోకి వచ్చాడు. ఆ తరువాత చిన్నాచితకా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ప్రముఖ సినీదర్శక నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ తీసిన పవర్‌స్టార్ సినిమాకు కౌంటర్‌గా పరాన్నజీవి సినిమాతో దర్శక అవతారం ఎత్తాడు. (చదవండి: శిరోముండనం కేసు: ఏడుగురు అరెస్ట్)
రోడ్డును ఆక్రమించి తీర్చిదిద్దిన గార్డెన్..
నాడు అధికారంతో.. నేడు డబ్బుమదంతో
మూడేళ్ల క్రితం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఓ దళిత మహిళను టీడీపీ నాయకులు ఘోరాతిఘోరంగా అవమానించారు. ఆ ఘటనతో టీడీపీ పతనం ప్రారంభమైంది. మళ్లీ ఇప్పుడు నూతన్‌నాయుడు ఇంట్లో జరిగిన తాజా ఘటన మరింత సంచలనం రేపింది. తన ఇంట్లో పని మానేశాడన్న నెపంతో సెల్‌ఫోన్ దొంగతనం అంటగట్టిన నూతన్‌నాయడు భార్య మధుప్రియ, బ్యుటీషియన్ ఇందిర సహా ఏడుగురు వ్యక్తులు శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు.
డబ్బుందన్న అహంకారంతో సభ్యసమాజం తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. నిజంగా శ్రీకాంత్ సెల్‌ఫోన్ దొంగతనం చేసుంటే అతడు పనిమానేసి దాదాపు నెల రోజులు కావస్తుంది. మరి ఇన్నాళ్ళు నూతన్ కుటుంబ సభ్యులు, పనివారు అతడిపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే హోదా ఉందన్న తలబిరుసు.. బాధితుడికి ఎవరూ లేరన్న ఆలోచనతో ఈ దాడికి పాల్పడినట్లు తేటతెల్లం అవుతుంది. ఇందులో నూతన్‌నాయుడు పాత్ర నేరుగా లేకపోయినా.. భర్త అనుమతి తీసుకోకుండా నూతన్ భార్య మధుప్రియ ఈ దాష్టీకానికి ఒడిగడుతుందా..? అని దళిత సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment