- దళిత సంఘాలు, వామపక్ష, ఇతర పార్టీల డిమాండ్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా, నిరసన ప్రదర్శన
శిరోముండనం కేసును త్వరగా తేల్చాలి
Published Thu, Dec 29 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM
కాకినాడ సిటీ :
దళితుల శిరోముండనం కేసును త్వరగా తేల్చాలని దళిత సంఘాలు, వామపక్ష, ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసుకు గురువారంతో 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కాకినాడలో నిరసన ప్రదర్శన చేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక బాలాజీచెరువు సెంటర్ నుంచి జెడ్పీసెంటర్ మీదుగా ఇంద్రపాలెం లాకులు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యే త్రిమూర్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నేరస్తులకు కొమ్ముకాస్తున్న సీఎం చంద్రబాబు వైఖరి నశించాలంటూ నినదించారు. నాయకులు మాట్లాడుతూ 1996లో వెంకటాయపాలెం దళితులను కొట్టి శిరోముండనం ఘటన నేటికీ మచ్చగా మిగిలే ఉందన్నారు. జిల్లా యంత్రాంగం సీఎం ఆదేశాలతో కేసు విచారణ జాప్యం అయ్యేందుకు సహకరిస్తోందని ఆరోపించారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జీ, యునైటెడ్ ఎస్సీ, ఎస్టీ ఫోరం నగర అధ్యక్ష, కార్యదర్శులు గుడాల కృష్ణ, టి.నూకరాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్, జిల్లా అధ్యక్షులు తాడి బాబ్జీ, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, బహుజన యునైటెడ్ ఫ్రంట్ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, డీసీఎఫ్, సీపీఐ(ఎంఎల్) లిబరేష¯ŒS, పీడీఎస్‌యూ, వెల్ఫేర్ పార్టీ, వ్యవసాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు స్థానిక బాలాజీ చెరువుసెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కేసులో పీపీని ప్రభుత్వం తొలగించడాన్ని నిరసించారు. న్యూడెమోక్రసి నాయకులు జె.వెంకటేశ్వర్లు, ఎం.దుర్గాప్రసాద్, ప్రదీప్, వి.రామన్న పాల్గొన్నారు.
ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం
వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్) : శిరోముండనం ఘటన జరిగి గురువారం నాటికి 20 ఏళ్లు పూర్తయినా బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో బాధితులు చల్లపూడి పట్టాభిరామయ్య, కోటి చినరాజులు గురువారం వెంకటాయపాలెంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. 64 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే ఆమరణ దీక్షకు కూర్చున్నామన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్, హైకోర్టు న్యాయవాది కొప్పిశెట్టి వీరభద్రరావు, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనుపెల్లి సత్తిబాబు, భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి పాటి శివప్రసాద్, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ వెంటపల్లి భీమశంకరం తదితరులు వారికి మద్దతు పలికారు.
Advertisement
Advertisement