Venkatayapalem
-
సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వెంకటాయపాలెంలో శుక్రవారం పట్టాల పంపిణీ
-
వెంకటాయపాలెంలో దాహం కేకలు
సాక్షి, వెంకటాయపాలెం(నూజివీడు): మండలంలోని వెంకటాయపాలెంలో ఓసీ ఏరియాలో మంచినీటి సమస్య నెలకొనడంతో స్థానికులు దాహం కేకలు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో మంచినీటి కష్టాలు మరింతగా పెరిగాయి. పంచాయతీ బోరుకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటర్ కాలిపోయి నెలరోజులు గడిచినప్పటికీ మరమ్మతులు చేయించలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. దీంతో స్థానికులు మంచినీళ్ల కోసం, వాడుకోవడానికి వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను ఎన్నిసార్లు పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ ప్రత్యేకాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దాదాపు 50 గృహాల వారికి నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఎస్సీ ఏరియాలో ఉన్న రక్షిత మంచినీటి ట్యాంక్ నుంచి నీళ్లు వస్తున్నప్పటికీ అరకొరగా మాత్రమే వస్తున్నాయని, ఆ నీరు తాగడానికి పనికిరావని మహిళలు పేర్కొంటున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందుముందు తాము ఎదుర్కొనే ఇబ్బందులను ఇంకేమీ పట్టించుకుంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నెలరోజుల క్రితం మోటర్లో వైరింగ్ కాలిపోవడంతో మరమ్మతుల కోసమని తీసుకెళ్లారే గాని ఇంత వరకు తిరిగి ఏర్పాటు చేయకపోవడం దారుణం. మరమ్మతులు అయ్యే వరకు నీళ్లు లేకుండా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక పాలన అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి, ఎంపీడీవో సమస్యను పరిష్కరించలేకపోతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన బోరుకు మోటర్‌ను బిగించేలా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాగడానికి నీళ్లు లేవు నెలరోజుల నుంచి తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. మోటర్ కాలిపోయి నెలరోజులు అయినా ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. వేసవి వచ్చిన నేపథ్యంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి – పూజారి సుజాత, వెంకటాయపాలెం అధికారులు పట్టించుకోవడం లేదు నెలరోజులుగా నీటి సమస్య ఉంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు గ్రామానికి వస్తున్నారో, రావడం లేదో కూడా తెలియడం లేదు. ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఉంటే గ్రామస్తులు ఎలా బతకాలో అధికారులే చెప్పాలి. – షేక్ ఆషా, వెంకటాయపాలెం -
సత్యం ‘సమాధి’
వెంకటాయపాలెం(రామచంద్రపురం రూరల్): రెండు దశాబ్దాల క్రితం నాటి కేసు.. ఎలాగైనా బయటపడేందుకు అధికార బలం ప్రయోగించారు. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి లొంగదీసుకున్నారు. బాధితుల కులాన్నే మార్చేశారు. వారు దళితులు కాదని నిరూపించేందుకు పాత సమాధికి కొత్త పేరు తగిలించారు. దాన్ని ఫొటో తీసి కోర్టుకు అందజేశారు. అలాగే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఏకంగా న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగించిన అరాచకమిది. 18 దళిత సంఘాల నిజనిర్ధారణ కమిటీ విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. నిజ నిర్ధారణ కమిటీ వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 21 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ కేసు కోర్టుల్లో నలుగుతూనే ఉంది. ఏడాదిన్నర కాలంగా విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో తుది తీర్పు ఇచ్చే సమయంలో... కేసు నుంచి బయటపడేందుకు తోట త్రిమూర్తులు కొత్త ఎత్తుగడ వేశారు. ఎస్సీలు కాదని నిరూపించేందుకు.. కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని శిరోముండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శిరోముండనం బాధితులు అసలు దళితులే కాదని, క్రైస్తవ మతం స్వీకరించారని, ‘బీసీ–సి’ వర్గానికి చెందినవారని నిరూపించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పావులు కదిపారు. ఇందులో భాగంగా మండల తహసీల్దార్, గ్రామ వీఆర్వోలను సెలవుపై పంపించారు. తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి వెంటనే ఆ పత్రాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోగా బాధితులు ఎస్సీలు కాదని, క్రైస్తవ మతం స్వీకరించారంటూ ఎమ్మెల్యే త్రిమూర్తులు గ్రామంలోని తన పాలేరు కాలుకుర్చ జీవరత్నంతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయించారు. దీనికి సాక్ష్యంగా స్మశానంలో బాధితుడు కోటి చినరాజు తల్లి నాగమ్మ సమాధి అంటూ శిలువ ఉన్న ఒక పాత సమాధి ఫొటోను జత చేశారు. బాధితులు చినరాజు, వెంకటరత్నంలు రామచంద్రపురంలోని ఏసు ప్రేమాలయం చర్చిలో క్రైస్తవ మతం స్వీకరించారని, అందుకు తానే సాక్ష్యమని పాస్టర్ పేరిట ఎన్.శామ్యూల్ రాజు అనే వ్యక్తితో చెప్పించారు. ఆ వివరాలతో బాధితులు క్రైస్తవ మతానికి చెందినవారేనని తహసీల్దార్, ఆర్డీవోలు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన 18 దళిత సంఘాల నేతలు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి తహసీల్దార్‌ను, ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులను, గ్రామస్తులను విచారించారు. ఈ విచారణలో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. బాధితులు ఎస్సీలు కాదని నిరూపించేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలపై ఫొటోలు, వీడియో సాక్ష్యాలను కమిటీ సభ్యులు సేకరించారు. బాధ్యులను సస్పెండ్ చేయాలి వెంకటాయపాలెం గ్రామ స్మశానంలో ప్రొద్దోకు లక్ష్మి క్రైస్తవ మహిళ సమాధి ఉంది. దానిపై శిలువ, ముందు వైపున ఆమె పేరుతో శిలాఫలకం ఉంది. అదే సమాధి వెనుక వైపున కోటి నాగమ్మ పేరిట మరో శిలాఫలకాన్ని అతికించి, దానిని ఫొటో తీసి, జాయింట్ కలెక్టర్ కోర్టుకు సమర్పించారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గుర్తించారు. అలాగే, శామ్యూల్‌రాజు అనే పాస్టర్ తమ చర్చిలో లేరని ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి, క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా దళితులకు అన్యాయం చేసేలా నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా బాధితులకు ఎస్సీ కుల ధ్రువపత్రాలను అందించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును పదవి నుంచి తొలగించాలని, తప్పుడు నివేదిక ఇచ్చిన తహసీల్దార్, ఆర్డీవోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
శిరోముండనం కేసును త్వరగా తేల్చాలి
దళిత సంఘాలు, వామపక్ష, ఇతర పార్టీల డిమాండ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా, నిరసన ప్రదర్శన కాకినాడ సిటీ : దళితుల శిరోముండనం కేసును త్వరగా తేల్చాలని దళిత సంఘాలు, వామపక్ష, ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసుకు గురువారంతో 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కాకినాడలో నిరసన ప్రదర్శన చేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక బాలాజీచెరువు సెంటర్ నుంచి జెడ్పీసెంటర్ మీదుగా ఇంద్రపాలెం లాకులు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యే త్రిమూర్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నేరస్తులకు కొమ్ముకాస్తున్న సీఎం చంద్రబాబు వైఖరి నశించాలంటూ నినదించారు. నాయకులు మాట్లాడుతూ 1996లో వెంకటాయపాలెం దళితులను కొట్టి శిరోముండనం ఘటన నేటికీ మచ్చగా మిగిలే ఉందన్నారు. జిల్లా యంత్రాంగం సీఎం ఆదేశాలతో కేసు విచారణ జాప్యం అయ్యేందుకు సహకరిస్తోందని ఆరోపించారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జీ, యునైటెడ్ ఎస్సీ, ఎస్టీ ఫోరం నగర అధ్యక్ష, కార్యదర్శులు గుడాల కృష్ణ, టి.నూకరాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్, జిల్లా అధ్యక్షులు తాడి బాబ్జీ, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, బహుజన యునైటెడ్ ఫ్రంట్ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, డీసీఎఫ్, సీపీఐ(ఎంఎల్) లిబరేష¯ŒS, పీడీఎస్‌యూ, వెల్ఫేర్ పార్టీ, వ్యవసాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు స్థానిక బాలాజీ చెరువుసెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కేసులో పీపీని ప్రభుత్వం తొలగించడాన్ని నిరసించారు. న్యూడెమోక్రసి నాయకులు జె.వెంకటేశ్వర్లు, ఎం.దుర్గాప్రసాద్, ప్రదీప్, వి.రామన్న పాల్గొన్నారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్) : శిరోముండనం ఘటన జరిగి గురువారం నాటికి 20 ఏళ్లు పూర్తయినా బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో బాధితులు చల్లపూడి పట్టాభిరామయ్య, కోటి చినరాజులు గురువారం వెంకటాయపాలెంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. 64 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే ఆమరణ దీక్షకు కూర్చున్నామన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్, హైకోర్టు న్యాయవాది కొప్పిశెట్టి వీరభద్రరావు, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనుపెల్లి సత్తిబాబు, భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి పాటి శివప్రసాద్, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ వెంటపల్లి భీమశంకరం తదితరులు వారికి మద్దతు పలికారు. -
శిరోముండనం బాధితుల రిలే దీక్షలు
నిందితుల కొమ్ము కాస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. శిబిరాన్ని ప్రారంభించిన రిపబ్లిక¯ŒS పార్టీ నేత మోకా వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్) : వెంకటాయపాలెం దళిత యువకుల శిరోముండనం కేసు విచారణను జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా గురువారం నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. బాధితులు, ప్రజాసంఘాల నాయకులు, దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ దీక్షలు చేపట్టారు.దీక్షా శిబిరాన్ని యానాంకు చెందిన రిపబ్లిక¯ŒS పార్టీ సీనియర్ నాయకుడు మోకా మోహనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో న్యాయం కోసం హైకోర్టులో విశేష కృషి చేసిన బొజ్జా తారకం మన మధ్య లేకపోవడం విచారకరమన్నారు. ఈ పోరాటాన్ని ముందుకు నడిపి నిందితులకు శిక్షలు పడినపుడే తారకానికి నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. దళిత ఐక్యపోరాట వేదిక నాయకులు నీలం మధుసూదనరావు, ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, మాల మహానాడు నాయకుడు తాడి బాబ్జీ. జై భీమ్ దళిత సేవా సంఘం నాయకులు గుబ్బల శ్రీను, దడాల వెంకటరమణ, చెట్లర్ కర్ణ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు సైతం తాము వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. తొలిరోజు దీక్షలో శిరోముండనం బాధితులు కోటి చినరాజు, చల్లపూడి పట్టాభి రామయ్య, గ్రామస్తులు దడాల రవికుమార్, రేవు అప్పారావు, దడాల కృష్ణమూర్తి, బొడ్డు కృష్ణమూర్తి, కాకర విష్ణుమూర్తి, గుత్తుల వెంకటరమణ, ఇసుకపట్ల శ్యామల కూర్చున్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకుడు గుబ్బల ఆదినారాయణ, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సంఘ జిల్లా కార్యదర్శి ఆర్ రాఘవులు, బీసీ సంఘం నాయకుడు వాసంశెట్టి శ్యాం, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు జనిపెల్ల సత్తిబాబు, జిల్లెళ్ల వెంకటేశ్వరరావు, ఏఐకేఎంఎస్ నాయకుడు అంబటి కృష్ణ, గెద్దాడ సూరిబాబు పాల్గొన్నారు. -
ఆ జీఓను రద్దు చేయాలి
శిరోముండనం కేసులో పీపీ తొలగింపుపై నిరసన ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా రామచంద్రపురం: వెంకటాయపాలెం శిరోముండనం కేసులో బాధితుల తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తొలగిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఆ జీవోను నిరసిస్తు సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ, ఏఐకేఎంఎస్, దళిత సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రజా సంఘాల నాయకుడు చీకట్ల వెంకటేశ్వరరావు, జె.æ సత్తిబాబు, ఆర్. రాగులు, జి. ఆదినారాయణ, వి. భీమశంకరం, వైఎస్సార్ సీసీ నాయకుడు పెట్టా శ్రీనివాసరావు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బి. సిద్ధూ తదితరులు మాట్లాడుతూ పీపీని తొలగించి ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తోట త్రిమూర్తులును భుజాన మోస్తూ దళితులకు అన్యాయం చేసిందని విమర్శించారు. ఆ జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని, లేనిపక్షంలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాయన్నారు. ఈమేరకు ఆర్డీఓ కె. సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు. తొలుత ప్రధాన రహదారిలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం కళ్లకు నల్లబ్యాడ్జిలు కట్టారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. వెంకటాయపాలెం ఎంపీటీసీ సభ్యుడు దడాల రవికుమార్, నాయకులు దడాల వెంకటరమణ, బొమ్ము మోహనరావు, మందపల్లి చిట్టిబాబు, దొమ్మలపాటి శ్యాం, వినకోటి కొండ, పలివెల ప్రభాకర్, బొమ్ము సతీష్, ఇసుకపట్ల కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టాటా ఏసీ-మినీ బస్ ఢీకొని నలుగురి మృతి
వరంగల్: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న టాటా ఏసీ, మినీ బస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని 108 వాహనంలో జనగామ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని కొందరు అంటుంటే, దట్టంగా అలముకున్న మంచు అని మరికొందరు అంటున్నారు.