తన తల్లి సమాధిగా ఫోటోలో చూపించిన సమాధిని పొద్దోకు లక్ష్మి సమాధిగా చూపిస్తున్న శిరోముండనం భాదితుడు కోటి చినరాజు
వెంకటాయపాలెం(రామచంద్రపురం రూరల్): రెండు దశాబ్దాల క్రితం నాటి కేసు.. ఎలాగైనా బయటపడేందుకు అధికార బలం ప్రయోగించారు. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి లొంగదీసుకున్నారు. బాధితుల కులాన్నే మార్చేశారు. వారు దళితులు కాదని నిరూపించేందుకు పాత సమాధికి కొత్త పేరు తగిలించారు. దాన్ని ఫొటో తీసి కోర్టుకు అందజేశారు. అలాగే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఏకంగా న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగించిన అరాచకమిది. 18 దళిత సంఘాల నిజనిర్ధారణ కమిటీ విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి.
నిజ నిర్ధారణ కమిటీ వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 21 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ కేసు కోర్టుల్లో నలుగుతూనే ఉంది. ఏడాదిన్నర కాలంగా విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో తుది తీర్పు ఇచ్చే సమయంలో... కేసు నుంచి బయటపడేందుకు తోట త్రిమూర్తులు కొత్త ఎత్తుగడ వేశారు.
ఎస్సీలు కాదని నిరూపించేందుకు..
కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని శిరోముండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శిరోముండనం బాధితులు అసలు దళితులే కాదని, క్రైస్తవ మతం స్వీకరించారని, ‘బీసీ–సి’ వర్గానికి చెందినవారని నిరూపించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పావులు కదిపారు. ఇందులో భాగంగా మండల తహసీల్దార్, గ్రామ వీఆర్‌వోలను సెలవుపై పంపించారు. తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి వెంటనే ఆ పత్రాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోగా బాధితులు ఎస్సీలు కాదని, క్రైస్తవ మతం స్వీకరించారంటూ ఎమ్మెల్యే త్రిమూర్తులు గ్రామంలోని తన పాలేరు కాలుకుర్చ జీవరత్నంతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయించారు. దీనికి సాక్ష్యంగా స్మశానంలో బాధితుడు కోటి చినరాజు తల్లి నాగమ్మ సమాధి అంటూ శిలువ ఉన్న ఒక పాత సమాధి ఫొటోను జత చేశారు.
బాధితులు చినరాజు, వెంకటరత్నంలు రామచంద్రపురంలోని ఏసు ప్రేమాలయం చర్చిలో క్రైస్తవ మతం స్వీకరించారని, అందుకు తానే సాక్ష్యమని పాస్టర్ పేరిట ఎన్.శామ్యూల్ రాజు అనే వ్యక్తితో చెప్పించారు. ఆ వివరాలతో బాధితులు క్రైస్తవ మతానికి చెందినవారేనని తహసీల్దార్, ఆర్డీవోలు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన 18 దళిత సంఘాల నేతలు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి తహసీల్దార్‌ను, ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులను, గ్రామస్తులను విచారించారు. ఈ విచారణలో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. బాధితులు ఎస్సీలు కాదని నిరూపించేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలపై ఫొటోలు, వీడియో సాక్ష్యాలను కమిటీ సభ్యులు సేకరించారు.
బాధ్యులను సస్పెండ్ చేయాలి
వెంకటాయపాలెం గ్రామ స్మశానంలో ప్రొద్దోకు లక్ష్మి క్రైస్తవ మహిళ సమాధి ఉంది. దానిపై శిలువ, ముందు వైపున ఆమె పేరుతో శిలాఫలకం ఉంది. అదే సమాధి వెనుక వైపున కోటి నాగమ్మ పేరిట మరో శిలాఫలకాన్ని అతికించి, దానిని ఫొటో తీసి, జాయింట్ కలెక్టర్ కోర్టుకు సమర్పించారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గుర్తించారు. అలాగే, శామ్యూల్‌రాజు అనే పాస్టర్ తమ చర్చిలో లేరని ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి, క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా దళితులకు అన్యాయం చేసేలా నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా బాధితులకు ఎస్సీ కుల ధ్రువపత్రాలను అందించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును పదవి నుంచి తొలగించాలని, తప్పుడు నివేదిక ఇచ్చిన తహసీల్దార్, ఆర్డీవోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment