tonsure
-
దారుణం : అనుమానంతో భార్యకు గుండు కొట్టించి..
సాక్షి, చీమకుర్తి : భార్య.. రెండు అక్షరాల పదం.. భర్తతో మూడు ముళ్లు వేయించుకొని.. ఏడడుగులు నడిచి.. తల్లి దండ్రలను విడిచి, తాళి కట్టిన వాడితో కష్టసుఖాల్లో తోడుగా నిలిచేదే భార్య. అలాంటి ఆమెను సంతోషంగా చూసుకోవాల్సింది పోయి.. చిత్ర హింసలకు గురిచేశాడో భర్త. అనుమానం పెంచుకొని ఊరందరి ముందు భార్యను దారుణంగా అవమానించాడు. నాగరికత రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్నకాలంలో అనాగరిక చర్యకు పాల్పడ్డాడు ఓ భర్త. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అమానవీయ చర్య చోటుచేసుకంది. సమాజం సిగ్గుతో తలదించుకొనే రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం మంచికలపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మిలకు ఎనిమిదేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఎనిమిదేళ్ల అనంతరం భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస రావు భాగ్యలక్ష్మిని వేధించడం మొదలు పెట్టారు. మంచీ చెడు చెప్పాల్సిన శ్రీనివాస రావు తండ్రి, కొడుకును సమర్దిస్తూ వేధింపుల్లో వాట పంచుకున్నాడు. ప్రతి గుడికి తీసుకెళ్తూ.. మరోసారి ఆ పని చేయనంటూ ఆమె చేత చెప్పిస్తూ చెంపలేయించారు. ఇంత దారుణం జరుగుతున్న ఏ ఒక్కరు ఆమెకు మద్దతుగా రాలేదు. అనంతరం కాపురం చేయలేనంటూ పుట్టింటికి పంపించాడు. అయితే బంధువులు వత్తడి తీసుకురావడంతో భాగ్యలక్ష్మిని ఇంటికి తీసుకువచ్చాడు. కానీ వేరే గదిలో ఉండాలంటూ హెచ్చరించాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు గుండు కొట్టించి, ముఖానికి నలుపు రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. నాలుగు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి భాగ్యలక్ష్మిని విచారించగా.. ఫిర్యాదు ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. చివరకు కుటుంబ సభ్యుల మద్దతుతో మహిళ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
సత్యం ‘సమాధి’
వెంకటాయపాలెం(రామచంద్రపురం రూరల్): రెండు దశాబ్దాల క్రితం నాటి కేసు.. ఎలాగైనా బయటపడేందుకు అధికార బలం ప్రయోగించారు. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి లొంగదీసుకున్నారు. బాధితుల కులాన్నే మార్చేశారు. వారు దళితులు కాదని నిరూపించేందుకు పాత సమాధికి కొత్త పేరు తగిలించారు. దాన్ని ఫొటో తీసి కోర్టుకు అందజేశారు. అలాగే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఏకంగా న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగించిన అరాచకమిది. 18 దళిత సంఘాల నిజనిర్ధారణ కమిటీ విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. నిజ నిర్ధారణ కమిటీ వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 21 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ కేసు కోర్టుల్లో నలుగుతూనే ఉంది. ఏడాదిన్నర కాలంగా విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో తుది తీర్పు ఇచ్చే సమయంలో... కేసు నుంచి బయటపడేందుకు తోట త్రిమూర్తులు కొత్త ఎత్తుగడ వేశారు. ఎస్సీలు కాదని నిరూపించేందుకు.. కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని శిరోముండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శిరోముండనం బాధితులు అసలు దళితులే కాదని, క్రైస్తవ మతం స్వీకరించారని, ‘బీసీ–సి’ వర్గానికి చెందినవారని నిరూపించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పావులు కదిపారు. ఇందులో భాగంగా మండల తహసీల్దార్, గ్రామ వీఆర్వోలను సెలవుపై పంపించారు. తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి వెంటనే ఆ పత్రాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోగా బాధితులు ఎస్సీలు కాదని, క్రైస్తవ మతం స్వీకరించారంటూ ఎమ్మెల్యే త్రిమూర్తులు గ్రామంలోని తన పాలేరు కాలుకుర్చ జీవరత్నంతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయించారు. దీనికి సాక్ష్యంగా స్మశానంలో బాధితుడు కోటి చినరాజు తల్లి నాగమ్మ సమాధి అంటూ శిలువ ఉన్న ఒక పాత సమాధి ఫొటోను జత చేశారు. బాధితులు చినరాజు, వెంకటరత్నంలు రామచంద్రపురంలోని ఏసు ప్రేమాలయం చర్చిలో క్రైస్తవ మతం స్వీకరించారని, అందుకు తానే సాక్ష్యమని పాస్టర్ పేరిట ఎన్.శామ్యూల్ రాజు అనే వ్యక్తితో చెప్పించారు. ఆ వివరాలతో బాధితులు క్రైస్తవ మతానికి చెందినవారేనని తహసీల్దార్, ఆర్డీవోలు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన 18 దళిత సంఘాల నేతలు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి తహసీల్దార్‌ను, ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులను, గ్రామస్తులను విచారించారు. ఈ విచారణలో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. బాధితులు ఎస్సీలు కాదని నిరూపించేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలపై ఫొటోలు, వీడియో సాక్ష్యాలను కమిటీ సభ్యులు సేకరించారు. బాధ్యులను సస్పెండ్ చేయాలి వెంకటాయపాలెం గ్రామ స్మశానంలో ప్రొద్దోకు లక్ష్మి క్రైస్తవ మహిళ సమాధి ఉంది. దానిపై శిలువ, ముందు వైపున ఆమె పేరుతో శిలాఫలకం ఉంది. అదే సమాధి వెనుక వైపున కోటి నాగమ్మ పేరిట మరో శిలాఫలకాన్ని అతికించి, దానిని ఫొటో తీసి, జాయింట్ కలెక్టర్ కోర్టుకు సమర్పించారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గుర్తించారు. అలాగే, శామ్యూల్‌రాజు అనే పాస్టర్ తమ చర్చిలో లేరని ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి, క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా దళితులకు అన్యాయం చేసేలా నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా బాధితులకు ఎస్సీ కుల ధ్రువపత్రాలను అందించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును పదవి నుంచి తొలగించాలని, తప్పుడు నివేదిక ఇచ్చిన తహసీల్దార్, ఆర్డీవోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
తలనీలాలు సమర్పిస్తున్న జయ అభిమానులు
-
జుట్టు పంచాయితీ.. తెగేదెప్పుడు?
సాక్షి, హన్మకొండ: మేడారం జాతర సమయం దగ్గర పడుతున్నా తలనీలాలు సేకరించే పని ఎవరికి అప్పగించాలనే అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గత జాతరలో నిర్వహించిన మాదిరిగానే నామినేషన్ పద్ధతినే కొనసాగించాలని పూజారుల సంఘం కోరుతుండగా.. టెండర్‌తో మరింత ఆదాయం సమకూరుతుందని దేవాదాయశాఖ వాదిస్తోంది. తలనీలాల పనులు తమకు కేటాయించకుంటే జాతర పనులకు సహకరించబోమంటూ డిసెంబరు 15న పూజారుల సంఘం సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. నెల రోజులు గడుస్తున్నా దేవాదాయశాఖ నుంచి ఎటువంటి స్పందనా లేదు. మరోవైపు జాతరకు మరో ఇరవై రోజులే గడువు ఉంది. ఇప్పటికే ప్రతీ ఆది, బుధవారాల్లో వేలసంఖ్యలో భక్తులు మేడారానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలా.. మేడారం జాతర 1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో జారత సాగుతోంది. జాతర ద్వారా సమకూరే ఆదాయంలో 33 శాతాన్ని పూజారుల సంఘానికి చెల్లిస్తారు. అదేవిధంగా జాతరలో భక్తులు మొక్కుగా సమర్పించే తలనీలాలను.. సేకరించే పనిని నామినేషన్ పద్ధతిపై పూజారుల సంఘానికి అప్పగిస్తున్నారు. ఈ తలనీలాల సేకరణ ద్వారా దేవాదాయశాఖ ప్రమేయం లేకుండా పూజారుల సంఘానికి మరికొంత ఆదాయం సమకూరుతోంది. గత జాతర సమయంలో 80 లక్షల మంది హాజరవుతారని భావించి రూ.42 లక్షలు చెల్లించి పూజారుల సంఘం తలనీలాల సేకరణ పనులు(తల వెంట్రుకలను సేకరించడం) దక్కించుకుంది. ఈసారి కోటికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో రూ.75 లక్షలు చెల్లించేందుకు పూజారుల సంఘం సిద్ధమైంది. ఇప్పుడు టెండర్లకు మొగ్గు.. అంతర్జాతీయ మార్కెట్లో తలనీలాలకు డిమాండ్ ఉండడంతో నామినేషన్ పద్ధతిన పూజారుల సంఘానికే ఇ వ్వడం కాకుండా టెండర్లు పిలిస్తే కాం ట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి ఎక్కు వ ఆదాయం వస్తుందని దేవాదాయ శా ఖ అంచనా వేస్తోంది. 2014 జాతర విషయంలో తలనీలాల సేకరణకు టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయిం చింది. టెండర్ల పద్ధతిలో కాంట్రాక్టర్లు రింగైతే మొత్తం దేవాదాయశాఖకు వచ్చే రాబడి తగ్గిపోతుందని, ఫలితం గా తమకు వచ్చే 33 శాతం ఆదాయంపై కోత పడుతుందని పూ జారులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. గతంలో 2004, 2006 జాతర సమయాల్లో టెండర్లు పిలిస్తే పది లక్షలకు మించి ధర పలకలేదు. దాంతో 2008 జాతర నుంచి మళ్లీ నామినేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. మళ్లీ విఫలమైన ప్రయోగాన్ని తమ నెత్తిన ఎందుకు రుద్దుతారంటూ పూజారుల సంఘం వాదిస్తోంది. మమ్మల్ని దూరం పెడుతున్నారు. జాతరలో రానురాను తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందని వడ్డెలు(గిరిజన పూజారులు) ఆందోళన చెందుతున్నా రు. క్రమంగా హిందూ మత ప్రభావానికి తోడు వ్యాపార ధోరణి పెరిగిపోతున్నదని చెబుతున్నారు. వీటి కారణంగా తమ ఆచారాలకు ప్రాధాన్యం తగ్గుతుందన్న ఆవేదన గిరిజనుల నుంచి వ్యక్తమవుతోంది. తమ చేతి నుంచి ఒక్కో వ్యవహారాన్ని క్రమంగా దేవాదాయ శాఖ దూరం చేస్తున్నదని, అందులో భాగంగా పనులను తమకు కాకుండా చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. జాతర గడువు సమీపిస్తున్నా తలనీలాల సేకరణపై ఏ విషయమూ తేల్చకపోవడం తమను అవమానించడమేనని గిరిజన పూజారులు అంటున్నారు. -
తాళ్లతో బంధించి ప్రియురాలికి శిరోముండనం
కొయ్యూరు : సహజీవనం చేస్తున్న ప్రియుడే అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. డబ్బు తెమ్మని వేధిస్తూ... అంగీకరించని ప్రియురాలిని బంధించి శిరోముండనం చేశాడు. ఎస్ఐ తెలిపిన కథనం ప్రకారం... బంగారంపేట పంచాయతీ గుజ్జువానిపాలేనికి చెందిన కూడా లోవ దుర్గ, శరభన్నపాలేనికి చెందిన సంపర బాలకుమార్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ శరభన్నపాలెంలో సహజీవనం చేస్తున్నారు. కొన్ని నెలలుగా బాలకుమార్ తరచు డబ్బులు తెమ్మని దుర్గను వేధించేవాడు. దీంతో ఆమె సర్పంచ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. ఇది మంచి పద్దతి కాదని సర్పంచ్ సహా పెద్దలు కుమార్‌కు హితవు పలికారు. దీన్ని మనసులో పెట్టుకున్న కుమార్ ఆమెను మరింత వేధించటం మొదలుపెట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆగ్రహించిన కుమార్....దుర్గ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి బ్లేడుతో శిరోముండనం చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.