మేడారం జాతర సమయం దగ్గర పడుతున్నా తలనీలాలు సేకరించే పని ఎవరికి అప్పగించాలనే అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు
సాక్షి, హన్మకొండ:
మేడారం జాతర సమయం దగ్గర పడుతున్నా తలనీలాలు సేకరించే పని ఎవరికి అప్పగించాలనే అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గత జాతరలో నిర్వహించిన మాదిరిగానే నామినేషన్ పద్ధతినే కొనసాగించాలని పూజారుల సంఘం కోరుతుండగా.. టెండర్‌తో మరింత ఆదాయం సమకూరుతుందని దేవాదాయశాఖ వాదిస్తోంది. తలనీలాల పనులు తమకు కేటాయించకుంటే జాతర పనులకు సహకరించబోమంటూ డిసెంబరు 15న పూజారుల సంఘం సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. నెల రోజులు గడుస్తున్నా దేవాదాయశాఖ నుంచి ఎటువంటి స్పందనా లేదు. మరోవైపు జాతరకు మరో ఇరవై రోజులే గడువు ఉంది. ఇప్పటికే ప్రతీ ఆది, బుధవారాల్లో వేలసంఖ్యలో భక్తులు మేడారానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇప్పటి వరకు ఇలా..
మేడారం జాతర 1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో జారత సాగుతోంది. జాతర ద్వారా సమకూరే ఆదాయంలో 33 శాతాన్ని పూజారుల సంఘానికి చెల్లిస్తారు. అదేవిధంగా జాతరలో భక్తులు మొక్కుగా సమర్పించే తలనీలాలను.. సేకరించే పనిని నామినేషన్ పద్ధతిపై పూజారుల సంఘానికి అప్పగిస్తున్నారు. ఈ తలనీలాల సేకరణ ద్వారా దేవాదాయశాఖ ప్రమేయం లేకుండా పూజారుల సంఘానికి మరికొంత ఆదాయం సమకూరుతోంది. గత జాతర సమయంలో 80 లక్షల మంది హాజరవుతారని భావించి రూ.42 లక్షలు చెల్లించి పూజారుల సంఘం తలనీలాల సేకరణ పనులు(తల వెంట్రుకలను సేకరించడం) దక్కించుకుంది. ఈసారి కోటికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో రూ.75 లక్షలు చెల్లించేందుకు పూజారుల సంఘం సిద్ధమైంది.
ఇప్పుడు టెండర్లకు మొగ్గు..
అంతర్జాతీయ మార్కెట్‌లో తలనీలాలకు డిమాండ్ ఉండడంతో నామినేషన్ పద్ధతిన పూజారుల సంఘానికే ఇ వ్వడం కాకుండా టెండర్లు పిలిస్తే కాం ట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి ఎక్కు వ ఆదాయం వస్తుందని దేవాదాయ శా ఖ అంచనా వేస్తోంది. 2014 జాతర విషయంలో తలనీలాల సేకరణకు టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయిం చింది. టెండర్ల పద్ధతిలో కాంట్రాక్టర్లు రింగైతే మొత్తం దేవాదాయశాఖకు వచ్చే రాబడి తగ్గిపోతుందని, ఫలితం గా తమకు వచ్చే 33 శాతం ఆదాయంపై కోత పడుతుందని పూ జారులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. గతంలో 2004, 2006 జాతర సమయాల్లో టెండర్లు పిలిస్తే పది లక్షలకు మించి ధర పలకలేదు. దాంతో 2008 జాతర నుంచి మళ్లీ నామినేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. మళ్లీ విఫలమైన ప్రయోగాన్ని తమ నెత్తిన ఎందుకు రుద్దుతారంటూ పూజారుల సంఘం వాదిస్తోంది.
మమ్మల్ని దూరం పెడుతున్నారు.
జాతరలో రానురాను తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందని వడ్డెలు(గిరిజన పూజారులు) ఆందోళన చెందుతున్నా రు. క్రమంగా హిందూ మత ప్రభావానికి తోడు వ్యాపార ధోరణి పెరిగిపోతున్నదని చెబుతున్నారు. వీటి కారణంగా తమ ఆచారాలకు ప్రాధాన్యం తగ్గుతుందన్న ఆవేదన గిరిజనుల నుంచి వ్యక్తమవుతోంది. తమ చేతి నుంచి ఒక్కో వ్యవహారాన్ని క్రమంగా దేవాదాయ శాఖ దూరం చేస్తున్నదని, అందులో భాగంగా పనులను తమకు కాకుండా చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. జాతర గడువు సమీపిస్తున్నా తలనీలాల సేకరణపై ఏ విషయమూ తేల్చకపోవడం తమను అవమానించడమేనని గిరిజన పూజారులు అంటున్నారు.