ఆ జీఓను రద్దు చేయాలి
ఆ జీఓను రద్దు చేయాలి
Published Mon, Sep 26 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
శిరోముండనం కేసులో పీపీ తొలగింపుపై నిరసన
ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా
రామచంద్రపురం: వెంకటాయపాలెం శిరోముండనం కేసులో బాధితుల తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తొలగిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఆ జీవోను నిరసిస్తు సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ, ఏఐకేఎంఎస్, దళిత సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రజా సంఘాల నాయకుడు చీకట్ల వెంకటేశ్వరరావు, జె.æ సత్తిబాబు, ఆర్. రాగులు, జి. ఆదినారాయణ, వి. భీమశంకరం, వైఎస్సార్ సీసీ నాయకుడు పెట్టా శ్రీనివాసరావు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బి. సిద్ధూ తదితరులు మాట్లాడుతూ పీపీని తొలగించి ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తోట త్రిమూర్తులును భుజాన మోస్తూ దళితులకు అన్యాయం చేసిందని విమర్శించారు. ఆ జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని, లేనిపక్షంలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాయన్నారు. ఈమేరకు ఆర్డీఓ కె. సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు. తొలుత ప్రధాన రహదారిలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం కళ్లకు నల్లబ్యాడ్జిలు కట్టారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. వెంకటాయపాలెం ఎంపీటీసీ సభ్యుడు దడాల రవికుమార్, నాయకులు దడాల వెంకటరమణ, బొమ్ము మోహనరావు, మందపల్లి చిట్టిబాబు, దొమ్మలపాటి శ్యాం, వినకోటి కొండ, పలివెల ప్రభాకర్, బొమ్ము సతీష్, ఇసుకపట్ల కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement