నారాయణ్‌పేట్: రాజకీయ సమీకరణలకు కేరాఫ్‌గా నిలిచే పాలమూరుపైనే ప్రధాన రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ మరింత క్రియాశీలకంగా రంగంలోకి దిగుతున్నాయి. దక్షిణ తెలంగాణలో పాగా వేయాలంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానే కీలకమని భావించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇందుకనుగుణంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి.
పీఆర్‌ఎల్‌ఐఎస్‌తో షురూ..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు బీఆర్‌ఎస్ ఏడు, కాంగ్రెస్ ఐదు, టీడీపీ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల క్రమంలో నారాయణపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన రాజేందర్‌రెడ్డి, మక్తల్‌లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి కారెక్కారు.
అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో 13 స్థానాలను బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్కడు బీరం హర్షవర్ధన్‌రెడ్డి గెలుపొందినా.. ఆయన సైతం గులాబీ చెంతన చేరారు. ఈ గణాంకాలు బీఆర్‌ఎస్ ఆధిక్యతకు నిదర్శనంగా నిలుస్తుండగా.. ఆధిక్యాన్ని నిలుపుకునేందుకు ఆ పార్టీ పాలమూరునే ఎంచుకుంది.
ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్‌లో మొదటి పంప్‌ను ప్రారంభించిన ఆయన.. పరోక్షంగా ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు.
కమలదళం సైతం..
ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాలమూరులోని జోగుళాంబ సాక్షిగా బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల గుండా సాగిన యాత్ర ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అప్పటి నుంచి బీజేపీ ముఖ్యనేతలు క్రమం తప్పకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యటించారు.
మరోవైపు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరులో భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల శంఖరావాన్ని పూరించారు. ఇప్పటి వరకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనప్పటికీ.. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి నిత్యం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.
మొత్తానికి ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలలు ప్రత్యేక దృష్టి సారించడం వెనుక బృహత్తర ప్రణాళిక ఉందని.. దక్షిణ తెలంగాణలో పాగా వేసేలా ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ బస్సు యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పాలమూరులో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. వివిధ నియోజకవర్గాల గుండా సాగిన పాదయాత్రతో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. అదేవిధంగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పాలమూరు గుండానే కొనసాగింది. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, భట్టి తదితర ముఖ్యనేతలు ఉమ్మడి జిల్లాపైనే నజర్ వేసి పలు పర్యాయాలు పర్యటించారు.
తాజాగా వారంలో అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితర స్టార్ క్యాంపెయినర్లతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సన్నద్ధమవుతున్న హస్తం నేతలు జోగుళాంబ అమ్మవారి సాక్షిగా అలంపూర్ నుంచి కొనసాగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment