(కేజీ రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 10 వేల కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ) ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. తొలి విడతతో ప్రయోగాత్మకంగా 1,367 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఢిల్లీ–ముంబై జాతీయ రహదారితోపాటు 512 కిలోమీటర్ల మేర హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారులను డిజిటల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది.
ఇందుకోసం ప్రత్యేకంగా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) కూడా ఏర్పాటు చేసింది. జాతీయ రహదారి పక్కన 3 మీటర్ల మేర డెడికేటెడ్ కారిడార్‌లో ఓఎఫ్‌సీ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి సైతం డిజిటల్ రోడ్డుగా మారనుంది.
డిజిటల్ రోడ్ల ఏర్పాటుతో ఈ రహదారి వెంట 5జీ, 6జీ నెట్‌వర్క్ సేవలు లభించడంతోపాటు రహదారి వెంట ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఈ కేబుల్ నెట్‌వర్క్‌ను ఎక్కడికక్కడ వినియోగించుకునేందుకు ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా ఈ రహదారి వెంట ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీల ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది.
ఐటీ కంపెనీల ఏర్పాటుకూ అనుకూలం
జాతీయ రహదారి వెంట ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయి. హైదరాబాద్–బెంగళూరు రహదారి వెంట ఉన్న తెలుగు రాష్ట్రాల్లో గల జడ్చర్ల, కర్నూలు, అనంతపురం, గుత్తి, హిందుపూర్ వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉండనుంది. డిజిటల్ రోడ్ల వల్ల టైర్–2, 3 పట్టణాల్లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుంది.
♦ హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేసే సంతోష్ అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరాడు. మధ్యలో కంపెనీ నుంచి ఫోనొచ్చింది. అర్జెంటుగా క్లయింట్‌తో మాట్లాడమని. దగ్గరలోనే రహదారి వెంట ఏర్పాటైన ప్లగ్ అండ్ ప్లే వర్క్ స్టేషన్‌లోకి వెళ్లి క్లయింట్‌తో మాట్లాడిన సంతోష్ క్లయింట్‌కు గల అనుమానాలను నివృత్తి చేశారు. తన హెడ్‌కు ఇదే విషయాన్ని కమ్యూనికేట్ చేశాడు. కంపెనీ నుంచి సంతోష్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.
♦ హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న రమేష్‌కు ఓ అలర్ట్ వచ్చింది. ఆ రహదారిలో యాక్సిడెంట్ అయ్యిందని.. రాకపోకలు స్తంభించిపోయాయని.. రోడ్డు క్లియర్ అయ్యేందుకు మరో గంట సమయం పడుతుందని అందులోని సారాంశం. దీంతో రమేష్ ప్రత్యామ్నాయ మార్గంలో తన ప్రయాణం కొనసాగించి సకాలంలో ఇంటికి చేరుకున్నాడు. ఇవేకాదు.. రానున్న రోజుల్లో డిజిటల్ రోడ్ల ఏర్పాటుతో మరింత సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు దారి వెంట మారుమూల ప్రాంతాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి 5జీ, 6జీ సేవలు లభించనున్నాయి.
ప్రయోజనాలివీ..!
♦ జాతీయ రహదారి వెంట వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ తెలిసే అవకాశం ఉండటంతో రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయి. వాహనం నడిపే డ్రైవర్లకు అవసరమైన, కచ్చితమైన సమాచారం అందుతుంది.
♦ రియల్ టైం డేటాను ప్రయాణికులకు అందించడం ద్వారా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు మరింత మెరుగ్గా అవకాశం కలుగుతుంది. ప్రమాదాలను నివారించే అవకాశం ఏర్పడుతుంది. పక్కా సమాచారం అందటం వల్ల ప్రయాణ సమయం కూడా తగ్గనుంది.
♦ డ్రోన్లను వినియోగించుకునే వీలు కలుగుతుంది. తద్వారా రిమోట్ ఏరియాల్లో సమాచారాన్ని కూడా పొందవచ్చు. ప్రతిసారి ఏవైనా పనులు చేపట్టే సంస్థ సైట్ విజిట్స్‌ను తగ్గించుకోవచ్చు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు ఏరియల్ సర్వే చేసే వీలవుతుంది.
♦ డ్రైవర్ అవసరం లేకుండా రోడ్లపై పరుగులు పెట్టనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా నడిచే వాహనాల వినియోగానికి ఈ రహదారులు మరింత అనువుగా ఉండనున్నాయి.
♦ ఈ రహదారులు మొత్తం కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించే వీలుంది. తద్వారా జాతీయ రహదారి వెంట ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే వీలు కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment