న్యూఢిల్లీ: జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదని చైర్మన్ ఎన్‌ఎన్ సిన్హా స్పష్టం చేశారు. చాలా బలమైన స్థితిలోనే ఎన్‌ఎచ్‌ఏఐ ఉందని, ప్రణాళికలో ఎన్నో ప్రాజెక్టులు కూడా ఉన్నట్టు తెలిపారు. గతేడాది 3,300 కిలోమీటర్ల మేర రహదారుల ప్రాజెక్టులను చేపట్టగా, ప్రస్తుత ఏడాది 4,500 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులను నిర్మించనున్నామని ఆయన చెప్పారు. ‘‘ఎన్‌హెచ్‌ఏఐకు అనిశ్చయ నష్టాలు రూ.3 లక్షల కోట్ల మేర ఉంటాయని మీడియాలోని కొన్ని సెక్షన్లలో కథనాలు వచ్చాయి. ‘‘అనిశ్చయ నష్టాలను వారు సరిగా అర్థం చేసుకోకపోవడం లేదా ఆ గణాంకాలను పొరపాటుగా పేర్కొనడం జరిగింది. అనిశ్చయ నష్టాలన్నవి సహజంగానే అస్పష్టతతో ఉంటాయి.
మా పరిశీలన, చెల్లింపుల రేషియో ప్రకారం చూస్తే ఆ స్థాయి నష్టాలేమీ ఉండబోవు. ఎన్‌హెచ్‌ఏఐ నుంచి క్లెయిమ్ బాధ్యతలన్నవి రూ.70,000 కోట్ల వరకు ఉంటాయి’’ అని సిన్హా వివరించారు. అదే సమయంలో తమకు ఎన్నో రూపాల్లో ఆదాయం ఉందని వివరించారు. అనిశ్చితిని సృష్టించడానికే సంబంధిత కథనాలను సృష్టించినట్టుగా ఉందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గడిచిన ఏడాదితో పోలిస్తే వెయ్యి కిలోమీటర్ల మేర అదనంగా రహదారులను ఈ ఏడాది నిర్మించనున్నట్టు చెప్పారు. బడ్జెట్ నుంచి మరిన్ని నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల నుంచి వచ్చే ఆదాయానికి అదనంగా, మార్కెట్ నుంచి నిధులను కూడా సమీకరించనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ను తీసుకువస్తామని, కేబినెట్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment