సాక్షి, అమరావతి: దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్ల బాధ్యత కాలాన్ని రెట్టింపు చేసింది. అందుకోసం జాతీయ రహదారుల డ్యామేజీ లయబిలిటీని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచింది. ఈమేరకు కాంట్రాక్టర్లకు విధి విధానాలను నిర్దేశించింది. దేశంలో భారీగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు జాతీయ రహదారుల నిర్వహణ లోపం కూడా ఓ ప్రధాన కారణమని నిపుణుల కమిటీ ఇటీవల నివేదించింది.
2022లో దేశంలో సంభవించిన 4.61 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది దుర్మరణం చెందారు. వాటిలో అత్యధికంగా 33 శాతం ప్రమాదాలు జాతీయ రహదారులపైన జరిగినవే. మొత్తం ప్రమాద మృతులు 1.68 లక్షల మందిలో జాతీయ రహదారులపై ప్రమాదాల్లోనే 24 శాతం మంది అంటే 41 వేల మంది దుర్మరణం చెందారు. 2021లో కంటే 2022లో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. మృతుల సంఖ్య 9శాతం పెరిగింది.
జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిర్వహణ లోపం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో హైవేల నిర్వహణ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ రహదారులను నిర్మిస్తున్న కాంట్రాక్టు సంస్థలు ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ చేపడుతున్నాయి. ఆ ఐదేళ్లలో రోడ్ల నిర్వహణ, గుంతలు పూడ్చడం, ఇతరత్రా మరమ్మతులు చేస్తాయి. ఆ తర్వాత ఆ బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగిస్తున్నాయి.
కానీ పలు కాంట్రాక్టు సంస్థలు కేవలం ఐదేళ్లే నాణ్యతతో ఉండేలా హైవేలను నిర్మిస్తున్నాయని ఎన్‌హెచ్‌ఏఐ ఆడిటింగ్ నివేదిక వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత ఆ రోడ్లు దెబ్బతింటున్నాయి. వాటి నిర్వహణ భారం ఎన్‌హెచ్‌ఏఐపై పడుతోంది. దీనికి పరిష్కారంగానే నిర్వహణ బాధ్యతను పదేళ్లకు పెంచాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఈపీసీ, యాన్యుటీ, బీవోటీ పద్దతుల్లో నిర్మించే జాతీయ రహదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది.
తక్షణం అమలులోకి
ఎన్‌హెచ్‌ఏఐ నూతన విధానాన్ని తక్షణం అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఆమోదించిన జాతీయ రహదారుల నిర్మాణాలకు కొత్త విధానాన్ని వర్తింపజేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టినవాటికి, త్వరలో చేపట్టబోయే వాటికి కూడా ఈ విధానం వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా రూ.7.81 లక్షల కోట్లతో 25,713 కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించింది.
వాటిలో ఈపీసీ విధానంలో 56 శాతం, 42శాతం యాన్యుటీ విధానంలో, 2 శాతం బీవోటీ విధానంలో నిర్మించనుంది. వీటి నిర్మాణాన్ని చేపట్టే కాంట్రాక్టు సంస్థలు పదేళ్లపాటు వాటి నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను చేపట్టాలి. తాజా నిర్ణయం వల్ల జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత పెరుగుతుందని, నిర్వహణ కూడా సక్రమంగా ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment