న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ప్రయాణీకుల సౌకర్యం కోసం దేశంలోని జాతీయ రహదారుల వెంట ఆధునిక వసతులను కల్పించనుంది. వచ్చే ఐదేళ్లలో 22 రాష్ట్రాల్లో హైవే మార్గాలలో 600కు పైగా ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 130 ప్రాంతాల్లో 2021-22లో అభివృద్ధి చేయాలని లక్ష్యించినట్లు. ఇప్పటికే 120 ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ధికి బిడ్లను ఆహ్వానించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్‌లు, భవిష్యత్తులో రాబోయే రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే మార్గాలలో ప్రతి 30-50 కి.మీ.లకు ఈ సౌకర్యాలుంటాయని పేర్కొంది. పెట్రోల్ బంక్‌లు, ఎలక్ట్రిక్ చార్జీంగ్ సదుపాయాలు, ఫుడ్ కోర్ట్‌లు, రిటైల్ షాపులు, బ్యాంక్ ఏటీఎంలు, మరుగుదొడ్లు, పిల్లల ఆట స్థలాలు, క్లినిక్‌లు, స్థానిక హస్తకళల కోసం విలేజ్ హట్‌లు, ట్రక్ మరియు ట్రెయిలర్ పార్కింగ్, ఆటో వర్క్‌షాప్స్, దాబా, ట్రక్కర్ వసతి గృహాలు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది.
దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏకు ఉన్న 3 వేల హెక్టార్ల స్థలంలో ఆయా వసతులను అభివృద్ధి చేస్తుంది. దీంతో ఆయా మార్గాలలో పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు, రిటైలర్లకు భారీ అవకాశాలు వస్తాయని, అలాగే స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ రహదారుల అభివృద్ధి, కార్యకలాపాల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో రాబోయే కొత్తగా నిర్మించే/విస్తరించే జాతీయ రహదారి ప్రాజెక్ట్‌ల వెంట ఆధునిక వసతులు, లాజిస్టిక్ పార్క్‌లు తప్పనిసరిగా ఉంటాయని తెలిపింది. స్థలాల గుర్తింపు, ఆదాయ ప్రణాళికలు, స్థానిక అనుకూలతలు, సౌకర్యాల డిజైన్ రూపకల్పన వంటి అంశాలపై ఎన్‌హెచ్‌ఏఐ నిమగ్నమైంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment