సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై టోల్‌గేట్లు త్వరలో కనుమరుగు కానున్నాయి. టోల్‌ఫీజు చెల్లింపునకు టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులుతీరిన దృశ్యాలు కొన్నాళ్ల తరువాత కనిపించవు కూడా. ఎందుకంటే టోల్‌ఫీజు వసూలు కోసం కొత్త విధానంపై జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కసరత్తు చేస్తోంది. రెండు టోల్‌గేట్ల మధ్య దూరాన్ని బట్టి టోలుఫీజు వసూలు చేస్తున్న విధానానికి స్వస్తి పలకాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి టోల్‌ఫీజు వసూలు చేసేందుకు ఉపగ్రహ ఆధారిత ‘గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం’ (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. పాశ్చాత్య దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది.
హేతుబద్ధంగాలేని ప్రస్తుత విధానం
ప్రస్తుతం జాతీయ రహదారులపై రెండు టోల్‌గేట్ల మధ్య దూరాన్ని బట్టి టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. వాహనాలు టోల్‌గేటు వద్దకు చేరుకోగానే వాటిపై ఉన్న ఫాస్టాగ్‌ను స్కాన్‌చేసి సంబంధిత ఫీజు మొత్తం ఆ ఖాతా నుంచి ఆటోమేటిగ్గా వసూలు చేస్తున్నారు. వాహనాలు ఆ రెండు టోల్‌గేట్ల మధ్య దూరాన్ని పూర్తిగా ప్రయాణిస్తే ఆ ఫీజు హేతుబద్ధమే. కానీ రెండు గేట్ల మధ్య పూర్తి దూరాన్ని ప్రయాణించకపోయినా ఈ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మీదుగా గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న వాహనాలు గుంటూరు జిల్లాలో కాజ వద్ద టోల్ ఫీజు చెల్లించాలి.
మళ్లీ ఆ రహదారిపై 66 కిలోమీటర్ల తరువాత కలపర్రు వద్ద టోల్‌గేట్ ఉంది. అంటే కాజ నుంచి కలపర్రు వరకు 66 కిలోమీటర్ల ప్రయాణానికి కాజ టోల్‌గేట్ వద్ద ఫీజు చెల్లిస్తున్నారు. కాజా నుంచి కలపర్రు వరకు ప్రయాణించే వాహనాలకు ఆ టోల్‌ఫీజు సహేతుకమే. కానీ వాహనాలు కాజ గేటు దాటిన తరువాత విజయవాడ వరకుగానీ, గన్నవరం వరకుగానీ ప్రయాణించినా సరే.. కలపర్రు వరకు అంటే 66 కిలోమీటర్ల దూరానికి టోల్‌ఫీజు చెల్లించాల్సి వస్తోంది. టోల్‌గేటు దాటి ఒక కిలోమీటరు ప్రయాణించినా సరే మొత్తం 66 కిలోమీటర్లకు టోలుఫీజు చెల్లించాల్సిందే. ఈ విధంగా దేశంలో ఉన్న వెయ్యికిపైగా టోల్‌గేట్లలో ప్రస్తుతం ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో 4.50 కోట్లకుపైగా ఫాస్టాగ్ కలిగిన వాహనదారులు తాము ప్రయాణించే దూరానికి మించి టోల్‌ఫీజు చెల్లిస్తున్నారు.
నావిగేషన్ టోల్‌ఫీజు విధానం ఇలా..
టోల్‌ఫీజు విధానాన్ని మరింత హేతుబద్ధీకరించేందుకు జీఎన్‌ఎస్‌ఎస్ ప్రవేశపెట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది. ఈ విధానంలో ఒక వాహనం జాతీయ రహదారిపై ప్రయాణించే దూరాన్ని బట్టి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్‌ఫీజు వసూలు చేస్తారు. అంటే వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్నప్పటి నుంచి ఆ దారిలో ప్రయాణించే దూరాన్ని జీఎన్‌ఎస్‌ఎస్ విధానంలో పరిశీలించి టోల్ వసూలు చేస్తారు. జాతీయ రహదారిపై నుంచి పక్కకు జరగగానే ప్రయాణించిన దూరాన్ని ఆటోమేటిగ్గా లెక్కించి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్‌ఫీజు తీసుకుంటారు. ఈ విధానంలో జాతీయ రహదారిపై ఎంతదూరం ప్రయాణిస్తే అందుకుతగ్గ టోల్‌ఫీజే వసూలు చేస్తారు. ఇక టోల్‌గేట్లు ఉండవు. కాబట్టి జాతీయ రహదారులపై టోల్‌ఫీజు చెల్లింపునకు వాహనాలు బారులు తీరాల్సిన అవసరం ఉండదు. దీంతో వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా అవుతాయి.
ఐరోపా దేశాల్లో ప్రస్తుతం విజయవంతంగా అమలవుతున్న ఈ జీఎన్‌ఎస్‌ఎస్ విధానాన్ని మనదేశంలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల అభివృద్ధిశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. ఈ విధానంపై ఎన్‌హెచ్‌ఏఐ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టును పరిశీలిస్తోంది. దేశంలో 1.37 లక్షల వాహనాల నుంచి ప్రస్తుతం ఈ విధానంలో టోల్‌ఫీజు ప్రయోగాత్మకంగా వసూలు చేస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టుపై రష్యా, దక్షిణ కొరియాలకు చెందిన నిపుణులు త్వరలో నివేదిక సమర్పించనున్నారు. అనంతరం జీఎన్‌ఎస్‌ఎస్ విధానం అమలుపై ఎన్‌హెచ్‌ఏఐ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అందుకోసం అవసరమైతే జాతీయ రవాణా విధానంలో సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
టోల్‌గేట్లకు త్వరలో టాటా
Published Tue, May 3 2022 4:15 AM | Last Updated on Tue, May 3 2022 4:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment